గర్భాశయంలో కణితులు ఉన్నాయని తెలిసినప్పుడు చాలామంది మహిళలు ఆందోళన చెందుతుంటారు. కానీ, అవి అంత ప్రమాదకరం ఏమీ కావు. అయితే, ఈ కణితుల పరిమాణం పెరుగుతున్న కొద్దీ నెలసరిలో సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. అధిక రుతుస్రావం, రోజుల తరబడి రక్తస్రావం జరుగుతూనే ఉంటుంది. అయితే, గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ (కణితులు) పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు మందులతోనే కరిగించేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో కణితులు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం!
గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ పెరగటం అనేది ఇవాళ చాలామంది మహిళలకు పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. అయితే, ఇవి పెరగడానికి కారణాలు ఏంటో కచ్చితంగా తెలియదు. కానీ, గడ్డలు పెరగటానికి ఈస్ట్రోజెన్ హార్మోన్ తోడ్పడుతుందట. సాధారణంగా ఇవి 30 ఏండ్ల తర్వాత ఏర్పడుతుంటాయి. పిల్లలు ఉన్న మహిళలకు ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం తక్కువ. పదేండ్ల వయసుకు ముందే రజస్వల అయిన వారికి గర్భాశయంలో గడ్డలు పెరిగే ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
లక్షణాలు
సాధారణంగా ఫైబ్రాయిడ్స్‌లో ఎలాంటి లక్షణాలు కనిపించావు. చాలామంది ఇవి ఉన్నట్టుగా గుర్తించకపోవచ్చు. అయితే కొందరిలో పీరియడ్స్ ఎక్కువ రోజులు కావటం, రుతుస్రావం అధికంగా అవటం, కడుపు ఉబ్బరం, కటి ప్రాంతంలో లేదా బొడ్డు కింద నొప్పి, మలబద్ధకం లాంటి సమస్యలు కనిపిస్తాయని ఓ అధ్యయనం పేర్కొంది. 40 ఏండ్లు దాటిన మహిళల్లో 15 నుంచి 20 శాతం మంది ఈ ఫైబ్రాయిడ్స్‌తో బాధపడుతున్నారట. ఈస్ట్రోజెన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫైబ్రాయిడ్ ఏర్పడే అవకాశం ఉంది. ఈ సమస్య రీ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్‌లో ఎక్కువగా ఉంటుంది. ఇది జన్యు సమస్యల కారణం వల్ల కూడా రావొచ్చు. ఒబెసిటీ ఉన్నప్పుడు కూడా ఈస్ట్రోజెన్ స్థాయి కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందుకే వారికి ఫైబ్రాయిడ్స్ సమస్యలు ఎక్కువగా రావొచ్చు.
కారణాలు ఇవే
గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ రావడానికి వెనుక హార్మోన్ అసమతౌల్యమే ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈస్ట్రోజెన్ హార్మోన్ విడుదలలో హెచ్చుతగ్గులు, ఉండాల్సిన దానికన్నా బరువు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. కొంతమందిలో వంశపారంపర్యంగా కూడా గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఇవి ఉన్నప్పుడు నెలసరిలో రక్తస్రావం ఎక్కువగా అవుతుంది. రక్తం ముద్దలు ముద్దలుగా పడుతూ ఉంటుంది. అంతేకాదు నెలసరితో నిమిత్తం లేకుండా తరచూ రక్తస్రావం కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఫైబ్రాయిడ్స్ మూలంగా మూత్రాశయంపై ఒత్తిడి పెరుగుతుందట. ఇంకా రక్తహీనత, ఆయాసం, గుండె దడ వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. బ్లీడింగ్ ఎక్కువగా అవుతున్నప్పుడు, రక్తహీనతగా అనిపించినప్పుడు, రక్త మార్పిడి అవసరమైనప్పుడు ఈ సమస్యను సీరియస్‌గా తీసుకోవాలి వైద్యులు సూచిస్తున్నారు.
ఎలా గుర్తిస్తారు
గర్భాశయంలో కణితుల్ని, వాటి పరిమాణాన్ని స్కానింగ్ చేయడం ద్వారా కచ్చితంగా గుర్తించవచ్చు. అల్ట్రాసౌండ్, MRI టెస్ట్‌ల ద్వారా ఫైబ్రాయిడ్స్ని గుర్తిస్తారు. అవసరం అనుకుంటే, ఎండోమెట్రియల్ బయాప్సీ, హిస్టెరోస్కోపీ, హిస్టెరోస్కోపీ జియోగ్రఫీ, లాప్రోస్కోపీ వంటి పరీక్షలు చేయడం ద్వారా ఫైబ్రాయిడ్స్ పరిమాణాన్ని, వాటి ఆకారాన్ని చాలా వరకు కచ్చితంగా నిర్ధారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే కణితుల పరిమాణం చాలా చిన్నగా అంటే, మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్నప్పుడు మందుల సాయంతో వాటిని చాలా తేలికగా కరిగించవచ్చు. ఫైబ్రాయి డ్స్‌తో ఇబ్బందులు తక్కువగా ఉన్నప్పుడు హార్మోన్ చికిత్స చేయడం ద్వారా వాటి పరిమాణం కుచించుకుపోయేలా చేస్తారు. కణితులు మరీ పెద్దగా ఉన్నప్పుడు మయో మెక్టమీ సర్జరీ చేసి వాటిని తొలగిస్తారు. రక్త సరఫరాను నిలిపి వేయడం ద్వారా ఫైబ్రాయిడ్ కుచించకుపోయేలా చేసే యుటరైన్ ఎంబోలైజేషన్ అనే కొత్త ప్రక్రియ అందుబాటులోకి వచ్చిందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఫైబ్రాయిడ్స్‌తో సమస్యలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు గర్భసంచిని పూర్తిగా తొలగిస్తారు.
భయపడొద్దు
గర్భాశయంలో కణితులు ఉన్నప్పుడు అనవసరంగా ఆందోళన చెందకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి ఎక్కువగా ప్రమాదకరం కానివే ఉంటాయట. కణితుల పరిమాణం 3 సెం.మీ కన్నా తక్కువగా ఉన్నప్పుడు వాటిని అలాగే వదిలేయటం మేలు. అంతకన్నా ఎక్కువగా ఉంటే మాత్రమే కణితులకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.


