నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్: జనగణన హెచ్.ఎల్.ఓ డేటాలోని లోపాల సవరణతో పాటు, ఇందిరమ్మ ఇండ్ల మహా గృహప్రవేశాల కార్యక్రమాలను అత్యంత ప్రాధాన్యతతో నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి సంబంధిత జిల్లా, మండల, మున్సిపల్ అధికారులకు ఆయన గూగుల్ మీట్ ద్వారా సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జనాభా గణనకు సంబంధించిన హెచ్.ఎల్.ఓ డేటాలో ఉన్న అన్ని రకాల అసంబద్ధతలను, లోపాలను క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా తక్షణమే సరిచేయాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో మాస్టర్ ట్రైనర్లు, సూపర్వైజర్లు, చార్జ్ అధికారులు, వార్డు అధికారులు పూర్తి సమన్వయంతో వ్యవహరించి తప్పుల్లేని డేటాను సిద్ధం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, ‘మహా గృహప్రవేశం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గృహనిర్మాణ శాఖకు చెందిన డీఈలు, ఏఈలు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనుల ప్రగతిని పర్యవేక్షించాలని, అధికారులు తమకు కేటాయించిన విధుల్లో ఎలాంటి అలసత్వాన్ని ప్రదర్శించకుండా వంద శాతం లక్ష్యాలను సాధించాలని హెచ్చరించారు. ఈ వర్చువల్ సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా రెవెన్యూ అధికారి స్రవంతి, జిల్లా పరిషత్ సీఈఓ రవి, జిల్లా పంచాయతీ అధికారి రమేష్, హౌసింగ్ పీడీ శంకర్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఎంపీడీఓలు, చార్జ్ అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సూపర్వైజర్లు, మాస్టర్ ట్రైనర్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
లోపాలను క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా తక్షణమే సరిచేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



