అక్రమ బెట్టింగ్ నెట్‌వర్క్‌ను ఛేదించిన తెలంగాణ సీఐడీ..11 మంది అరెస్ట్
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
అధిక మొత్తాల్లో రాబడి పేరిట ప్రజలను ఆకర్షించి బెట్టింగ్ యాప్‌లను నిర్వహిస్తూ లక్షల రూపాయలను దండుకుంటున్న అంతర్రాష్ట్ర బెట్టింగ్ ముఠా గుట్టును సీఐడీలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం గుట్టును రట్టు చేసింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఈ యాప్‌ను నిర్వహిస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్న 11 మంది గుజరాత్ ముఠా సభ్యులను సీఐడీ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి అరెస్ట్ చేసింది. ఈ వివరాలను సీఐడీ డైరెక్టర్ జనరల్ చారు సిన్హా సోమవారం తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం… కరీంనగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చల్లా సాయి కృష్ణరెడ్డి డాఫాబెట్ ప్రచార కార్యక్రమాలకు ఆకర్షితుడయ్యాడు. ఆ తర్వాత ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పాల్గొన్నాడు. ఆ ప్లాట్‌ఫామ్‌లో ఆయన 2024 జనవరి నుంచి 2025 జనవరి మధ్య డబ్బు జమ చేసి పందెం కాసి, మొత్తం రూ. 9.95లక్షలు కోల్పోయాడు. దీనికి సంబంధించి కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని కరీంనగర్-2 పోలీస్‌స్టేషన్‌లో బీఎన్‌ఎస్‌తో పాటు ఐటీ చట్టం, టీఎస్‌జీఏలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదైంది. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్‌ను, అలాంటి ప్లాట్‌ఫాంల నుంచి పౌరులను రక్షించడానికి తెలంగాణ సీఐడీ డీజీ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే ఏర్పాటైంది.
కాగా ప్రస్తుత కేసులో 46 మధ్యవర్తి బ్యాంకు ఖాతాల నెట్‌వర్క్ ద్వారా ఫిర్యాదుదారుడి నిధులను సిట్ గుర్తించింది. నిందితులు డాఫాబెట్ యాప్ ద్వారా క్రికెట్, క్యాసినో గేమ్స్, ఏవియేటర్ ప్లాట్‌ఫామ్‌పై బెట్టింగ్‌ను ప్రోత్సహించారు. సులభంగా డబ్బు సంపాదించొచ్చని, బోనస్‌లు, అధిక రాబడులు వస్తాయని నమ్మించి బాధితులను ఆకర్షించారు. యూపీఐ ఐడీలు, క్యూఆర్‌కోడ్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తో పాటు పలు బ్యాంకు ఖాతాల ద్వారా నిందితులు.. బాధితుల నుంచి నిధులను సేకరించారు. కాగా నిందితులను పట్టుకోవడానికి ఒక్కో డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఆరు ప్రత్యేక బృందాలు న్యూఢిల్లీ, గుజరాత్, పంజాబ్‌లకు వెళ్లాయి. రెండువారాల పాటు సాగిన ప్రత్యేక బృందాల శ్రమ ఫలితంగా గతనెల 29న 11 మంది నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు. కాగా కరీంనగర్‌లోని ఫస్ట్ క్లాస్ పీసీఆర్ కోర్టు జ్యుడీషియల్ మేజిస్ట్రేటు ఎదుట హాజరుపర్చేందుకు నిందితులను హైదరాబాద్‌లోని సీఐడీ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నట్టు అధికారులు చెప్పారు. 11 మంది నిందితుల్లో ఆరుగురు గుజరాత్‌కు చెందినవారు కాగా, ముగ్గురు ఢిల్లీ, ఇద్దరు పంజాబ్‌కు చెందినవారు ఉన్నారు. పోలీసులు వారి వద్ద నుంచి విలాసవంతమైన మూడు కార్లు, ఎనిమిది ల్యాప్‌టాప్‌లు, రెండు ఐప్యాడ్‌లు, 26 మొబైల్‌ఫోన్లు, పాస్‌పోర్ట్‌లు, రూ.3.21 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.



