Thursday, June 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రారంభమైన ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ ప్రత్యేక గ్రామసభలు

ప్రారంభమైన ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ ప్రత్యేక గ్రామసభలు

- Advertisement -

నవతెలంగాణ – ఆలేర్ రూరల్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న **‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక’లో భాగంగా ఆలేరు మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు.జిల్లా కలెక్టర్, పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు జూన్ 4, 6, 8, 10 తేదీలలో గ్రామసభలు నిర్వహించనుండగా,తొలి రోజు షెడ్యూల్ ప్రకారం శ్రీనివాసపురం, పటేల్‌గూడెం,సాయిగూడెం, మంతపురి గ్రామాల్లో మండల స్థాయి అధికారుల బృందం పర్యటించి గ్రామస్తులతో సమావేశమైంది.ఈ సందర్భంగా వివిధ శాఖలకు చెందిన అధికారులు ప్రభుత్వం నిర్దేశించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లక్ష్యాలు,అమలు విధానాలు, గ్రామాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో ఘనద్రవ్య వ్యర్థాల నిర్వహణ,సంపూర్ణ పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, మురుగు కాలువల పూడికతీత, శిథిలావస్థలో ఉన్న భవనాల గుర్తింపు వంటి అంశాలను వివరించారు.

అలాగే రాబోయే జనగణన-2027, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం, పంట మార్పిడి విధానాలు,ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పరిశుభ్రమైన తాగునీటి సరఫరా,క్లోరినేషన్,పైప్‌లైన్ లీకేజీల నివారణ చర్యలపై సంబంధిత అధికారులు ప్రజలకు సూచనలు చేశారు. ఉపాధి హామీ పథకం కింద ‘జల సంరక్షణ – మన సంరక్షణ’ కార్యక్రమంలో భాగంగా వర్షపు నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణం అవసరాన్ని వివరించారు. వర్షాకాలంలో వ్యాపించే సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డ్రగ్స్ నివారణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణ, గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణపై కూడా అవగాహన కల్పించారు.

ప్రభుత్వ పాఠశాలల బలోపేతం,బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థుల నమోదు పెంపు, అల్పాహార భోజన పథకం అమలు, గృహాలపై సోలార్ విద్యుత్ ఏర్పాటు, ఇందిరమ్మ ఇళ్ల మొదటి విడత గృహప్రవేశాలు, రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియల గురించి అధికారులు వివరించారు. ఈ ప్రత్యేక గ్రామసభల్లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడమే ఈ గ్రామసభల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -