Saturday, May 30, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిజెన్ - జీ గళం వినిపిస్తోందా?

జెన్ – జీ గళం వినిపిస్తోందా?

- Advertisement -

భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువజన జనాభా కలిగిన దేశమని పాలకులు గర్వంగా చెబుతుంటారు. ” యువతే దేశానికి వెన్నెముక “, “యువశక్తి దేశ భవిష్యత్తు”, వంటి పదాలను వేదికలపై పదేపదే వినిపిస్తుంటారు. కానీ అదే యువత ఈ రోజు ఉద్యోగాల కోసం వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? విద్య పూర్తిచేసి సంవత్సరాలు గడిచినా ఉద్యోగం దొరకక నిరాశలో మగ్గుతున్న యువకులు ఎందుకు పెరుగుతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. ప్రస్తుతం దేశంలో జెన్-జీ (Gen Z)గా పిలవ బడుతున్న యువతరం రాజకీయంగా, సామాజి కంగా గత తరాల కంటే ఎక్కువ అవగాహన కలిగి ఉంది. సోషల్ మీడియా, డిజిటల్ వేదికల ద్వారా ప్రపంచ పరిణామాలను గమనిస్తున్న ఈ తరం కేవలం నినాదాలతో సంతృప్తి చెందడం లేదు. వారికి ఉద్యోగాలు కావాలి, నాణ్యమైన విద్య కావాలి, సమాన అవకాశాలు కావాలి, జీవన భద్రత కావాలి. కానీ పాలకుల నుంచి వినిపిస్తున్నది మాత్రం భారీ హామీలు, ప్రచార ఆర్భాటాలు, ఎన్నికల వాగ్దానాలే. గత కొన్నేళ్లుగా నిరుద్యోగం భారత యువతను వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది.

ప్రభుత్వ రంగ ఉద్యోగాల భర్తీలు తగ్గడం, ఖాళీలు ఉన్నా నియామకాలు జరగకపోవడం, పరీక్షల నిర్వహణలో జాప్యం, ప్రశ్నాపత్రాల లీకేజీలు, నియామక ప్రక్రియలలో పారదర్శకత లోపించడం వంటి అంశాలు యువతలో తీవ్ర అసంతృప్తికి కారణమవుతున్నాయి. లక్షల మంది అభ్యర్థులు ఒక ఉద్యోగానికి పోటీ పడుతున్న దృశ్యాలు దేశ అభివృద్ధి కథనానికి విరుద్ధమైన వాస్తవాన్ని చూపుతున్నాయి. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా జరిగిన యువజన నిరసనలు ఈ అసంతృప్తికి ప్రతిబింబం. రైల్వే ఉద్యోగాలు, సైనిక నియామకాలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలు, పరీక్షల నిర్వహణలో అవకతవకలు వంటి అంశాలపై యువత వీధుల్లోకి రావడం యాదృచ్ఛికం కాదు. ఇది అవకాశాలు కోల్పోతున్న ఒక తరం వ్యక్తం చేస్తున్న ఆవేదన. కానీ ఈ నిరసనలను వినాల్సిన పాలకులు వాటిని రాజకీయ కోణంలో చూడడం, ప్రశ్నించే యువతను విమర్శించడం ఆందోళనకర పరిణామం. యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములుగా చూడాల్సిన ప్రభుత్వం, వారిని కేవలం ఎన్నికల సమయంలో ఓటు బ్యాంకుగా మాత్రమే చూడడం ప్రమాదకరం. ఉద్యోగాల గురించి ప్రశ్నిస్తే దేశభక్తి పాఠాలు చెప్పడం, జీవనోపాధి గురించి అడిగితే అభివృద్ధి గణాంకాలు చూపించడం సమస్యలకు పరిష్కారం కాదు. ఆకలి, నిరుద్యోగం, అసమా నతలు గణాంకాలతో తగ్గవు. వాటికి అవసరమైనది సమర్థమైన విధానాలు.

ఇటీవలి రాజకీయ పరిణామాలు కూడా యువతలో అనేక ప్రశ్నలను లేవనెత్తుతు న్నాయి. పాలకుల విధానాలపై అసంతృప్తికి తాజా ప్రతీకగా నిలిచింది “కాక్రోచ్ జనతా పార్టీ” (సిజెపి). మొదట ఇది ఒక వ్యంగ్య రాజకీయ- సామాజిక ఉద్యమంగా ప్రారంభ మైంది. నిరుద్యోగ యువతను “కాక్రోచ్‌లు”, “పరాన్న జీవులు”గా అభివర్ణించారన్న ఆరోపణల నేపథ్యంలో సోషల్ మీడియాలో యువత ఆగ్రహం వ్యక్తమైంది. ఆ ఆగ్రహం క్రమంగా ఒక డిజిటల్ ఉద్యమంగా మారింది. వ్యంగ్య పోస్టులు, మీమ్స్, వీడియోలతో ప్రారంభమైన ఈ ప్రచారం కొన్ని రోజుల్లోనే కోట్లాది మంది యువతను ఆకర్షించింది. కాక్రోచ్ జనతా పార్టీ అసలు బలం దాని పేరులో కాదు, దాని వెనుక ఉన్న ఆవేదనలో ఉంది. ఉద్యోగాలు లేక, భవిష్యత్తుపై భరోసా లేక, ప్రభుత్వాల హామీలపై నమ్మకం కోల్పోతున్న ఒక తరం తన అసంతృప్తిని కొత్త భాషలో వ్యక్తం చేస్తోంది. ఇది కేవలం సోషల్ మీడియా ట్రెండ్ కాదు. యువత మనస్తత్వంలో జరుగుతున్న మార్పుకు సంకేతం. నేడు అవకాశవాద రాజకీయాలు, ప్రజా సమస్యల కంటే ప్రచార రాజకీయాలకు ప్రాధాన్యత పెరగడం, కార్పొరేట్ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం లభిస్తున్నదన్న విమర్శలు యువతలో విశ్వాస సంక్షోభాన్ని పెంచుతున్నాయి.

రాజకీయ పార్టీలు యువతను ఆకర్షించడానికి సోషల్ మీడియా ప్రచారాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ, ఉద్యోగాల కల్పనకు మాత్రం తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. జెన్-జీ తరం కోరుకుంటున్నది చాలా స్పష్టమైనది. వారికి మత విద్వేషాలు అవసరం లేదు. కుల, మత రాజకీయాల కంటే ఉద్యోగ భద్రత ముఖ్యం. ద్వేష ప్రసంగాల కంటే మంచి విద్య ముఖ్యం. భారీ విగ్రహాలు, ఆర్భాట ప్రాజెక్టుల కంటే ఉపాధి అవకాశాలు ముఖ్యం. వారు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు సంపాదించ డానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ నైపుణ్యాలకు తగిన అవకాశాలు దేశంలోనే లభించాలనుకుంటున్నారు. నేడు అనేక మంది యువకులు విదేశాలకు వలస వెళ్లేందుకు ప్రయత్నించడం కూడా దేశీయ ఉపాధి పరిస్థితులపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇంజినీరింగ్, వైద్య, సాంకేతిక విద్యల్లో ప్రతిభ కనబరిచిన యువత దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి గర్వకారణం కాదు. ఇది దేశ విధానాల వైఫల్యానికి సంకేతం. యువత శక్తిని దేశాభివృద్ధికి వినియోగించలేకపోతే, అది సామాజిక అసంతృప్తికి దారితీస్తుంది.

పాలకులు గుర్తుంచు కోవాల్సిన విషయం ఏమిటంటే, జెన్-జీ తరం మౌనంగా ఉండే తరం కాదు. ప్రశ్నించే తరం. సమాచారాన్ని పరిశీలించే తరం. వాస్తవాలను పోల్చిచూసే తరం. అందువల్ల ప్రచారాలతో మాత్రమే వారిని ప్రభావితం చేయడం సాధ్యం కాదు. ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ రంగ నియామకాల వేగవంతం, విద్యావ్యవస్థ బలోపేతం, స్టార్టప్‌లకు మద్దతు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం వంటి చర్యల ద్వారానే యువత విశ్వాసాన్ని గెలుచుకోవచ్చు. భారత యువత ఈ రోజు అడుగుతున్నది – “మాకు భవిష్యత్తు ఎక్కడ?” ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా దేశం అభివృద్ధి చెందుతోందని చెప్పడం సరిపోదు. యువత ఆగ్రహం, నిరాశ, అసంతృప్తి మరింత పెరిగితే అది కేవలం ఒక వర్గం సమస్యగా మిగలదు. అది దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం కాక్రోచ్ జనతా పార్టీ వాటిపై ఆగ్రహం వ్యక్తం చేయకుండా, ముందు జెన్ – జీ ఆవేదనను అర్థం చేసుకోవాలి. లేదంటే పాలకుల మెడలు వంచే శక్తి యువతకే ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -