– 11వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు, 12న దేశవ్యాప్త సమ్మె
– వాణిజ్య ఒప్పందాలు దేశ సార్వభౌమాధికారానికి మరణశాసనం : తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి.సాగర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అమెరికా ఒత్తిడికి మోడీ సర్కారు లొంగిపోయి దేశ సార్వభౌమాధికారానికి మరణ శాసనం రాస్తూ వాణిజ్య ఒప్పందం చేసుకోవడాన్ని నిరసిస్తూ గురువారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు గ్రామాల్లో ట్రంప్, మోడీ దిష్టిబొమ్మ దహనాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి.సాగర్ ప్రకటించారు. వ్యవసాయ రంగంపై ఈ ఒప్పందాలు తీవ్ర ప్రభావం చూపబోతున్న నేపథ్యంలో ఈ నిరసనల్లోనూ, 12న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలోనూ రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాద్‌రావు, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్‌తో కలిసి సాగర్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ట్రంప్ బెదిరింపులకు పూర్తిగా లొంగిపోవడం తప్ప మరొకటి కాదనీ, మోడీ భారతదేశ జాతీయ ప్రయోజనాలను తాకట్టు పెట్టి, దానిని ”పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యం” అని పిలవడం దారుణమని విమర్శించారు. భారతదేశం-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తర్వాత వస్తున్న ఈ వాణిజ్య ఒప్పందం, భారతీయ కార్మికులు, రైతులు, సామాన్య ప్రజల కష్టాలను మరింత పెంచే ఒక డబుల్ దెబ్బ కాబోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా వస్తువులపై సుంకాలను ఎత్తేయడం వల్ల మన దేశ మార్కెట్లలోకి విచ్చలవిడిగా వెల్లువెత్తుతాయనీ, ఇది మన వ్యవసాయ, అనుబంధ పరిశ్రమలు, ఇతర పరిశ్రమలపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న రైతులు, కార్మికుల జీవితాలను నాశనం చేస్తాయని స్పష్టం చేశారు. ఖరీదైన అమెరికా ఇంధనం, బొగ్గు ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి చేసిన వాగ్దానాలు భారతీయ వినియోగదారులపై నేరుగా ప్రభావం చూపుతాయని తెలిపారు. ధరల పెరుగుదలకు దారితీసి సామాన్య ప్రజల జీవితాలు మరింత దుర్భర స్థితిలోకి నెట్టబడుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా సైనిక సాంకేతిక పరిజ్ఞానాన్ని బలవంతంగా సేకరించడం దేశీయ ఉత్పత్తిని దెబ్బతీస్తుందనీ, జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. ఇప్పటిదాకా మనం అనుసరిస్తున్న ”వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి”కి ప్రమాదం వాటిల్లుతుందని తెలిపారు. అమెరికా, యూకే, యూరోపియన్ యూనియన్ దేశాలతో జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను పార్లమెంట్‌లో చర్చకు పెట్టాలనీ, రాష్ట్రాలతో సమగ్రంగా చర్చించాలని డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, ప్రజల వ్యతిరేక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, వాణిజ్య ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని కోరారు.
నేటి నుంచి గ్రామాల్లో మోడీ, ట్రంప్ దిష్టిబొమ్మల దహనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



