Thursday, June 4, 2026
E-PAPER
Homeఆదిలాబాద్వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేసుకోవాలి

వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేసుకోవాలి

- Advertisement -

పంట మార్పిడి పద్ధతులు అవలంబించాలి
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నవతెలంగాణ – ముధోల్ 

వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు తమ పంటల సాగులో మార్పులు చేసుకోవాలని నిర్మల్  జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు.గురువారం కుంటాల మండలంలోని అంబగంటి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో జిల్లా కలెక్టర్, ముధోల్  శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఈ ఏడాది ఆశించినంత స్థాయిలో వర్షపాతం ఉండకపోవచ్చని వాతావరణ శాఖ నివేదికలు సూచిస్తున్నందున రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని అన్నారు. పంట మార్పిడి పద్ధతులను అవలంబించి, తక్కువ నీటి అవసరమయ్యే కొత్త రకాల పంటలను సాగు చేయాలని సూచించారు. ఈ విషయంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులకు, అవసరమైన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందిస్తారని తెలిపారు.

ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించి అధిక లాభాలు పొందాలని, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని వినియోగించుకొని డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని రైతులకు సూచించారు. నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, లైసెన్స్ పొందిన దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని తెలిపారు. విత్తనాల కొనుగోలు సమయంలో తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.అవసరానికి మించి ఎరువులు వాడరాదని సూచించిన కలెక్టర్, జిల్లాలో రికార్డు స్థాయిలో మొక్కజొన్న కొనుగోలు జరిగిందని, రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలులో నిర్మల్ జిల్లా మూడో స్థానంలో నిలిచిందని తెలిపారు.రాబోయే వర్షాకాలంలో వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను కూడా పాటించాలని సూచించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా చెత్త బండ్లలో వేయడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని చెప్పారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని, ప్లాస్టిక్ వల్ల పర్యావరణ కాలుష్యంతో పాటు అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు.

వర్షపు నీటిని వృథా కాకుండా ఒడిసిపట్టుకోవాలని, సోక్‌పిట్లు నిర్మించడం ద్వారా భవిష్యత్తు తరాలకు నీటి కొరత రాకుండా చూడాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు కందులు, మినుములు, పెసర్లు, నువ్వులు, పొద్దుతిరుగుడు వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులు మంచి లాభాలు పొందుతున్నారని, ఇతర రైతులు కూడా ఆ దిశగా ముందుకు రావాలని అన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఇద్దరు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు.అంతకుముందు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ మహిళా సంఘ భవనం, జీవనోపాధి ఆర్థిక సాధికారిత కేంద్రాలను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.గ్రామసభకు హాజరైన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, అధికారులకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో డీపీఓ శ్రీనివాస్, డీఆర్‌డీఓ విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, హార్టికల్చర్ అధికారి రమణ, తహసీల్దార్ కమల్ సింగ్, ఎంపీడీఓ వనజ, సర్పంచ్ జ్యోతిబాయి, ఇతర అధికారులు, సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -