ప్రియమైన వేణు గీతికకు
నాన్న ఎలా ఉన్నావు? మొన్న వర్షం పడింది అన్నావు, ఎండలు ఇక నెమ్మదిగా తగ్గుతాయేమో. ఇటీవలె రాజస్థాన్ లో భయంకరమైన ఇసుక తుఫాన్ వచ్చింది, ఎక్కడ బళ్లు అక్కడే ఆగిపోయాయి. మీకు కూడా కొంచెం ఆ ప్రభావం ఉండి ఉంటుంది.
సరే నాన్న! ఎప్పటిలాగానే ఉత్తరం ద్వారా నీకు చెప్పాల్సినవి చెప్తున్న. మాట్లాడటం కంటే ఒక్కొసారి ఉత్తరాల ద్వారా చెప్తుంటే అదొక ఆనందం. ఉత్తరం ఎన్ని సార్లు అయిన చదువుకోవచ్చు కదా! పిల్లల గురించే మరో అంశం.
నాన్న కిందటి ఉత్తరానికి పొడిగింపు అనుకో ఈ ఉత్తరం.. పిల్లలు పై తరగతులకు వెళ్తున్న కొద్దీ స్నేహితులు, వారితో ఆడుకోవడానికి వారి ఇళ్లకు వెళ్లడం లేదా వారే వీరి ఇళ్లకు వస్తుంటారు. పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో, వారి కుటుంబం ఎక్కడ ఉంటుందో ఆ వివరాలు తెలుసుకోవాలి. బాగా చదువుతూ, మంచి కుటుంబ నేపథ్యం ఉన్న వారితోనే స్నేహం చేయనివ్వాలి. లేదంటే ఆ ప్రభావం పిల్లలపై పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడకు వెళ్లినా ఒక నిర్ణీత సమయం కేటాయించి ఆ సమయం లోపల ఇంటికి వచ్చేయమని చెప్పాలి. స్నేహితుల ఇంటికి చేరుకోగానే ఫోన్ చేయమని చెప్పాలి. ఒక వేళ ఆలస్యం అయితే కూడా ఫోన్ చేసి చెప్పమనాలి. దీనివల్ల పిల్లలు బాధ్యతగా భావిస్తారు.
నువ్వు ఎక్కడికి వెళ్లినా చెప్పి వెళ్లే దానివి, అలాగే స్నేహితుల ఇంటికి చేరుకోగానే ఫోన్ చేసేదానివి, ఒక వేళ ఆలస్యం అయితే మళ్ళీ ఫోన్ చేసి ఇంకా కొంచం సేపు ఆడుకుంటాం, ఇంకొక అరగంటలో వస్తాను అని చెప్పేదానివి. దాంతో నాకు టెన్షన్ ఉండేది కాదు. ఫలానా వాళ్ళ ఇంట్లో ఆడుకుంటున్నావు కదా అని నిశ్చింతగా ఉండేదాన్ని.
పిల్లలకు స్వేచ్ఛను ఇస్తూనే కొంచం కట్టడిలో పెట్టాలి. స్నేహితుల ఇంటి నుండి రాగానే సరదాగా కబుర్లు చెప్తూనే వివరాలు అడగాలి. స్నేహితులు ఇంకా ఎవరెవరు వచ్చారు, ఏం ఆటలు ఆడుకున్నారో తెలుసుకోవాలి. వారి ఇంట్లో ఎవరెవరు ఉంటారో అడగాలి. పెద్దవారు ఉంటే పలకరించమని చెప్పాలి. ఒక్కోసారి పిల్లలు పిల్లలు కొట్టుకుం టారు, మాట్లాడుకోవడం మానేస్తారు. అటు వంటి విషయాల్లో పెద్దలు అస్సలు తల దూర్చకూడదు. ఎందుకంటే పిల్లలు మళ్ళీ వాళ్లే కలిసిపోతారు, మనసులో ఏమి పెట్టుకోరు. కాబట్టి ఇవన్నీ చెప్తూ, గమనిస్తూ పిల్లలను పెంచాలి. ఉంటాను నాన్న.. వచ్చేవారం మరో ఉత్తరంలో ఇదే అంశం మీద మరికొన్ని చెప్తాను. ఉంటాను…
ప్రేమతో అమ్మ
పాలపర్తి సంధ్యారాణి
అన్నీ తెలుసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



