– కెమెరా ట్రాప్‌లు, డ్రోన్లతో కదలికలను పరిశీలిస్తున్న అటవీశాఖ
– ఇసాయిపేట-చిన్నలక్ష్మీపురం సమీప ప్రాంతాల్లో సచారం
– సురక్షితంగా పట్టుకునేందుకు సాంకేతిక కమిటీ ఏర్పాటు
– పీసీసీఎఫ్ డాక్టర్ సి.సువర్ణ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సిద్దిపేటుయాదాద్రి భువనగిరి జిల్లా సరిహద్దుల్లో రెండు వారాలుగా సంచరిస్తున్న పెద్దపులి కోసం అటవీశాఖ అన్వేషణ కొనసాగుతున్నది. కెమెరా ట్రాప్‌లు, థర్మల్ డ్రోన్లతో కదలికలను పరిశీలిస్తున్నది. ఇసాయిపేట, చిన్న లక్ష్మీపురం సమీప ప్రాంతాల్లో ఆ పెద్దపులి కదలికలున్నట్టు ట్రాకింగ్ బృందాలు వెల్లడించాయి. దానిని సురక్షితంగా పట్టుకునేందుకు సలహాలిచ్చేందుకు సాంకేతిక నిపుణులతో కూడిన ఒక కమిటీని అటవీ శాఖ ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో సభ్యులుగా జాతీయ పులుల సంరక్షణ సంస్థ సభ్యులు హరిణి వేణుగోపాల్, వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు రమేష్, హైటికోస్ (హైదరాబాద్ కన్సర్వేషన్ సొసైటీ) సభ్యులు ఇమ్రాన్ సిద్ధిక్, పుణెకు చెందిన రెస్క్యూటీం బృంద సభ్యులు ఉన్నారు. వారు అటవీ శాఖకు అవసరమైన సాంకేతిక సూచనలు అందిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారిణి డాక్టర్ సి.సువర్ణ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పులి కదలికలపై నిరంతర సమీక్షలు చేపట్టి, పరిస్థితిని గమనిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, అదే సమయంలో పులికి కూడా హాని జరగకుండా ట్రాకర్లు, డ్రోన్ల ద్వారా అటవీ సిబ్బంది నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. కెమెరా ట్రాప్‌ల ద్వారా లభించిన సమాచారం ప్రకారం అది మగ పులిగా నిర్ధారణ అయింది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అటవీ ప్రాంతం నుంచి బయలుదేరిన ఈ పులి కవ్వాల్ టైగర్ రిజర్వ్‌తో పాటు పలు జిల్లాల మీదుగా సంచరిస్తూ ప్రస్తుతం ఈ ప్రాంతానికి చేరుకున్నట్టు అటవీ శాఖ గుర్తించింది. పులి కదలికలను కచ్చితంగా తెలుసుకునేందుకు కెమెరా ట్రాప్‌లు, థర్మల్ డ్రోన్లను వినియోగిస్తున్నారు. సమీక్షలో పీసీసీఎఫ్ వినరుకుమార్, సీసీఎఫ్ క్షితిజ, వైల్డ్‌లైఫ్ ఓఎస్డీ శంకరన్, వైల్డ్‌లైఫ్ డీసీఎఫ్ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
పెద్దపులి కోసం అన్వేషణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



