Sunday, June 7, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రజల గుండె చప్పుడు కమ్యూనిజం

ప్రజల గుండె చప్పుడు కమ్యూనిజం

- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజంపై పెరుగుతున్న అధ్యయనం
దానిపై అవగాహన లేని అజ్ఞాని పవన్‌‌కళ్యాణ్‌…సొంతంగా బలాన్ని పెంచుకునే పనిలో ఉన్నాం
మూడు నెలలు గ్రామాలు, బస్తీల్లో పర్యటనలు..ఉచిత విద్య వైద్యం కోసం దీర్ఘకాలిక పోరాటాలు
12 ఏండ్ల తెలంగాణలో ప్రజల బతుకులు మారలే..మత విద్వేష, భ్రమల రాజకీయాలు ఎల్లకాలం సాగవు
దేశంలో అసమానతలు పెరిగితే తిరుగుబాటు తప్పదు
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలివ్వాలి : ప్రెస్ క్లబ్ మీట్ ది ప్రెస్ లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రజల గుండె చప్పుడు కమ్యూనిజం అనీ, సమాజంలో దోపిడీ ఉన్నంత కాలం అది ఉంటుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ చెప్పారు. ప్రపంచంలో ఆర్థిక, సామాజిక అసమానతలు పెరిగే కొద్దీ కమ్యూనిజాన్ని, మార్క్స్‌ రాసిన దాస్‌ ‌కాపిటల్‌ గ్రంథాన్ని అధ్యయనం చేసేవారి సంఖ్య పెరుగుతున్నదని తెలిపారు. సీపీఐ(ఎం) గ్రామ స్థాయి నుంచి బలాన్ని పెంచుకునే పనిలో ఉందనీ, మూడు నెలల పాటు గ్రామాలు, బస్తీల్లో ప్రజలను కలిసే కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. మత, ప్రాంత, కుల, డబ్బు, ప్రలోబాలతో చట్టసభల్లో తమకు సీట్లు తగ్గిన మాట వాస్తవమేనన్నారు. వాటి పట్ల ప్రజల్లో ఉన్న భ్రమలు క్రమంగా తొలగిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయమనీ, తాము బలంగా పుంజుకుని ప్రజాశక్తిగా ఎదుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు ఉచిత విద్య, వైద్యం కోసం దీర్ఘకాలిక పోరాటాలు చేయబోతున్నట్టు ప్రకటించా రు. శనివారం హైదరాబాద్‌‌ ప్రెస్‌‌క్లబ్‌ ‌ఆధ్వర్యంలో మీట్‌ ‌ది ప్రెస్‌‌లో ఆయన పాల్గొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల ఆధారితంగా ఏర్పడిన 12 ఏండ్ల తెలంగాణలో ప్రజల ఆకాంక్ష‍లు నెరవేరలేదనీ, అట్టడుగు వర్గాల ప్రజల బతుకులు మారలేదని స్పష్టం చేశారు. ప్రాధాన్యతా క్రమంలో చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులను పూర్తి చేస్తూ వెళ్తే లక్ష‍లాది ఎకరాలకు సాగునీళ్లు అందేవని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టుల నిర్మాణాలు పాలక వర్గాలకు ఏటీఎమ్‌‌లుగా మారాయని విమర్శించారు. మరోవైపు రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చడంలో మోడీ సర్కారు వైఫల్యం చెందిందనీ, రాష్ట్రంలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంపై కేంద్రంపై ఇద్దరు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజల ఓట్లు కావాలిగానీ వారి ప్రయోజనాలు పట్టవా? అని నిలదీశారు. నవోదయ ప్రాజెక్టులను, యూనివర్సిటీలను తీసుకురావడంలో విఫలం అయ్యారని విమర్శించారు. ఆరుగాలం కష్టపడి అన్నదాతలు పండించిన పంటల్ని కొనలేని పరిస్థితిలో పాలకులు ఉన్నారనీ, అన్నదాతలకు ఆదుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ విమర్శలకు పరిమితం అవుతున్నాయని విమర్శించారు.

పట్టణ ప్రాంతాలకు ఉపాధి హామీ చట్టాన్ని విస్తరిస్తామనే హామీని తెలంగాణ సర్కారు విస్మరించిందని ఎత్తిచూపారు. మరోవైపు ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసే పనిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. రూ.12,13 వేల వేతనాలతో లక్ష‍లాది మంది కార్మికులు బతుకులు వెళ్లదీస్తున్నారని వాపోయారు. అలాంటి కార్మికులను ఆదుకోకుండా 12 గంటలు పనిచేయాలనీ, జీతాలు, సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యాలకు వ్యతిరేకంగా సమ్మెలు చేయొద్దని చట్టాలు రూపొందిస్తుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ‌గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం అని చెప్పి తర్వాత మాట మార్చిందనీ, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు లక్ష‍లాది మంది ఉద్యోగాలు పోయే నిర్ణయాలు చేస్తున్నదనీ, ఏడాదిలోనే రెండు లక్ష‍ల ఉద్యోగాల భర్తీ హామీని కాంగ్రెస్‌ ‌సర్కారు విస్మరించిందని విమర్శించారు. తమలా కూలినాలి పనులు చేయొద్దని లక్ష‍లాది రూపాయలు దారబోసి పిల్లల్ని చదివిస్తే వారికి ఉద్యోగాలు రాని పరిస్థితి నెలకొందనీ, చివరకు అడ్డాకూలీలు, సెక్యూరిటీ గార్డులు, స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, ఉబర్‌ వేదికలపై పనిచేయాల్సి దుస్థితి నెలకొందని వాస్తవ పరిస్థితిని ఎత్తిచూపారు. కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రభుత్వం విస్మరించిందన్నారు. పోడు రైతులకు ఇచ్చిన హామీలనూ నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో 30 లక్ష‍ల మంది పేదలకు ఇండ్లు లేవనీ, వారికి స్థలాలిచ్చి ఇండ్లు కట్టిస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అంతిమంగా అట్టడుగు వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతికే సమాజం రావాలని ఆకాంక్ష‍ించారు. జర్నలిస్టులకు కూడా ఇండ్ల స్థలాలివ్వాలని కోరారు.

విద్యారంగానికి 20 శాతం నిధుల కోసం పోరాటం
కేంద్ర ప్రభుత్వం విద్యకు 20 శాతం నిధులు కేటాయించాలని జాన్‌‌వెస్లీ డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్రంలో 60 శాతం మంది ప్రయివేటు విద్యాసంస్థల్లోనే చదువుతున్నారనీ, జీహెచ్‌ఎంసీలో ఆ శాతం 82 శాతంగా ఉందని తెలిపారు. కోటి మందికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్‌ ‌మహానగరంలో ప్రభుత్వ పాఠశాలలు సరిగా లేవనీ, ఉన్నా కనీస సౌకర్యాలు లేవని ఎత్తిచూపారు. రాష్ట్రంలో మూడు దశాబ్దాలుగా కొత్త పాఠశాలలు కట్టించడం లేదని చెప్పారు. దీంతో అనివార్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రయివేటు పాఠశాలలకు పంపిస్తున్నారనీ, అక్కడేమో యాజమాన్యాలు ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్నాయని వాపోయారు. రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని డిమాండ్‌ ‌చేశారు. అదే సమయంలో అందరికీ ఉచిత వైద్యం, విద్య అందేలా చర్యలు తీసుకోవాలనీ, ఆ రెండు సౌకర్యాలు కల్పిస్తే సామాన్య ప్రజలు బతుకులు మారుతాయని తెలిపారు. వీటి కోసం ప్రజల్ని సమీకరించి బలమైన ఉద్యమాలను రూపొంది స్తామని తెలిపారు. తెల్ల రేషన్‌‌కార్డుపై 14 రకాల సరుకులు ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. అనంతరం జాన్‌‌వెస్లీని ప్రెస్‌‌క్లబ్‌ ‌కార్యవర్గం సన్మానించింది. సీనియర్‌ ‌జర్నలిస్టులు ఎమ్‌ఏ. హష్మీ కోఆర్డనేటర్‌‌గా వ్యవహరించిన ఈ కార్య క్రమంలో ప్రెస్‌‌క్లబ్‌ అధ్యక్ష‍, ప్రధాన కార్యదర్శులు విజయ్‌‌కుమార్‌‌రెడ్డి, రమేశ్‌ ‌పాల్గొన్నారు.

బీజేపీని నమ్మితే ఆ పార్టీ ఖతమే
ఏ రాష్ట్రంలోనైనా బీజేపీని నమ్మి ప్రాంతీయ పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీలు ఖతమైపోతాయని జాన్‌‌వెస్లీ హెచ్చరించారు. మొదట తన విస్తరణ కోసం ప్రాంతీయ పార్టీలను బీజేపీ వాడుకుంటున్నదనీ, ఆ తర్వాత వాటిని మింగేస్తున్నదని తెలిపారు. దానికి శివసేన, ఎన్‌‌సీపీ, టీఎమ్‌‌సీ, తదితర పార్టీలే ఉదహరణలు అని చెప్పారు. కేంద్ర దర్యాపు సంస్థలను, రాజ్యాంగ సంస్థలను తన రాజకీయ లబ్ది కోసం బీజేపీ వాడుకుంటున్నదని విమర్శించారు. దేశంలో ప్రతిపక్ష‍ పార్టీలు లేకుండా చేయాలని బీజేపీ చూస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్‌ ‌పార్టీ కూడా ఈ విషయాన్ని గమనించకుండా గుడ్డిగా ముందుకెళ్తున్నదని విమర్శించారు. కేరళలో తమ పార్టీని ఓడగొట్టడానికి కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ , బీజేపీ లోపాయికారీ ఒప్పందంతో పనిచేశాయని విమర్శించారు.

అడవుల్ని దోచిపెట్టేందుకే…
కార్పొరేట్లకు అడవులన్ని దోచిపెట్టేందుకు మావోయిస్టులపై కేంద్రం దాడి చేసిందని జాన్‌‌వెస్లీ విమర్శించారు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదేనని తెలిపారు. తన కార్పొరేట్‌, మత రాజకీయాలకు ఆటంకంగా ఉన్న కమ్యూని స్టులపైనా, జర్నలిస్టులపైనా, ప్రశ్నించేవారిపైనా బీజేపీ టార్గెట్‌ ‌చేసి పనిచేస్తోందని విమర్శించారు. అయితే, నిర్బంధాలు, నియంతృత్వ పోకడలు ఎల్లకాలం సాగవనీ, బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని తెలిపారు.

పవన్‌ ‌వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం
కమ్యూనిస్టులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌‌కళ్యాణ్‌ ‌వ్యాఖ్యల్ని జాన్‌‌వెస్లీ ఖండించారు. పవన్‌‌కళ్యాణ్‌ ఇక్కడకు రావడాన్ని, ప్రచారం చేసుకోవడాన్ని వ్యతిరేకించడం లేదనీ, అయితే, ప్రాంతీయ విద్వేష వైఖరితో మాట్లాడటాన్ని తప్పుబడుతున్నామని స్పష్టం చేశారు. కమ్యూనిజంపై అవగాహన లేని అజ్ఞాని పవన్‌ ‌కళ్యాణ్‌ ‌విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిజంపై అధ్యయనం పెరుగుతున్నదనీ, అమెరికాలోనూ కమ్యూనిస్టులు బలపడుతున్నారనీ, పెట్టుబడి గ్రంథం పెరుగుతున్నదని విడమర్చి చెప్పారు.

దక్ష‍ిణాదికి నష్టం చేయొద్దు
నియోజకవర్గాల పునర్విభజనలో దక్ష‍ిణాది రాష్ర్టాలకు అన్యాయం చేయాలని చూస్తే ఉపేక్ష‍ించబోమని జాన్‌‌వెస్లీ తెలిపారు. దక్ష‍ిణాది రాష్ట్రాల్లో బీజేపీకి ఎంపీ సీట్లు రావడం లేదు కాబట్టే దక్ష‍ిణాదికి అన్యాయం చేయాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో బలమున్న చోట స్థానాలను పెంచుకోకుని అధికారం గుప్పిట పెట్టుకోవాలని చూడటం సరిగాదన్నారు. బీజేపీ ప్రమాదకర ధోరణిని పార్లమెంట్‌‌లో ప్రతిపక్ష‍ాలు తిప్పికొట్టాయని తెలిపారు.

విద్వేష రాజకీయాలు ఆందోళనకరం
తెలంగాణలో మత విద్వేషాలను ప్రజల్లోకి జొప్పించి అధికారంలోకి రావాలని కొన్ని శక్తులు చూడటం తెలంగాణకే ప్రమాదకరమని జాన్‌‌వెస్లీ హెచ్చరించారు. తెలంగాణ మొదటి నుంచీ లౌకిక భావన కలిగిన ప్రాంతం అని చెప్పారు. లౌకిక శక్తులు, ప్రజాస్వామిక వాదులు మత సామరస్యాన్ని, రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు జరుగుతున్న పోరాటంలో కలిసి కట్టుగా ముందుకు సాగాలని ఆకాంక్ష‍ించారు.

ప్రత్యామ్నాయ రాజకీయాలతో ముందుకు
తెలంగాణలో 9 కమ్యూనిస్టులు పార్టీలు న్నాయనీ, ఐక్యకార్యా చరణతో ముందు కెళ్తున్నామని జాన్‌‌వెస్లీ తెలి పారు. ప్రజా సమస్యలపై ఐక్యంగానే ఉద్యమాలు చేస్తున్నా మని చెప్పారు. అయితే, ఎన్నికల ఎత్తుగడల విషయానికి వచ్చేసరికి ఎవరికి వారు వెళ్తున్న పరిస్థితి ఉందని చెప్పారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు వామపక్ష‍ పార్టీలు కలిసికట్టుగా ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు.

అసమానతలు పెరిగేకొద్దీ తిరుగుబాటు అనివార్యం
దేశంలో కేవలం ఒక్క శాతం ప్రజల చేతిలో 40 శాతం సంపద పోగై ఉందనీ, అదే సమయంలో 50 శాతం మంది పేదలు కేవలం 3 శాతం సంపదతో బతుకులీడుస్తున్నారని చెబుతూ ఆర్థిక అంతరాలను జాన్‌‌వెస్లీ ఎత్తిచూపారు. తీవ్ర అసమానతలు పెరుగుతున్నాయనీ, విద్య, వైద్యం పేదలకు అందని ద్రాక్ష‍గా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని కప్పిపెట్టేందుకు పాలకవర్గాలు ప్రజల్ని భ్రమల్లో ముంచి లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. అయితే, ఆ రాజకీయాలు ఎల్లకాలం చెల్లుబాటు కావనీ, ప్రతిఘటనా పోరాటాలు అనివార్యంగా పుట్టుకొస్తాయనీ, అందులో భాగంగానే కాక్రోచ్‌ ‌పార్టీ పుట్టుకొచ్చిందని తెలిపారు. అణగారిన వర్గాల పక్ష‍ాన వారి సమస్యలు, జీతాల కోసం రోడ్లెక్కి పోరాడుతున్నది కమ్యూనిస్టులేనని గుర్తుచేశారు. ప్రజల్ని చైతన్య పర్చడంలో మతం, కులం, ప్రాంతం, ఇతర ప్రలోభాలు ప్రధాన ఆటంకంగా ఉన్నాయని తెలిపారు. ఆర్థిక, సామాజిక పోరాటాలకే పరిమితం కాకుండా పీడిత ప్రజల్ని రాజకీయ చైతన్యం చేయాల్సి బాధ్యత వామపక్ష‍ పార్టీలుగా తమపై బాధ్యత ఉందని చెప్పారు. దేశంలో కమ్యూనిస్టుల అవసరం పెరుగుతున్నదని చెప్పారు. ఇప్పుడు కాస్త వెనుకబడొచ్చుగానీ రాజకీయంగా తప్పకుండా బలం పుంజుకుని బలమైన శక్తిగా ఎదుగుతామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -