ఓఎస్‌ఎం సేవలపై విచారణా కమిటీ
వివాదం నేపథ్యంలో కేంద్రం నిర్ణయాలు
పార్లమెంట్ ప్యానల్ కమిటీ ఎదుటకు రాక ముందే చర్యలు
న్యూడిల్లీ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ఆన్-స్క్రీన్ మార్కింగ్ వ్యవస్థపై వివాదం రేగిన నేపథ్యంలో సీబీఎస్ఈ చెర్మెన్ రాహుల్ సింగ్, సెక్రె టరీ హిమాంశు గుప్తాలను బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు మంగళవారం తెలిపారు. అలాగే ఆన్ స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్‌ఎం) వ్యవస్థ సేవలను సీబీఎస్ఈ తీసుకోవడంపై కూడా విచారణ జరిపేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 2019లో తెలంగాణా ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలపై చెలరేగిన వివాదంతో సంబంధమున్న సంస్థపై ప్రశ్నలను తాజాగా సీబీఎస్ఈ ఓఎస్‌ఎం వివాదం గుర్తుకు తెచ్చింది. 12వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలైన నేపథ్యంలో విద్యార్ధుల జవాబు పత్రాలను మూల్యాంకన చేయడంలో తేడాలు, అలాగే రీ వాల్యూయేషన్ ప్రక్రియ సరిగా పనిచేయకపోవడంపై సీబీఎస్ఈ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది.
తమ అంచనాలకు, తమకు వచ్చిన మార్కులకు అసలు పొంతనే లేదని విద్యార్ధుల్లో భావన నెలకొన్న నేపథ్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన ఓఎస్‌ఎం వ్యవస్థను కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ ఏడాది సీబీఎస్ఈ పాసైన శాతం 85.29శాతానికి పడిపోయింది. ఇది గతేడాది 88.39శాతంగా వుంది. అలాగే 90శాతానికి పైగా మార్కులు సాధించిన విద్యార్ధుల సంఖ్య కూడా తగ్గిపోయింది.
జవాబు పత్రాల కాపీలను కావాలని వేలాదిగా అభ్యర్ధనలు రావడంతో ఫలితాల అనంతర వెరిఫికేషన్ పోర్టల్ కుప్పకూలింది. తమ జవాబు పత్రాలకు సంబంధించిన స్కాన్ చేసిన కాపీలను ఎవరైతే పొందగలిగారో ఆ విద్యార్ధులు వాటిని చూసి షాక్‌కు గురయ్యారు. తాము జవాబు రాసిన పేజీలు అస్పష్టంగా వుండడమో లేదా కనిపించకుండా పోవడమో జరగడంతో వారు దిగ్బ్రాంతిలో వున్నారు. చాలామంది విద్యార్ధులకు ఇతరుల జవాబు పత్రాలు వచ్చాయి.
ఏకసభ్య కమిటీ
సీబీఎస్ఈ తీసుకున్న ఓఎస్‌ఎం సేవలకు సంబంధించిన అంశాలపై విచారణ జరిపేందుకు ఏక సభ్య కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఛైర్‌పర్సన్ ఎస్.ఎ.రాధా చౌహాన్ నేతృత్వంలో కమిటీ పనిచేస్తుంది. ఈ మేరకు మంగళవారం క్యాబినెట్ సెక్రె టేరియట్ ఒక మోమోరాండాన్ని విడుదల చేసింది. అవసరమనుకుంటే ఇతర విభగాల అధికారుల సాయాన్ని చౌహాన్ కోరవచ్చు. అలాగే కమిటీకి అవసరమైన కార్యదర్శి సాయాన్ని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ అందచేస్తుంది. నెల రోజుల్లోగా ఈ కమిటీ తన నివేదికను సిబ్బంది, శిక్షణా విభాగానికి అందచేస్తుంది. ఈ మెమోరాండం కాపీని కేంద్ర స్కూలు విద్య, అక్షరాస్యతా విభాగానికి కూడా పంపారు.
రీ వేల్యుయేషన్ పోర్టల్ ప్రారంభం
మంగళవారం తెల్లవారు జాముకల్లా సీబీఎస్ఈ రీ వేల్యుయేషన్ పోర్టల్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 3గంటల కల్లా 16వేల మందికి పైగా విద్యార్ధులు తమ వివరాలు నమోదు చేసుకున్నారని సీబీఎస్ఈ ఒక వీడియో ఎక్స్‌లో పోస్టు పెట్టింది. విద్యార్ధులిచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా అవసరమైతే ఈ ప్లాట్‌ఫారమ్‌కు మరిన్ని మెరుగులు దిద్దుతామని తెలిపింది. తొలుత సోమవారానికల్లా ప్రారంభిస్తామని గడువు ఇచ్చినప్పటికీ జరగలేదని, సైబర్ దాడులతో సేవలకు అంతరాయం కలిగించడానికి ప్రయత్నాలు కూడా జరిగాయని సీబీఎస్ఈ బోర్డు పేర్కొంది.
రెండు నిముషాల వ్యవధిలోనే 15లక్షల సార్లు హిట్‌లు వచ్చాయని, అనధికారికంగా లక్ష సార్లకు పైగా ఫైల్ యాక్సెస్‌లకు ప్రయత్నాలు జరిగాయని, తద్వారా సేవలు అందకుండా చేయడానికి ప్రయత్నాలు జరిగాయని ఎక్స్‌లో పెట్టిన పోస్టులో బోర్డు పేర్కొంది.
సోమవారం జరిగిన ఆలస్యంతో సిబిఎస్‌ఇ ఈ ఏడాది 12వ తరగతి పరీక్షా ప్రశ్నా పత్రాలను మూల్యాంకన చేయడానికి ఉపయోగించిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఒఎస్‌ఎం) వ్యవస్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మే 29నే ఈ పోర్టల్‌ను ప్రారంభించాల్సి వుంది. పారదర్శకమైన, ఎలాంటి ఇబ్బందుల్లేని ప్రక్రియను అందచేస్తామంటూ సీబీఎస్ఈ జూన్ 1కి వాయిదా వేసింది. దరఖాస్తు చేసుకుని, స్కాన్ చేసిన డిజిటల్ సమాధాన పత్రాలు పొందిన విద్యార్ధులు మాత్రమే ఈ రీ వేల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
సీబీఎస్ఈ చైర్మెన్, సెక్రెటరీ బదిలీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


