*ఆర్థిక శాఖ అత్యుత్సాహం….తీవ్రంగా ఖండించిన టిఎస్ యుటిఎఫ్
*సిఎం, డిప్యూటీ సిఎం జోక్యం చేసుకొని కోతలను రద్దు చేయాలి
* టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి గుగులోత్ రామకృష్ణ
నవతెలంగాణ – బోనకల్
ఉద్యోగుల ఆరోగ్య పథకం విధివిధానాలు ఖరారు కాలేదు. హాస్పిటల్స్ తో ఒప్పందం కుదిరింది లేదు. ప్యాకేజి రేట్లు నిర్ణయించలేదు. డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వనేలేదు. ఈహెచ్ఎస్ చందా 1.5 శాతం మినహాయింపు పై జిఒ ఇవ్వలేదు. కానీ ఆర్థిక శాఖ అత్యుత్సాహంతో ఈహెచ్ఎస్ చందా పేరిట ఉద్యోగుల మే నెల వేతనాల్లో 1.5 శాతం కోత విధించటాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి గూగుల్ రామకృష్ణ తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని బోనకల్ మండల కేంద్రంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విధివిధానాల గురించి అడిగితే ఆరోగ్య శాఖ ఇస్తుందని సమాధానం చెప్పిన ఆర్థిక శాఖ అధికారులు ఆ విధివిధానాలు లేకుండానే వేతనాల్లో కోత ఎలా పెడతారని ప్రశ్నించారు. ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబ సభ్యుల వివరాలు ఐఎఫ్ఎంఐఎస్ సైట్ లో నేటి వరకు నమోదు చేయాలని గడువు విధించి, నిన్నటిదాకా వెబ్ సైట్ లో మార్పులు చేస్తూనే ఉన్నారన్నారు. వివరాలు పూర్తిగా తీసుకోనే లేదన్నారు. పాత నిబంధనల ప్రకారం భార్యాభర్తలు ఉద్యోగులైతే ఒక్కరే చందా చెల్లించాలి. ఇప్పుడు ఇద్దరి నుంచి మినహాయించారన్నారు. ఆధారిత కుటుంబ సభ్యులపై స్పష్టత రానే లేదన్నారు. నిజానికి ఉద్యోగుల, పెన్షనర్ల ఆరోగ్య సంరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం ఖరీదైన సమయంలో ఉద్యోగులు కూడా కొంత భరించాలని ప్రభుత్వం కోరినప్పుడు సంఘాలు అంగీకరించాయి అన్నారు. అయినా వేతనంలో 1.5 శాతం కోత నిర్ణయం పట్ల ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారన్నారు. వారిలో ఉన్న సందేహాలను తొలగించి ఆరోగ్య పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాల్సిన సమయంలో, అందుకు తగిన చర్యలు తీసుకోకుండా ఇంత హడావుడిగా వేతనాల్లో కోత విధించడం ఉద్యోగుల్లో పలు అనుమానాలకు తావిస్తుందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క వెంటనే జోక్యం చేసుకొని వేతనాల్లో కోతలు నిలివేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఆర్థిక శాఖ తీసుకున్న ఏకపక్ష నియంతృత్వ నిర్ణయాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం అభాసుపాలవుతుందని వారు హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా నాయకులు సద్దా బాబు, మండల అధ్యక్షులు గార్లపాటి చిన్న రంగారావు, మండల ఉపాధ్యక్షులు పి గోపాలరావు, మండల కోశాధికారి పి నరసింహ రావు, సోషల్ మీడియా కన్వీనర్ ఎం నరేంద్రసింహ, ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ కన్వీనర్ జల్లా కోటయ్య మండల ఉపాధ్యక్షురాలు కే సౌభాగ్య లక్ష్మి, కే సురేష్, సిహెచ్ కోటేశ్వరరావు, అలవాల నాగేంద్ర, ఎం నారాయణ, వి రామారావు బి నిర్మల, యు గంగాభవాని, తదితరులు పాల్గొన్నారు.



