Thursday, June 4, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅన్నదాతకు దిక్కెవరు!

అన్నదాతకు దిక్కెవరు!

- Advertisement -

అకాల వర్షాలు..తడుస్తున్న ధాన్యం రాశులు
కల్లాలు, మార్కెట్‌‌యార్డుల్లో రైతుల కన్నీళ్లు
ధాన్యం సేకరణపై కేంద్ర,
రాష్ర్ట ప్రభుత్వాల దొంగాట
దళారులకు అమ్ముకుని 
మోస పోతున్న రైతన్నలు
చోద్యం చూస్తున్న 
కేంద్ర మంత్రులు, ఎంపీలు
రాజకీయ అస్ర్తంగా 
ధాన్యం కొనుగోళ్లు

మళ్లీ అన్నదాత ఆగమయ్యాడు. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని కొనేదిక్కు లేక, కల్లాలు, మార్కెట్‌ ‌యార్డుల్లో రాసులు పోసి అకాల వర్షాలు వస్తే ఏం చేయలేక నిస్సహాయుడిగా చూస్తూ ఉండిపోతున్నాడు. రాష్ర్టంలో పదిరోజులుగా ఏదో ఒక ప్రాంతంలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. ధాన్యం రాశులు తడుస్తూనే ఉన్నాయి. ఎండలకు ఎండుతూ.. వానలకు తడుస్తూ…వరదలకు కొట్టుకుపోతూ ఇంకా సగం ధాన్యం కల్లాలు, మార్కెట్‌ ‌యార్డుల్లోనే ఉంది. అది చూసి రైతులు గుండెలు బాదుకుంటూనే ఉన్నారు. తమ రెక్కల కష్టాన్ని చెప్పుకుంటూ అరిగోస పడుతున్నాడు. అండగా నిలవాల్సిన పాలకులు రాజకీయ లెక్కలు వేసుకుంటూ తప్పు నీదంటే… కాదు నీదే అని ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నట్టు నటిస్తున్నారు.

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ర్టంలో ధాన్యం కొనుగోళ్లు ఏప్రిల్‌‌లో మొదలయ్యాయి. జూన్‌ ‌నెల వచ్చినా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వర్షాకాలం సీజన్‌ ‌మొదలైంది. పదిరోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలో 2021 సీజన్‌ ‌నుంచి ఇప్పటివరకు యాసంగిలో సగటున కోటీ 40 లక్ష‍ల మెట్రిక్‌ ‌టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తున్నది. ఎమ్‌ఎస్‌‌పీకి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. అయితే కొన్నేండ్లుగా ధాన్యం కొనుగోళ్ల విషయంలో మోడీ సర్కారు షరతులు పెడుతూ వస్తున్నది. ఈసారి 52 లక్ష‍ల మెట్రిక్‌ ‌టన్నులు కొంటామని పరిమితి విధించింది. కానీ ఈ ఏడాది రాష్ర్టంలో కోటీ 40 లక్ష‍ల మెట్రిక్‌ ‌టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసి, కేంద్రం కొనుగోళ్ల వాటాను పెంచాలనీ రాష్ర్ట ప్రభుత్వం కోరుతోంది. కనీసం 70 శాతం కొనాలని కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు కేంద్రానికి లేఖలు రాశారు. రాష్ర్టంలో పండించిన ధాన్యంలో కేవలం 37 శాతం మాత్రమే కొనుగోలు చేస్తామని కేంద్రం చెప్పకనే చెప్పేసింది.

అయితే కేంద్ర మంత్రులు బండి సంజయ్‌, కిషన్‌‌రెడ్డి మాత్రం కేంద్రం రాష్ర్ట ప్రభుత్వానికి డబ్బులిచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నదని ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు సీఎం రేవంత్‌‌రెడ్డి కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నారు. ఈనెల 15లోపు కేంద్రం ధాన్యం మొత్తం కొనకుంటే బీజేపీ కార్యాలయాలు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల ఇండ్లముందు ధాన్యం కుమ్మరిస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే కేంద్రం ప్రకటించిన మద్దతు ధరతో పాటు సన్నబియ్యానికి బోనస్‌ ‌కూడా ఇచ్చి 90 లక్ష‍ల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యాన్ని సేకరించాలని రాష్ర్ట ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దానికి తగినట్టు ఏర్పాట్లు చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా విఫలమైంది. పక్కా ప్రణాళిక లేకపోవడంతో గన్నీ బ్యాగుల కొరత, రవాణా వాహనాల కొరత, లేబర్ కొరత వంటి అనేక అవరోధాలు ఏర్పడ్డాయి. బుధవారం నాటికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర+బోనస్‌తో కలిపి ‌మొత్తం 70.06 లక్ష‍ల మెట్రిక్‌ ‌టన్నులు సేకరించినట్టు పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. ఇంకా 30 శాతం ధాన్యం రాశులు కల్లాలు, మార్కెట్‌ ‌యార్డుల్లోనే ఉన్నాయి. 20 శాతం పంటను రైతుల ఇప్పటికే దళారులకు అమ్మేసుకున్నారు.

కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీల వైఫల్యం
కష్టకాలంలో రైతులను ఆదుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి అధిక ధాన్యం సేకరించాలని ఒప్పించాల్సిన కేంద్ర మంత్రులు, 8 మంది బీజేపీ ఎంపీలు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పంజాబ్‌ ‌నుంచి 86 శాతం, చత్తీస్‌‌గఢ్‌ ‌నుంచి 67 శాతం, హర్యానా నుంచి 65 శాతం, ఒడిశా నుంచి 52 శాతం సేకరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ వాటానూ పెంచాలని ప్రధాని మోడీపై ఎలాంటి ఒత్తిడి తేలేక చేష్టలుడిగి చూస్తున్నారు. తమ తప్పిదాలు కప్పిపుచ్చుకొనేందుకు రాష్ట్రంపై దు మ్మెత్తిపోస్తూ ‘యాత్రలు’ చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని రాష్ర్ట ప్రభుత్వం రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -