హవానా : క్యూబా మాజీ అధ్యక్షుడు రౌల్ కాస్ట్రో బుధవారం తన 95వ జన్మదినాన్ని జరుపుకున్నారు. 1996లో పౌర విమానాల కూల్చివేత ఘటనతో సంబంధం ఉన్నదంటూ రౌల్‌పై రెండు వారాల క్రితం అమెరికా అధికారులు హత్యా నేరం కింద అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రౌల్ కాస్ట్రో ఎక్కడ ఉన్నదీ ఎవరికీ తెలియడం లేదు. రౌల్‌ను గురువుగా, తండ్రిగా భావించే క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్-కానెల్ ఆయనపై ప్రశంసలు కురిపిస్తూ దేశానికి రౌల్ ఎంతగానో సేవలు అందించారని అన్నారు. ‘తన మాతృభూమికి, ప్రాంతీయ-ప్రపంచ శాంతికి, లక్షలాది ప్రజల సామాజిక న్యాయ స్వప్నాలను సాకారం చేసేందుకు ఎనలేని సేవలు అందిస్తూ 95 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఆయన అదృష్టం కాదు. అది మన అదృష్టం’ అని తెలిపారు. 1996లో క్యూబా ప్రవాసుల బృందం నడుపుతున్న విమానాలను కూల్చివేయాల్సిందిగా అప్పటి రక్షణ మంత్రి రౌల్ కాస్ట్రో ఆదేశించారంటూ అమెరికా ప్రభుత్వం ఆరోపించింది.
తాజాగా ఆయనపై న్యాయస్థానంలో అభియోగాలు మోపింది. క్యూబాలోని కమ్యూనిస్టు ప్రభుత్వంపై అమెరికా సాగిస్తున్న ఒత్తిడిలో ఇది ఒక భాగమని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. కాస్ట్రో సోదరుల నేతృత్వంలోని క్యూబా ప్రభుత్వాన్ని కూల్చివేయాలని అమెరికా దశాబ్దాల తరబడి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సంవత్సరం క్యూబాపై ఆర్థిక ఆంక్షలను తీవ్రతరం చేశారు. ఇంధన సరఫరాలను నిలిపివేశారు. క్యూబాలోని విదేశీ వ్యాపారాలపై కూడా ఆంక్షలు విధిస్తామని బెదిరించారు. గత నెల 20న మయామీలో రౌల్ కాస్ట్రోపై అభియోగ పత్రాన్ని ప్రకటించిన తర్వాత అమెరికా తాత్కాలిక అటార్నీ జనరల్ టాడ్ బ్లంచ్ మాట్లాడుతూ రౌల్‌ను న్యాయస్థానం ముందు నిలబెట్టడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తామని చెప్పారు. దశాబ్ద కాలం క్రితం బరాక్ ఒబామా నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వంతో కాస్ట్రో జరిపిన చర్చలు రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడడానికి దోహదపడ్డాయి. అయితే ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం రౌల్‌ను ఓ శత్రువుగా, హంతకుడిగా, నియంతగా చూస్తోంది.
95వ జన్మదినాన్ని జరుపుకున్న రౌల్ కాస్ట్రో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



