అడ్డుకున్న గ్రామస్తులు
నవతెలంగాణ-అచ్చంపేట
బిల్లులు చెల్లించట్లేదని తాను వేసిన సీసీ రోడ్డు తొలగింపుకు కాంట్రాక్టర్ శేఖర్ యత్నంచాడు. మూడు ఏళ్ళు గా బిల్లు చెల్లించకపోవడంతో విసుగు చెంది బుధవారం సాయంత్రం నడింపల్లి గ్రామంలో సీసి రోడ్లు ను జెసిబి తో తొలగించి ట్రాక్టర్ ద్వారా ఎత్తివేయాలని పన్నాగం పన్నాడు. గమనించిన గ్రామస్తులు ఏకపక్షంగా వచ్చి అడ్డుకున్నారు. రెవెన్యూ తాసిల్దార్ కు, పంచాయతి రాజ్ డీ ఈ అధికారులకు సమాచారం ఇచ్చారు. తెలిసిన వివరాల ప్రకారం మండల పరిధిలోని నడింపల్లి గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ శేఖర్ ఐటీడీఏ పరిధిలో ఆశ్రమ పాఠశాలలు, మన ఊరు మనబడి కింద ప్రభుత్వ పాఠశాలలు, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ, రోడ్ల భవనాల శాఖ లలో ఎస్ డి ఎఫ్ గ్రామాలలో సిసి రోడ్లు పనులు చేశారు. ఉప్పునుంతల, అమ్రాబాద్, అచ్చంపేట మండలాలలో 2021, 2022, 2022- 2023, ఆర్థిక సంవత్సరంలో రూ కోటి 50 లక్షలు పైగా కాంట్రాక్టు పనులు చేశాడు. బిల్లులు చెల్లించాలని కార్యాలయాల చుట్టు తిరిగి విరక్తి చెందుతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు
పనులు పూర్తి చేసి మూడు ఏళ్ళు గడుస్తున్నప్పటికీ బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్ననని మనోవేదనకు గురవుతున్నాడు. ప్రతినెల అప్పులు తెచ్చిన వారికి వడ్డీలు కట్టలేకపోతున్నానని కుంగిపోతున్నాడు. దాదాపు ప్రతినెల లక్ష రూపాయలు వడ్డీలు చెల్లిస్తున్నానని దీని ద్వారా కుటుంబంలో కలహాలు ఏర్పడుతున్నాయని మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించాడు. జిల్లా కలెక్టర్, అధికారులు తన ఆర్థిక ఇబ్బందులను గమనించి బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.



