Sunday, May 31, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంహార్ముజ్ నిర్వహణ హక్కు మాదే

హార్ముజ్ నిర్వహణ హక్కు మాదే

- Advertisement -

అమెరికాతో ఇంకా ఒప్పందమేదీ ఖరారు కాలేదు :ఇరాన్‌ వెల్లడి
యూఎస్ అధ్యక్షుడి నోట నిజాల కన్నా అబద్ధాలే ఎక్కువ
హార్ముజ్‌ నిర్వహణ హక్కు మాదే !
అమెరికాతో ఇంకా ఒప్పందమేదీ ఖరారు కాలేదు! : ఇరాన్‌ వెల్లడి
యూఎస్ అధ్యక్షుడి నోట నిజాల కన్నా అబద్ధాలే ఎక్కువ

టెహ్రాన్/వాషింగ్టన్ : హార్ముజ్ జలసంధిని బేషరతుగా తెరిచేందుకు ఇరాన్ అంగీకరిం చిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను టెహ్రాన్ తోసి పుచ్చింది. తాను సమీక్షిస్తున్న ముసాయిదా ఒప్పందంలో అలాంటి అంశమేదీ లేదని స్పష్టం చేసింది. ట్రంప్ చెప్పే విషయాలలో కొన్ని వాస్తవాలు, మరికొన్ని అబద్ధాలు ఉన్నాయని తెలిపింది. ట్రంప్ వ్యాఖ్యలు ‘కల్పిత విజయాన్ని చిత్రించేలా’ ఉన్నాయని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) అనుబంధ ఫార్స్ న్యూస్ ఎద్దేవా చేసింది. నిర్ణయం ఏదీ తీసుకోనప్పటికీ ప్రతిపాదిత ఒప్పందం ఇరాన్ తుది అనుమతి కోసం ఎదురు చూస్తోందని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆ వార్తా సంస్థ తెలియజేసింది.

ట్రంప్ ఏమన్నారంటే…
పశ్చిమాసియా ఘర్షణపై శ్వేతసౌధంలో జరిగిన కీలక సమావేశానికి హాజరయ్యే ముందు ట్రంప్ మాట్లాడుతూ హార్ముజ్‌లో నౌకల రాకపోకలపై విధించిన ఆంక్షలు తొలగిపోయాయని చెప్పారు. ఆ జలసంధిలో సముద్ర రవాణా సాధారణ స్థితికి చేరుతోందని తెలిపారు. ‘హార్ముజ్‌లో మిగిలిపోయిన మందుపాతరలను తక్షణమే ఇరాన్ తొలగిస్తుంది. అవి అక్కడ పెద్దగా లేకపోవచ్చు. మా అసాధారణ నౌకా దిగ్బంధనం కారణంగా జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలు స్వదేశాలకు తరలిపోతున్నాయి. మీ కుటుంబసభ్యులకు నా తరఫున…మీ అభిమాన అధ్యక్షుడి తరఫున హలో చెప్పండి’ అంటూ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో ఆయన రాశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ హార్ముజ్‌లో నౌకల నుంచి ఇరాన్ ఎలాంటి రుసుము వసూలు చేయదని అన్నారు. అంతగా ప్రాధాన్యత లేని మిగిలిన అంశాలపై ఇరాన్‌తో అంగీకారం కుదిరిందని తెలిపారు.

ఇరాన్ ఏమంది?
ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ మీడియా తోసిపుచ్చింది. హార్ముజ్‌ను తిరిగి తెరిచే విషయంపై చేసుకునే ఒప్పందంలో నౌకల పర్యవేక్షణ‘తనిఖీ, సేవల నిబంధనలు, భద్రతా చర్యలు విధిగా ఉంటాయని స్పష్టం చేసింది. రుసుములు, షరతులు లేకుండా హార్ముజ్‌ను తిరిగి తెరిచేందుకు ఇరాన్ అంగీకరించిందన్న వార్తలను ఖండిస్తూ ముసాయిదాలో అలాంటి క్లాజు ఏదీ లేదని తెలిపింది. ఇరాన్ నౌకల దిగ్బంధాన్ని ఎత్తివేస్తేనే హార్ముజ్‌ను టెహ్రాన్ తిరిగి తెరుస్తుందని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇరాన్ తన వద్ద ఉన్న అణు పదార్థాలను ధ్వంసం చేస్తుందంటూ ట్రంప్ చేస్తున్న వాదనలో నిజం లేదని కూడా ఫార్స్ న్యూస్ చెప్పింది. చర్చల దశలో ఉన్న అవగాహనా పత్రంలో అలాంటి అంశమే లేదని తెలిపింది. విదేశాలలో స్తంభింపజేసిన 12 బిలియన్ డాలర్ల ఇరాన్ ఆస్తులను తక్షణమే విడుదల చేయాలన్న డిమాండ్ ముసాయిదాలో కీలక భాగంగా ఉన్నదని టెహ్రాన్ అధికారులను ఉటంకిస్తూ ఆ వార్తా సంస్థ పేర్కొంది. నిధులను విడుదల చేయని పక్షంలో చర్చల తదుపరి దశకు ఇరాన్ కదలబోదని స్పష్టం చేసింది. హెజ్బొల్లాలు కోరుతున్న విధంగా లెబనాన్‌లో కూడా పూర్తిగా కాల్పుల విరమణను పాటించాలన్న డిమాండ్ కూడా చర్చలలో ఉన్నదని తెలిపింది.

ఎటూ తేల్చని అమెరికా
ఇరాన్‌పై చర్చించేందుకు శుక్ర వారం తన జాతీయ భద్రతా బృందంతో శ్వేత సౌధంలో మంతనాలు సాగించిన ట్రంప్ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించ లేదు. ఈ సమావేశంపై శ్వేతసౌధం కూడా మౌనం వహించింది. ‘అమెరికాకు మంచిగా ఉండే ఒప్పందాన్నే అధ్యక్షుడు కుదుర్చు కుంటారు. ఇరాన్ వద్ద ఎన్నడూ అణ్వాయుధాలు ఉండకూడదు’ అని మాత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా రెండు దేశాలు ఇంకా చర్చలు జరుపుతూనే ఉన్నాయని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘై చెప్పారు. అవగాహన పత్రాన్ని ఇంకా ఖరారు చేయలేదని ఆయన అన్నారు. ఒప్పం దానికి ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఆమోదం తెలిపారా లేదా అనే విషయం కూడా తెలియరాలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -