కేతిగాడు : యస్. ఐ యామ్ కాక్రోచ్. నేను బొద్దింకను. మిస్టర్ చీఫ్ జస్టీస్, మీరన్నట్టు మేం సోమరిపోతులం.. పరాన్న జీవులం. పనీపాటా లేని ఆవారా గాళ్ళం. ప్రశ్నలతో ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడి చేయడమే మాపని. అందుకే మేం కాక్రోచ్ జనతా పార్టీ పెట్టాం. సోమరిపోతు నిరుద్యోగుల వాయిస్ ఇది. ఆన్ లైన్ సెటైర్ పార్టీ అని భావించినా మాకు అభ్యంతరం లేదు. కానీ మా పార్టీ మేనిఫెస్టోను ఓసారి గమనించండి.
1. ప్రజా సమస్యలపై ఆన్లైన్ పోరాటం నిరంతరం సాగిస్తాం.
2. అత్యున్నత నాయమూర్తి పదవీ విరమణ అనంతరం (రాజ్య సభ సభ్యునితో) సహా ఏ పదవులూ ఉండవు.
3. మంత్రి వర్గాల్లో 50 శాతం మహిళలకే వాటా.
4 . పార్టీ ఫిరాయించిన వారు ఇరవైఏళ్ళ పాటు ఎన్నికల్లో పోటీకి అనర్హులు.
5. పదవిలోని ప్రతివ్యక్తీ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి.
ముందు నీట్ పేపర్స్ లీకై అనేక మంది విద్యార్థుల ఆత్మ హత్యలకు కారణమైన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణం రాజీనామా చేయాలి.
జుట్టుపోలుగాడు : నేనిక్కడ అత్యంత ముఖ్య నేతను మాట్లాడుతూ వుంటే ఆ ముచ్చట్లు ఏంటి? లొల్లి ఏంటి. సీరియస్‌గా అడుగుతున్నా.? మీకు రీల్స్ తెలుసా..? మీలో ఎంతమంది ఇన్‌స్టాగ్రాంలో ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల గురించి, పార్టీ కార్యకలాపాల గురించి మీరు ఎప్పుడైనా రీల్స్ చేసారా? ప్రచారం చేసారా… కనీసం మీ గురించి మీరైనా చెప్పుకున్నారా..? కాస్త బుద్ది తెచ్చుకోండి. సోయిలో ఉండండి. అసలు దేశంలో యూత్ ఏ విధంగా ఆలోచిస్తుందో ఎప్పుడైనా గమనించారా?
ష్! బొద్దింకలు – దోమలు – ఈగల పార్టీలు వస్తున్నాయని భయపడక్కర్లా.. వాటిని ఎలా అణచాలో మాకు తెలుసు. అయినా ఈ జెన్. జి. తరం మనకు పూర్తి వ్యతిరేకం కాదు. మొన్న ఎన్నికల్లో మనకు పట్టం కట్టిన వాళ్లల్లో జెన్.జిలు లేరా ఏంటి? ఒక్కటి గుర్తుపెట్టుకోండి. 18-30 సంవత్సరాల మధ్య వున్న యూత్ ఎలా ఆలోచిస్తున్నారో వారికి ఏం బిస్కెట్లు వేస్తే లొంగుతారో అది గమనించాలి. వారిని సంతప్తి పరచడం మన లక్ష్యం. అర్థమయిందనుకుంటా. —-
కేతిగాడు : అభిజిత్ దీఫ్కే అయిన నాకు ఇప్పుడు చావు బెదిరింపులు వస్తున్నాయి. ”కాక్రోచ్ జనతా పార్టీ ఖాతా మూసేసి బి.జె.పిలో చేరితే డబ్బులొస్తాయి. లేదంటే నీవు అమెరికాలో ఉన్నా నీకు చావు తప్పదు”.. ఇలా… ఇండియాలోని మా అమ్మా నాన్నలను కూడా బెదిరిస్తున్నారు. ఒక వేళ నేను అమెరికా నుండి ఇండియాకు వస్తే, ఎయిర్ పోర్ట్‌లోనే నన్ను అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపిస్తారు. నేను జెన్.జిని. నేను దళితుడిని. నరభారత్ను ఇపుడు మీరు చూస్తున్నారు. నా వెబ్ సైట్‌ను మూసేసారు. నా పార్టీలో ఇరవైలక్షల మందికి పైగా చేరారు. విద్యామంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తూ ఆరులక్షలమంది సంతకాలు చేశారు. మేమంటే మీ పాలకులకు ఎందుకంత భయం? అదే.. బొద్దింకలంటే ఎందుకంత భయం? గొంతెత్తి నినదిస్తున్నా.. హల్లాబోల్. మా అకౌంట్స్ హ్యాక్ చేసి ఆపగలరు గాని, మా గుండెల్లో ఎగిసిపడే ఉద్యమ జ్వాలను ఎవరాపగలరు? మీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా యువగళం దిక్కులు పిక్కటిల్లేలా ప్రతిధ్యనిస్తూనే ఉంటుంది. మీ అణచివేత ప్రతిదీ మమల్ని మరింతగా దఢ సంకల్పుల్ని చేస్తుంది. గుర్తుంచుకోండి. మా బొద్దింకలకు మరణం లేదు.
బంగారక్క : అవును బొద్దింకలకు మరణం ఉండదు. కంప్యూటర్స్, హైటిక్ సిటీల్లోనే కాదు, గ్రామీణ మురికి, చెత్తా చెదారంలో కూడా బొద్దింకలు పుడుతూనే వుంటాయి. జీవిస్తూనే ఉంటాయి. అపనిందను ఆత్మగౌరవంగా స్వీకరించి చైతన్యంగా పదునెక్కడమే ప్రత్యేకత. నిర్భయంగా ప్రశ్నిస్తూ, నియంతలను పారిపోయేలా చేస్తుంది యువత, ప్రజాస్యామ్య బలం అదే.
– కె.శాంతారావు, 9959745723



