Saturday, May 30, 2026
E-PAPER
Homeబీజినెస్దలాల్‌ స్ట్రీట్‌‌పై బేర్‌ పంజా

దలాల్‌ స్ట్రీట్‌‌పై బేర్‌ పంజా

- Advertisement -

సెన్సెక్స్‌ 1092 పాయింట్ల పతనం
రూ.6 లక్షల కోట్ల సంపద ఆవిరి
యుఎస్‌-ఇరాన్‌ శాంతి ఒప్పందంపై అనిశ్చితి ప్రభావం


ముంబయి: దలాల్‌ ‌స్ట్రీట్‌‌ను పశ్చిమాసియా ఘర్షణలు మరోమారు బెంబేలెత్తించాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందం విషయంలో అనిశ్చితి, ఎఫ్‌ఐఐల విక్రయాలు కొనసాగుతుండటంతో వారాంతం సెషన్‌‌లో మార్కెట్లు భారీ నష్టాలను చవి చూశాయి. దీంతో సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్ఠాల నుంచి 1300 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 23,550 దిగువకు పడిపోయింది. ఒక్క పూటలోనే మదుపర్ల సంపద రూ.6లక్షల కోట్లు మేర ఆవిరయ్యింది. శుక్రవారం మధ్యాహ్నం వరకు స్వల్ప లాభాల్లో ట్రేడింగ్‌ అయినా సూచీలు.. ఆఖర్లో అమ్మకాల ఒత్తిడితో భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. చివరి గంటలో చోటుచేసుకున్న అధిక అమ్మకాల ఒత్తిడి కారణంగా బిఎస్‌ఇ సెన్సెక్స్ 1,092.06 పాయింట్లు లేదా 1.44 శాతం పతనమై 74,775.74కు పరిమితమయ్యింది. ఇంట్రాడేలో ఏకంగా1,278.69 పాయింట్లు క్షీణించి 74,589 కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 359.40 పాయింట్లు లేదా 1.50 శాతం నష్టపోయి 23,547.75 వద్ద ముగిసింది. దీంతో బిఎస్‌ఇలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ ఒక్క రోజులోనే 5,77,442.84 కోట్లు హరించుకుపోయి రూ.464.97 లక్షల కోట్లకు పడిపోయింది.

దేశంలో జూన్ నుండి సెప్టెంబర్ మధ్య వచ్చే నైరుతి రుతుపవనాల వర్షపాతం దీర్ఘకాలిక సగటులో కేవలం 90 శాతంగానే ఉండవచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం ఇన్వెస్టర్లలో ఆహార ద్రవ్యోల్బణం భయాలను రేకెత్తించింది. ఇది మార్కెట్ సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. సంస్థాగత పెట్టుబడిదారుల నుండి భారీగా నిధులు బయటకు వెళ్లడం, అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ పొడిగింపుపై స్పష్టత లేకపోవడం వంటి భౌగోళిక రాజకీయ అనిశ్చితులు మార్కెట్‌ను మరింత కుంగదీశాయి. సెన్సెక్స్ 30లో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, పవర్ గ్రిడ్, ఎన్‌‌టిపిసి, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్ వంటి ప్రముఖ సంస్థలు భారీగా నష్టపోగా, టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్ టెక్, ఎల్‌అండ్‌‌టి, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు లాభాల్లో ముగిశాయి. స్మాల్‌క్యాప్ సూచీ 1.26 శాతం, మిడ్‌క్యాప్ సూచీ 0.73 శాతం నష్టపోగా.. రంగాల వారీగా చమురు గ్యాస్ 2.75 శాతం, మెటల్ 2.30 శాతం, ఆటోమొబైల్ 1.90 శాతం చొప్పున పడిపోయాయి. మొత్తంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్‌లో 2,673 షేర్లు నష్టాల్లో ముగియగా.. కేవలం 1,611 షేర్లు లాభపడగా.. 179 షేర్ల ధరలలో ఎలాంటి మార్పు లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -