Saturday, May 30, 2026
E-PAPER
Homeఖమ్మంఅశ్వారావుపేటలో కలెక్టర్ పర్యటన

అశ్వారావుపేటలో కలెక్టర్ పర్యటన

- Advertisement -

– యంగ్ ఇండియా గురుకుల నిర్మాణాలు వేగవంతం చేయాలి
– జూన్ 2 నాటికి ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశాలకు సిద్ధం చేయాలి
నవతెలంగాణ – అశ్వారావుపేట
: అశ్వారావుపేట పర్యటనలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ అంకిత్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులు, తహసీల్దార్ కార్యాలయం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

అశ్వారావుపేటలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణాల నాణ్యత, పురోగతి, భవనాల నమూనాలను పరిశీలించిన ఆయన, విద్యార్థులకు అత్యుత్తమ విద్యా వాతావరణం కల్పించేలా అన్ని ప్రమాణాలు పాటిస్తూ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలకు అనుసంధాన రహదారులు, అంతర్గత రోడ్లు, విద్యుత్, తాగునీటి వంటి మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా సమీకృత గురుకులాలను నిర్మిస్తోందన్నారు. ప్రపంచ స్థాయి విద్యను అందించి భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఐదు యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, నిర్ణీత గడువులోగా నాణ్యతతో పనులు పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం అశ్వారావుపేట తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, భూ భారతి, సాదా బైనామా, భూ సర్వేలకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కార పురోగతిపై తహసీల్దార్ కిషోర్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను నిర్దేశిత సమయంలో పరిష్కరించి సకాలంలో సేవలు అందించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

అశ్వారావుపేట మండలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పురోగతిని కూడా సమీక్షించారు. రైతులు తమ ధాన్యాన్ని విక్రయించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి రైతులకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు.

తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ప్రజలతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ వారి సమస్యలు, ఫిర్యాదులను తెలుసుకుని, వినతులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

అనంతరం అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణాల పురోగతి, ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

అధికారుల వివరాల ప్రకారం, అశ్వారావుపేట మండలంలో మొత్తం 957 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, 926 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. వీటిలో 123 ఇండ్లు బేస్ లెవల్‌లో, 189 ఇండ్లు రూఫ్ లెవల్‌లో, 403 ఇండ్లలో స్లాబ్ పనులు పూర్తికాగా, 200 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 31 ఇండ్ల నిర్మాణాలు ఇంకా ప్రారంభం కాలేదు. మున్సిపాలిటీ పరిధిలో 136 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, 129 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభమై, 52 ఇండ్లు పూర్తయ్యాయి.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పూర్తయిన మరియు చివరి దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను జూన్ 2వ తేదీన గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇంకా నిర్మాణాలు ప్రారంభం కాని ఇండ్లను వెంటనే గ్రౌండింగ్ చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. లబ్ధిదారులకు అవసరమైన సాంకేతిక, పరిపాలనా సహకారం అందిస్తూ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని విజయవంతం చేయడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ సూచించారు. అలాగే విద్యా, గృహ నిర్మాణ, రెవెన్యూ సేవల కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు.

ఈ పర్యటనలో తహసీల్దార్ కిషోర్, ఎంపీడీవో రామ కోటా రెడ్డి, హౌసింగ్ ఏఈ మదన్ కుమార్,ఎంఈఓ ప్రసాదరావు, ఈడబ్ల్యూఐడీసీ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ సాంబయ్య,మున్సిపల్ కమిషనర్ దిలీప్ రెడ్డి,సీఐ నాగరాజు రెడ్డి,తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -