నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాలలో గతంలో ఇంగ్లీష్ ఉపాధ్యాయునిగా సేవలందించి పదవీ విరమణ పొందిన రాజేశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయన స్వయంగా సన్మానించారు. అదేవిధంగా పాఠశాల నుండి ట్రిపుల్ ఐటీ బాసరలో ప్రవేశం సాధించిన విద్యార్థులు యెనుగందుల సౌమిత్, శ్రీజ ను ప్రత్యేకంగా అభినందించి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల కృషి, పట్టుదల, విజయాలను కొనియాడుతూ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం అందించారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల విజయాలను అభినందించి వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. రిటైర్డ్ ఉపాధ్యాయుడు రాజేశ్వర్ గౌడ్ ప్రోత్సాహం విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.విద్యార్థులలో విద్యాపట్ల ఆసక్తి, లక్ష్యసాధన పట్ల నిబద్ధత పెంపొందించే విధంగా ఈ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచింది.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ వేముల నాగభూషణం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



