అటుకులతో చేసిన పదార్థాలు ఎంతో రుచిగా ఉంటాయి. అంతేకాదు మనసు నిండుగా పొట్ట తేలిగ్గా ఉండాలని కోరుకునేవాళ్లు వీటితో రకరకాల పదార్థాలను చేసుకుని ఆరగించవచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించే అటుకులతో చేసిన కొన్ని వంటకాలు ఈరోజు మీకోసం…
మిక్చర్
కావల్సిన పదార్థాలు: అటుకులు – మూడు కప్పులు, గొట్టాలు – కప్పు, నిమ్మకాయ – ఒకటి, ఉప్పు – టీ స్పూన్, మరమరాలు – కప్పు, సన్న చక్రాలు – చిన్న కప్పు, జీలకర్ర పొడి – టేబుల్ స్పూన్, చాట్ మసాలా – టీ స్పూన్ , పుదీనా ఆకులు అర కప్పు, కొత్తిమీర – అర కట్ట, పచ్చిమిర్చి ముక్కలు – కొన్ని, ఉల్లిగడ్డ ముక్కలు – అరకప్పు.
తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో మరమరాలు, అటుకులు, గొట్టాలు, జీలకర్ర పొడి, కొద్దిగా చాట్ మసాలా వేసి బాగా మిక్స్ చెయ్యాలి. ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్ వస్తుంది. ఇంకా ఈ మిశ్రమం చేసుకున్న తర్వాత దాన్ని చిన్న గిన్నెలో పెట్టుకుని నిమ్మరసం వేసి తిప్పి కాసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు మట్టి పాత్ర తీసుకుని వాటిలో గొట్టం మిక్చర్ కూడా వేసుకుని నాలుగు ఉల్లి ముక్కలు, రెండు పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా కొద్దిగా పుదీనా, అర కట్ట కొత్తిమీర చేతితోనే కలిపి తినేయవచ్చు. చిన్న పిల్లలకు ఇచ్చేటప్పుడు కొద్దిగా కారం తగ్గించి ఇవ్వాలి లేదంటే కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది.
వడ
కావల్సిన పదార్థాలు: అటుకులు – కప్పు(నీళ్లలో తడిపి పిండుకోవాలి), ఉల్లిగడ్డ ముక్కలు – రెండు టేబుల్ స్పూన్లు, శనగపిండి – టేబుల్ స్పూన్, బియ్యప్పిండి – రెండు టేబుల్ స్పూన్లు, అల్లం పేస్ట్ – టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ – ఒకటిన్నర టీ స్పూన్లు, పసుపు – పావు టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, కొత్తిమీర తురుము – మూడు టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత, నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా
తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఉల్లిగడ్డ ముక్కలు, అటుకులు, బియ్యప్పిండి, శనగపిండి, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. పసుపు, జీలకర్ర, కొత్తిమీర తురుము, ఉప్పు వేసుకుని మరోసారి కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు వేసుకుని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకుని చేతులతో వడల్లా ఒత్తుకుని నూనెలో డీప్‌ఫ్రై చేసుకుంటే రుచిగా ఉంటాయి.
ఢోక్లా
కావల్సిన పదార్థాలు: అటుకులు – కప్పు, పెరుగు – ముప్పావు కప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి – మూడు, అల్లం వెల్లుల్లి తురుము – టేబుల్‌స్పూను, పంచదార – టీస్పూన్, ఉప్పు -తగినంత, బేకింగ్‌సోడా – అర టీస్పూను, పోపు కోసం: ఆవాలు – టీ స్పూను, కరివేపాకు రెబ్బలు – పది, కొత్తిమీర తరుగు – కొద్దిగా.
తయారీ విధానం: అటుకులను శుభ్రంగా కడిగి పెరుగు వేసి నాలుగైదు గంటలపాటు నాననివ్వాలి. దీంట్లో ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లంవెల్లుల్లి తరుగు, పంచదార, బేకింగ్‌సోడా వేసి బాగా కలపాలి. స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకుని నీళ్లు పోసి మరిగించాలి. దీని మీద ప్లేటు పెట్టి దానికి నూనె రాయాలి. కలిపిన మిశ్రమాన్ని ప్లేటు మీద వేసి మూతపెట్టి అరగంటపాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు చాకుతో గుచ్చి ఉడికిందో లేదో చూడాలి. చాకుకు ఏమీ అంటుకోకపోతే ఉడికినట్టే. దీని మీద నూనె రాసుకుని ఢోక్లాను ముక్కల్లా కోయాలి. తర్వాత కడాయాఇలో నూనె పోసి వేడిచేసి ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. తాలింపు చల్లారిన తర్వాత దీంట్లో నీళ్లు పోసి పంచదార వేసి మరిగించాలి. తర్వాత ఈ నీళ్లను ఢోక్లా మీద పోయాలి. చివరగా కొత్తిమీర తరుగుతో అలంకరించాలి.
దోసె
కావల్సిన పదార్థాలు: అటుకులు – అరకప్పు, బియ్యం – కప్పు, మినపప్పు – నుండే టేబుల్ స్పూన్లు, మెంతులు – అర టేబుల్‌స్పూను, ఉప్పు – తగినంత, పెరుగు – కప్పు.
తయారీ విధానం: అటుకులు, బియ్యం, మెంతులను గిన్నెలో వేసి నీళ్లు పోసి రెండు మూడుసార్లు బాగా కడగాలి. పెరుగులో కొన్ని నీళ్లు పోసి గిలకొట్టి దీంట్లో అటుకులు, బియ్యం వేయాలి. ఈ మిశ్రమాన్ని నాలుగ్గంటలపాటు నానబెట్టి, తగినంత ఉప్పు వేసి దోసెలపిండిలా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఆరుగంటల పాటు నానబెట్టాలి. పెనం మీద నూనె పోసి వేడిచేసి దోసె వేయాలి. మధ్యస్థంగా ఉండే మంట మీద దీన్ని ఒకవైపు కాలిస్తే సరిపోతుంది.
ఆరోగ్య ప్రయోజనాలు
ఇటుకులలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. ఎవరైతే రక్తహీనత సమస్యతో బాధపడేవారు అలాంటి వారు తరచు వారి ఆహార పదార్థాలలో భాగంగా అటుకులు తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు.
అటుకులలో ఉండే నాలుగు రకాల విటమిన్లు ఇవి మన శరీర ఆరోగ్యానికి ఎంతో సహాయ పడతాయి. తక్షణ శక్తి కావాలనుకునేవారు ఈ అటుకులను నానబెట్టి తీసుకుంటే మంచి బూస్టర్ ల పనిచేస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ అటుకులు మంచి చిట్కాలా పనిచేస్తాయి.
అటుకులలో ఎక్కువగా ఉండే పైబర్ ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. అలాగే జీర్ణ సమస్యలను దూరం చేసి మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
వీటిలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ఉన్న వైరస్ ని తరిమి కొట్టడంలో సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కూడా అటుకులు కీలకపాత్ర పోషిస్తాయి.
అటుకులతో అదిరే రుచులు
- Advertisement -
- Advertisement -



