మొక్కజొన్న కొనుగోలుపై అమెరికాకు సాగిలపడ్డ మోడీ సర్కార్
మన మార్కెట్లోకి విచ్చలవిడిగా కార్న్ ఉత్పత్తులు
ఉపాధి కోల్పోనున్న భారత రైతాంగం
జెనెటివ్ ఆహార పంటలకు అనుమతితో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం
తెలంగాణకూ నష్టమే
ఆత్మనిర్భరభారత్, స్వదేశీ వస్తు జపం ఉత్తిదే : రైతు సంఘాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అమెరికాలో మొక్కజొన్న పంట ఉత్పత్తి ఎక్కువ. ఆ పంటను ఎక్కువగా చైనాకు ఎగుమతి చేసేది. ఆ రెండు దేశాల మధ్య పరస్పరం విపరీతంగా సుంకాలు పెంచేసుకోవడంతో అమెరికా నుంచి మొక్కజొన్న పంట కొనుగోళ్లను చైనా నిలిపివేసింది. ప్రత్యామ్నాయంగా బ్రెజిల్ నుంచి కొంటున్నది. దీంతో అమెరికా రైతులు ఆ దేశ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో ట్రంప్ కన్ను మన దేశంపై పడింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పేరుతో పాలు, గోధుమ, మొక్కజొన్న, సోయాబీన్, తదితర పంటలను, వాటి ఉత్పత్తులను కొనేందుకు ట్రంప్ సర్కారు వద్ద మోడీ సర్కారు సాగిలపడింది. కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్ లేదు.. లేదు.. కాదు.. కాదు.. అంటున్నా ఏదో ఒక రూపంలో మున్ముందు మన దేశ మార్కెట్లోకి కార్న్ ఉత్పత్తులు విచ్చలవిడిగా రావడమనేది నిగూఢ సత్యం. మన దేశంలో మొక్కజొన్న సాగుచేసే మన దేశ రైతాంగంపై దీని ప్రభావం పడనున్నది. ఇప్పటిదాకా ఆహార పంటలకు సంబంధించి జెనెటిక్ ఉత్పత్తులను మన దేశం అనుమతించలేదు. తాజా స్వేచ్ఛా ఒప్పందంతో ఆ ఉత్పత్తులకు ద్వారాలు తెరిచినట్టుయింది.
మన దేశంలో రెండున్నర కోట్ల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగవుతున్నది. మన దేశంలో అతి ఎక్కువగా సాగయ్యే పంటల్లో నాలుగోది. మన దేశంలో కర్నాటక, బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణల్లో ఎక్కువగా సాగవుతున్నది. మన తెలంగాణలో రెండున్నర లక్షల మంది రైతులు 10 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట పండిస్తుండగా..ఆ పంట సాగు, అనుబంధ పరిశ్రమలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఐదు లక్షల మందికిపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. వరంగల్, ఖమ్మం, నిర్మల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో ఈ పంట ఎక్కువగా సాగవుతున్నది. మన దేశంలో పండే మొక్కజొన్న పంటను 47 శాతాన్ని పౌల్ట్రీకి, 13 శాతాన్ని పశువుల దాణా తయారీకి, 14 శాతం కార్న్‌పౌడర్ తయారీకి, 20 శాతం ఇథనాల్, ఫుడ్ ఇండిస్టీలో, మిగతా ఎగుమతులకు వాడుతున్నారు. నేపాల్, శ్రీలంక, భూటాన్, బంగ్లాదేశ్, థాయిలాండ్ వంటి దేశాలకు కొంత మోతాదులో ఎగుమతి జరుగుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా నుంచి పెద్ద ఎత్తున దిగుమతులకు అనుమతి ఇవ్వడంతో మన దేశ రైతులు ఉపాధి కోల్పోయే ప్రమాదముంది. పంట ధర కూడా పడిపోయే ప్రమాదముంది.
యూఎస్‌లో అలా..మన దగ్గర ఇలా…
అమెరికా దేశం ఎక్కువగా పండించే పంటల్లో మొక్కజొన్న ఒకటి. 2024-25లో 378 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగింది. అక్కడ హెక్టార్లు 11.1 టన్నుల పంట దిగుబడి (సగటున ఎకరాకు 44 క్వింటాళ్లు) వస్తున్నది. ఆ దేశంలో మొక్కజొన్న సాగు చేసే రైతులు యూఎస్ఏ సర్కారు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నది. అదే మన దేశానికి వచ్చే సరికి ఎకరాకు సగటున 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తుండగా..ఆ పంట పండించే రైతులకు మన దేశ ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ మూడు శాతమే. ఇటు పంట దిగుబడి విషయంలోనూ, సబ్సిడీ విషయంలో యూఎస్ఏ మెరుగ్గా ఉంది. ఆ దేశం నుంచి గతంలో చైనా ఎక్కువగా కొనుగోలు చేసేది. ట్రంప్ సర్కారు చైనాపై సుంకాల ఆంక్షలు మోగించడంతో చైనా సైతం అంతే దూకుడును ప్రదర్శించింది.
అంతే కాకుండా బ్రెజిల్ నుంచి మొక్కజొన్న ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టింది. మరోవైపు ఇదే సమయంలో అమెరికాలో పెద్ద ఎత్తున మొక్క జొన్న ఉత్పత్తి పెరిగిపోయింది. తమ పంటలను కొనుగోలు చేయాలని ట్రంప్ సర్కారుపై ఆ దేశ రైతులు ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు. దీంతో ట్రంప్ కన్ను భారత్‌పై పడింది. తమ నుంచి మొక్క జొన్న కొనుగోళ్లను చేపట్టాలని ఒత్తిడి తీసుకొచ్చి విజయం సాధించింది. ట్రంప్ తమ రైతుల మేలు కోసం చేయగా..అదే మోడీ సర్కారు మాత్రం దేశ రైతుల ప్రయోజనాలను అమెరికా వద్ద తాకట్టు పెట్టిందనే విమర్శను రైతు సంఘాలు చేస్తున్నాయి. గతంలో మన దేశం ఆహార పంటల విషయంలో ఏనాడూ జన్యుమార్పిడి పంటలను స్వాగతించలేదు. ఆ పంటల ఉత్పత్తులను తింటే ప్రజల ఆరోగ్యంపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.
మన దేశ రైతులకు రక్షణ కరువు : టి.సాగర్
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
అమెరికా నుంచి మొక్కజొన్న, సోయాబీన్, పాలు, తదితర ఉత్పత్తుల దిగుమతిపై సుంకాలు ఎత్తివేసి మోడీ సర్కారు ద్వారాలు తెరవడంతో మన దేశ రైతులకు రక్షణ లేకుండా పోతుంది. ఇది మన దేశ సార్వభౌమత్వానికే ప్రమాదకరం. ఓట్ల కోసం ఆత్మనిర్భర భారత్, స్వదేశీ వస్తు జపం చేస్తూ కార్పొరేట్ల కోసం మోడీ సర్కారు పనిచేస్తున్నది. ఆహార పంటల్లో జన్యుమార్పిడి పంటలను ఆహ్వానించడం అత్యంత ప్రమాదకరం. స్వేచ్ఛా ఒప్పందాల పేరుతో దేశ సంపదను విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు దోచిపెట్టే తీరును గ్రామగ్రామాన ప్రజలకు విడమర్చి చెబుతాం. ఈ నెల 12న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మె దేశభక్తియుత సమ్మె. ఆ సమ్మెలో దేశభక్తి ఉన్న పౌరులందరూ పాల్గొనాలని ఎస్కేఎంగా ప్రజలకు పిలుపునిస్తున్నాం.



