నవతెలంగాణ – పరకాల
మాదారం రెవెన్యూ పరిధిలోని భూ వివాదం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. తమ వారసత్వ భూమిని అక్రమంగా కాజేసేందుకు కొందరు యత్నిస్తున్నారని, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బాధితులు గురువారం పరకాల ఆర్డీవో డి.ఎస్. వెంకన్నను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ కీలకమైన భూ హక్కు పత్రాలను, ఆధారాలను ఆయనకు సమర్పించారు.
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ, తరతరాలుగా తమ ఆధీనంలో ఉన్న సర్వే నెంబర్ 665లోని భూమిని నకిలీ పత్రాలతో ఆక్రమించుకునేందుకు గండ్ర సాయిరెడ్డి, పనునూట లింగస్వామి, గండ్ర దిలీప్ రెడ్డిలు ప్రయత్నిస్తున్నారని ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లారు. 2011 నుండి కోర్టు వివాదంలో ఉన్నప్పటికీ, తహసీల్దార్ కార్యాలయంలో అక్రమంగా పట్టాలు పొందారని ఆరోపించారు. గతంలో తహసీల్దార్‌కు కూడా అన్ని ఆధారాలు సమర్పించామని, ఇప్పుడు అదే ఆధారాలతో పాటు సమగ్ర వివరణతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీవోకు అందజేశామని వారు తెలిపారు.
మంగళవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్తత, బుధవారం అధికారులు పత్రాలు స్వీకరించిన తీరుపై స్థానికంగా చర్చ జరుగుతోంది. బాధితుల మొరను ఆలకించిన ఆర్డీవో, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. తమ భూమిని కాపాడి, అక్రమంగా జారీ చేసిన పట్టాలను రద్దు చేయాలని బాధితులు నల్లాల శ్రీనివాస్, శ్రీధర్, రవీందర్, నాగుర్ల చిన్న వీరన్న, షమీమ సుల్తానా, ఆకుల రాంబాబు, కానుగంటి రమాదేవి, గంధం శ్రీనివాస్ తదితరులు కోరుతున్నారు. రెవెన్యూ యంత్రాంగం ఈ భూ వివాదంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఇప్పుడు సర్వత్ర ఆసక్తి నెలకొంది.



