మనిషి జీవితాన్ని ముందుకు నడిపేది కేవలం శరీరం కాదు.. గతాన్ని మోస్తూ, వర్తమానాన్ని అర్థం చేసుకుంటూ, భవిష్యత్తును ఊహించేది జ్ఞాపకం. కొన్ని జ్ఞాపకాలు చిరునవ్వులా వస్తాయి. కొన్ని గాయాల్లా గుండెల్లో మిగిలిపోతాయి. మరికొన్ని పదేపదే గుర్తుకొచ్చి మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. మనిషి మెదడు ఒక గ్రంథాలయం అయితే.. జ్ఞాపకాలు అందులోని పుస్తకాలు కాదు.. వాటిపై పడిన భావోద్వేగపు ముద్రలు.
మనోవిజ్ఞాన శాస్త్రం చెబుతోంది… మనిషి ఏ సంఘటనను ఎంత బలంగా గుర్తుంచుకుంటాడో, అది ఆ సంఘటన కన్నా ఆ సమయంలో అతను అనుభవించిన భావోద్వేగాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అందుకే బాల్యంలో అమ్మ చేతి తాకిడి, పాఠశాల గంట శబ్దం, మొదటి విజయపు ఆనందం, ఒక అవమానపు నొప్పి.. దశాబ్దాలు గడిచినా మనసు వదలదు. సైకాలజీ భాషలో చెప్పాలంటే అది ”ఎమోషనల్ ఓవర్‌లోడ్”. భావోద్వేగాలు ఎక్కువైనప్పుడు మన ”వర్కింగ్ మెమొరీ” బలహీనపడుతుంది. ఆలోచించే శక్తి తగ్గిపోతుంది. సరైన నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది.
జ్ఞాపకాలు ఎలా పనిచేస్తాయి?
మన మెదడు కెమెరా కాదు. అది ప్రతి క్షణాన్ని యథాతథంగా నిల్వ చేయదు. భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చి కొన్ని సంఘటనల్ని మాత్రమే లోతుగా భద్రపరుస్తుంది.
1. స్వల్పకాలిక జ్ఞాపకం: కొన్ని సెకన్ల పాటు మాత్రమే ఉంటుంది. ఒక ఫోన్ నెంబర్ విన్న వెంటనే గుర్తుంచుకోవడం లాంటిది.
2. క్రియాశీలక జ్ఞాపకం: చదివిన విషయం అర్థం చేసుకోవడం, మాట్లాడేటప్పుడు ఆలోచనను కొనసాగించడం.. ఇవన్నీ దీనిపైనే ఆధారపడి ఉంటాయి. ఒత్తిడి, భయం, ఫోన్ నోటిఫికేషన్లు.. ఇవి మొదట దెబ్బతీసేది ఇదే.
3. దీర్ఘకాలిక జ్ఞాపకం: జీవిత అనుభవాలు, ప్రేమ, బాధ, అలవాట్లు, నైపుణ్యాలు.. ఇవన్నీ ఇక్కడ నిల్వ ఉంటాయి. మనిషి వ్యక్తిత్వం కూడా చాలా వరకు ఈ జ్ఞాపకాల నిర్మాణమే.
ఎందుకు కొన్ని జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి?
మనసుకు గాయం చేసిన సంఘటనలు మెదడులో సాధారణ జ్ఞాపకాలుగా నిల్వ కావు. అవి ‘అప్రమత్తత సంకేతాలు’గా మారిపోతాయి. అందుకే ఒక అవమానం, ఒక విఫలం, ఒక విడిపోవడం ఏండ్ల తర్వాత కూడా ఒక్క మాటతో మళ్లీ గుర్తొచ్చేస్తాయి. మెదడు మనల్ని బాధపెట్టడానికి కాదు.. మళ్లీ అదే ప్రమాదం జరగకుండా కాపాడడానికి అలా చేస్తుంది. కానీ అదే జ్ఞాపకాన్ని పదేపదే తలచుకుంటే అది మనసును అలసటకు గురిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్లు.. కొత్త కాలపు జ్ఞాపక దొంగలు. ఇప్పటి మనిషి మెదడు నిరంతరం సమాచార వర్షంలో తడుస్తోంది. ఒకప్పుడు మనం ఫోన్ నెంబర్లు గుర్తుంచుకునేవాళ్లం. ఇప్పుడు ఫోన్ లేకపోతే మనకు మన స్నేహితుల నెంబర్ కూడా గుర్తుండదు. ఎందుకంటే మెదడు ఇలా అనుకుంటోంది.. ”ఇది నేను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఫోన్ గుర్తుంచుకుంటుంది.” ఇది ”డిజిటల్ డిపెండెన్సీ”. అంతేకాదు… ప్రతి నోటిఫికేషన్ మన దష్టిని చీల్చేస్తుంది. వర్కింగ్ మెమొరీపై ఒత్తిడి పెరుగుతుంది.
మరి జ్ఞాపకశక్తిని ఎలా మెరుగుపరుచుకోవాలి?
విరామాలతో నేర్చుకోవాలి. ఒకేసారి గంటల తరబడి చదవడం కన్నా.. మధ్యలో విరామాలు తీసుకుంటూ చదవడం మెదడుకు మంచిది. పునశ్చరణ అవసరం. చదివిన విషయాన్ని మళ్లీ గుర్తు చేసుకునే ప్రయత్నం చేయాలి. నోట్స్ చూస్తూ కాదు.. మనమే మనకు బోధిస్తున్నట్టుగా. శ్వాసాభ్యాసం నెమ్మదిగా గాలి పీల్చి వదిలే సాధనలు మెదడుపై ఒత్తిడిని తగ్గిస్తాయి. గాఢనిద్రలోనే జ్ఞాపకాలు స్థిరపడతాయి. నడక, వ్యాయామం మెదడుకు రక్తప్రసరణ పెంచి జ్ఞాపకశక్తిని బలపరుస్తాయి.
చివరగా..
జ్ఞాపకం అనేది కేవలం గుర్తుంచుకునే శక్తి కాదు.. మనిషి తనను తాను అర్థం చేసుకునే అద్దం. మరిచిపోవడం కూడా కొన్ని సందర్భాల్లో వరమే. లేకపోతే ప్రతి గాయం ప్రతిరోజూ రక్తం కారుస్తూనే ఉంటుంది. అందుకే జీవితం మనకు రెండు వరాలు ఇచ్చింది. గుర్తుంచుకునే శక్తి, మరచిపోయే శక్తి. ఈ రెండింటి మధ్య సమతుల్యత నేర్చుకున్నవారే మనసుని ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు.
డా|| హిప్నో పద్మా కమలాకర్,
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్



