అమెరికా సామ్రాజ్యవాద
విధానాలకు దీటుగా నిలుస్తున్న క్యూబా
సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం. సాయిబాబు
సీఐటీయూ 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనగామలో సంతకాల సేకరణ
నవతెలంగాణ-జనగామ
సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోషలిస్ట్ దేశం క్యూబాకు సంఘీభావంగా శనివారం జనగామ లో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం. సాయిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమెరికా సామ్రాజ్యవాద విధానాలకు ధీటుగా నిలుస్తున్న క్యూబాపై అమెరికా ప్రభుత్వం అనేక దశాబ్దాలుగా ఆర్థిక దిగ్బంధనం, వాణిజ్య ఆంక్షలు అమలు చేస్తోందని విమర్శించారు. ఈ ఆంక్షల కారణంగా క్యూబా ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, తమ దేశ సార్వభౌమాధికారాన్ని, స్వాతంత్య్రాన్ని, సోషలిస్ట్ వ్యవస్థను కాపాడుకునేందుకు ధైర్యసా హసాలతో పోరాడుతున్నారని తెలిపారు. ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య (డబ్ల్యూఎఫ్ టీయూ) ఇచ్చిన పిలుపు మేరకు సీఐటీయూ అఖిల భారత కమిటీ దేశవ్యాప్తంగా క్యూబాకు మద్దతుగా సంతకాల సేకరణ కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు. సీఐటీయూ 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 15 రోజులపాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జనగామలో నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమానికి కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు, సీఐటీయూ కార్యకర్తలు, వివిధ రంగాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
క్యూబా ప్రజలకు మద్దతు తెలుపుతూ వారు సంతకాలు చేసి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. క్యూబాపై అమెరికా విధించిన ఆర్థిక దిగ్బంధనాన్ని, వివిధ రకాల ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని, ఆ దేశ ప్రజల స్వేచ్ఛా హక్కులను గౌరవించాలని వారు డిమాండ్ చేశారు. క్యూబా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అంతర్జాతీయ స్థాయిలో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని సాయిబాబు అన్నారు. క్యూబా ప్రజల పోరాటానికి భారత కార్మిక వర్గం అండగా నిలుస్తోందని, సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచ కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. క్యూబా ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య శక్తులు, కార్మిక సంఘాలు ఐక్యంగా నిలవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి, పుప్పాల శ్రీకాంత్, పాలడుగు సుధాకర్, రాష్ట్ర కమి టీ సభ్యులు యాటాల సోమన్న, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్, జిల్లా అధ్యక్షఁలు రాపర్తి రాజు, జిల్లా కోశాధికారి అన్నబోయిన రాజు, తదితరులు పాల్గొన్నారు.



