రాష్ట్ర యువ నాయకుడు వరిపల్లి అనిల్ కుమార్
నవతెలంగాణ-నెల్లికుదురు
నెల్లికుదురు మండలంలోని రాజుల కొత్తపల్లి – నెల్లికుదురు ప్రధాన రహదారిని యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేయాలని రాష్ట్ర యువ నాయకులు వరిపల్లి అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ గత 2024 సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ రహదారి తీవ్రంగా దెబ్బతిని, పెద్ద పెద్ద గుంతలతో ప్రయాణానికి ప్రమాదకరంగా మారిందని ఆయన తెలిపారు. రోడ్డు దెబ్బతిని దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు.
ఈ రహదారి గుండా ప్రతిరోజూ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు రాకపోకలు సాగిస్తుండగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. రాబోయే వర్షాకాలంలో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని, వర్షపు నీటితో గుంతలు కనిపించక ప్రమాదాల ముప్పు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.అమాయకుల ప్రాణాలు పోయే ప్రమాదం ఏర్పడకముందే జిల్లా కలెక్టర్, ఆర్&బి శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి రహదారి మరమ్మతు పనులు చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించాలని వరిపల్లి అనిల్ కుమార్ విజ్ఞప్తి చేశారు.



