Tuesday, June 2, 2026
E-PAPER
Homeఎడిట్ పేజినిటి ఆయోగ్ శల్య సారధ్యంలో సార్వత్రిక విద్య!

నిటి ఆయోగ్ శల్య సారధ్యంలో సార్వత్రిక విద్య!

- Advertisement -

2014-2024 మధ్య కాలం లో పాఠశాలల్లో నమోదయ్యే విద్యా ర్థుల సంఖ్యలో 2.26 కోట్లు తగ్గిం దని, లక్ష ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని ‘‘భారత దేశంలో పాఠశాల విద్యా వ్యవస్థ: కాలక్రమ విశ్లేషణ -నాణ్యత పెంపు కోసం విద్య మార్గ సూచి’’ అనే నివేదికలో నిటి ఆయోగ్ తెలిపింది. ‘సంకల్ప పత్ర’ పేరుతో ఆకర్షణీయ నినాదాలు, వాగ్దానాలతో ఆధునికమైన నాణ్యమైన విద్యను అందిస్తామని మూడేళ్ల నాడు ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ ప్రకటించారు. జాతీయ విద్యా విధానం 2020 ద్వారా భవిష్యత్తు కాలంలో సవాళ్లను ఎదుర్కొనే విద్యార్థులను తయారు చేస్తామని వాగ్దానం చేశారు. అత్యుత్తమ పాఠశాల విద్య అందిస్తూ వందశాతం నమోదుకు వాగ్దానం చేస్తున్నామని కూడా ఎన్నికల ప్రణాళికలో తెలిపారు. అధికారంలోకి వచ్చిన గత పన్నెండేండ్ల కాలంలో విద్యారంగానికి కేటాయిస్తున్న బడ్జెట్ ఏటా తగ్గిస్తూ, గత బడ్జెట్లో 2.53 శాతమే కేటాయింపులు చేసింది. బడ్జెట్లో విద్యారంగానికి నిధుల కేటాయింపు లేకుండా విద్యారంగంలో అభివృద్ధి సాధించలేమని నిటి ఆయోగ్‌ నివేదిక ద్వారా స్పష్టమైంది. నిధులు తగ్గిపోవడంతో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయుల నియామకాలు తగ్గిపోయాయి. దేశంలో ‌పది లక్షల మంది ఉపాధ్యాయుల కొరత ఉందని నిటి ఆయోగ్‌ తెలపడం గమనార్హం. తమ నివాసాలకు దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలలో మూతపడితే పేద, వెనుకబడిన వర్గాల పిల్లలు మధ్యలోనే చదువు మానేస్తున్నారని నివేదిక ద్వారా అర్థమవుతుంది.
2014-2015 విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో 26.95 కోట్ల మంది పిల్లలు నమోదు కాగా, 2024-2025 నాటికి వారి సంఖ్య 24.69 కోట్లకు తగ్గింది. ఈ కాలంలో ప్రభుత్వ పాఠశాల సంఖ్య 11.07 లక్షల నుండి 10.13 లక్షలకు తగ్గింది. విచిత్రంగా ఈ దశాబ్ద కాలంలో ప్రయివేటు పాఠశాలల సంఖ్య మాత్రం 2.8 లక్షల నుండి 3.39 లక్షలకు పెరిగింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి దాదాపు నలభై వేల పాఠశాలలు విలీనమయ్యాయి. పాఠశాలల విలీనం అనేది పాఠశాల విద్యను సార్వత్రికం చేయాలనే లక్ష్యాన్ని దెబ్బతీస్తోంది. 2030 నాటికి పాఠశాల విద్యను సార్వత్రికం చేయాలని భారత ప్రభుత్వం ‘‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డిజి)’’ కింద సంకల్పించింది. పాఠశాలల విలీన విధానం వల్ల భారతదేశం ఆ లక్ష్యాన్ని సాధించలేదు. కాగా మాధ్యమిక దశలో విద్యార్థులు తమ చదువులు కొనసాగించడంలో సవాళ్లు ఎదుర్కొంటున్నారు.
పర్యవేక్షణ పెంచేందుకు, సమర్థ నిర్వహణకు చిన్న పాఠశాలలను విలీనం చేయాలని నిటి ఆయోగ్ సిఫార్సు చేసింది. దీనివల్ల టీచర్లు, సదుపాయాలు, విద్యా నాణ్యత పెరుగుతాయని కూడా తెలిపింది. దేశవ్యాప్తంగా మూడోవంతు ప్రభుత్వ పాఠశాల లో యాభై మంది విద్యార్థులలోపే ఉన్నట్టు వెల్లడించింది. 2014- 2015 నుంచి 2025- 2026 వరకు దేశ పాఠశాల విద్యా వ్యవస్థ ప్రగతిపై నిటి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలో వెల్లడయ్యాయి. విద్యార్థులు చదువు మానేయడానికి గల కారణాలను అన్వేషించి, వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయకుండా, విద్యార్థుల సంఖ్య తగ్గిపోతే పాఠశాలలను మూసివేయాలని పరస్పర విరుద్ధమైన సిఫార్సులు నిటి ఆయోగ్ చేసింది.
‘‘దేశవ్యాప్తంగా పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు పెరగకపోవ డానికి టీచర్లకు బోధనేతర పనులు అప్పగించడం కారణమైంది. విద్యాప్రమాణాలు పెరగాలంటే అది ఉపాధ్యాయుల సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది. వారికి బోధనేతర పనులైన సర్వేలు, ఎన్నికల విధులు తదితరాల వల్ల దాదాపు పద్నాలుగు శాతం బోధన సమయం దెబ్బతింటోందని’’ గత పదేళ్లలో ‘‘పాఠశాల విద్యాప్రగతి.. సవాళ్లు.. అడ్డంకులను’’ నిటి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రాథమిక తరగతుల విద్యార్థులకు 200 పనిదినాలు.. 800 క్లాసుల పీరియడ్లు అందాలి. ప్రాథమికోన్నత తరగతులకు 220 రోజులు.. వెయ్యి పీరియడ్ల బోధన కొనసాగాలి. అయితే బోధనేతర పనులు, రికార్డులు భద్రపరచడం, మధ్యాహ్నభోజనం పర్యవేక్షణ, యాప్‌‌ల ద్వారా వివరాలు నమోదు లాంటివి వచ్చి చేరుతున్నాయి. దీనివల్ల ఉపాధ్యాయులు అనేకసార్లు పాఠం చెప్పటం ఆపి బోధనేతర పనులు చేయాల్సి వస్తోంది. అసలే బహుళ తరగతులకు ఒకే టీచర్‌.. ఈ పనుల వల్ల అభ్యసన సామర్థ్యాలపైనా తీవ్ర ప్రభావం పడుతోంది.
దేశంలో 1.04 లక్షల ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. వాటిల్లో 33.76 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. తెలంగాణలో ఇలాంటి 5,002 బడుల్లో 62,288 మంది పిల్లలున్నారు. 2400 వరకు జీరో ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలలు ఉన్నాయి. ఐదు తరగతులకు ఒక్కరే బోధించాల్సి ఉండగా.. బోధనేతర పనులు అదనం. మరోవైపు ప్రయోగశాలల్లో ప్రాక్టికల్స్‌ చేయించే పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా యాభై శాతం పాఠశాలల్లో సరైన ల్యాబ్‌లు లేవు.
రాజస్థాన్ లో 30 మంది పిల్లల లోపు ఉన్న 2086 ప్రాథమిక, 2997 అప్పర్ ప్రైమరీ పాఠశాలలను విలీనం చేయడంతో ఇప్పుడు 1-12 తరగతులున్న పాఠశాలలు (కాంపోజిట్ స్కూల్స్) అత్యధికంగా ఉండడంతో పాటు ఆర్థిక భారం తగ్గిందని నివేదిక వెల్లడించింది.
రాష్ట్రంలో బోధనేతర పనులు అధికంగా ఉన్నాయని టీచర్లు, ప్రధానోపాధ్యా యులు వాపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 27 వేల ప్రభుత్వ పాఠశాలలుంటే కేవలం 4,164 మంది బోధనేతర సిబ్బంది మాత్రమే పనిచేస్తుండటం గమనార్హం. వారుకూడా ఉన్నచోటే ఇద్దరున్నారు. లేనిచోట అసలే లేరు. వారిని విద్యార్థుల సంఖ్య ఆధారంగా హేతుబద్ధీకరించాలన్న డిమాండ్‌ ఉన్నా విద్యాశాఖ పట్టించు కోవడం లేదు. ‘‘దాదాపు పది రకాల యాప్‌లు ఉన్నాయి. నిత్యం ఏదో డేటా అడుగుతూనే ఉంటారు. వాటిని యాప్‌ల్లో నమోదు చేయాలి. లేకుంటే సమస్య అవుతుంది, పలుమార్లు పాఠం చెప్పడం ఆపి బోధనేతర పనిచేయాల్సి వస్తోంది’’ ఇది ఉపాధ్యాయుల వేదన. కనీసం ప్రతి హైస్కూల్, వందకు మించి విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలల్లో యాప్‌లలో నమోదు, ఇతర పనులు చేయడానికి బోధనేతర సిబ్బంది ఒకరిని నియమించడం సమస్యను పరిష్కరిస్తుంది.
నిటి ఆయోగ్‌ దేశాభివృద్ధికి కావలసిన ప్రణాళికలు రచించి అమలు చేయుటకు తగు మార్గదర్శకాలు అందించే ఉన్నత స్థాయి విధాన కమిటీ. దేశంలో విద్యా వ్యవస్థ తీరుతెన్నులు, రాజ్యాంగ లక్ష్యాలు, విద్యాహక్కు అమలులో తగు ప్రణా ళికలు ఇచ్చే క్రమంలో పరస్పర వైరుధ్యమైన సూచనలు చేయడం శోచనీయం. అందరికీ నాణ్యమైన విద్య అందిస్తామని ప్రజలకు వాగ్దానం చేసిన ప్రభుత్వానికి అందుకు తగు సూచనలు చేయకుండా క్షేత్రస్థాయిలో ఆచరణాత్మక సిఫార్సులు చేయడం కర్తవ్యంగా ఉండాలి. అందుకు భిన్నంగా పర్యవేక్షణ పెంచడానికి, సమర్థ నిర్వహణకు పాఠశాలలను విలీనం చేయాలని ఒక వైపు చెబుతూనే, మరోవైపు పిల్లల్లో అభ్యసన సామర్ధ్యాలు పెరగకపోవడానికి టీచర్లకు బోధనేతర పనులు అప్పగించడం కారణమని వివరిస్తోంది.
నిటి ఆయోగ్ విద్యారంగంలోని పరిస్థితులను తన నివేదికల ద్వారా తెలుపుతూ, లోపాలను అధిగమించే ప్రణాళికలు రూపొందించాలి. అమలు చేయడానికి ఆచరణాత్మక మార్గదర్శ కాలు ఇవ్వాలి. కాని అందుకు పరిష్కారాన్ని ప్రయివేటు పాఠశాలలను, ప్రయివేటు విద్యాసంస్థలను, యూనివర్సిటీలను అనుమతించ డానికి సరళీకరించే మార్గదర్శకాలు చూపుతోంది. అంటే నిటి ఆయోగ్ నయా ఉదారవాద ఆర్థిక విధానాలను తలకెత్తుకొని, జాతీయవాదం ముసుగులో “ప్రయివేటీకరణ పాట” పాడుతోం దన్నమాట. ఏదిఏమైనా పన్నేండేండ్ల మోడీ పాలనలో చదువు అటకెక్కింది. ప్రభుత్వ విద్యావ్యవస్థ నిర్వీర్యమైంది. కార్పొరేట్, ప్రయివేట్ అనుకూల విధానాల ఫలితంగా ప్రభుత్వ విద్య పతనమవడం వలన పేదలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు విద్యను అభ్యసించలేని పరిస్థితి వచ్చింది.
కె. వేణుగోపాల్, 9866514577

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -