Sunday, June 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఫ్యూచర్ సిటీపై ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తీసుకోవాలి

ఫ్యూచర్ సిటీపై ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తీసుకోవాలి

- Advertisement -

రైతులకు సరైన నష్టపరిహారం అందించాలి
ఫ్యూచర్ సిటీలో వసతి నివాసాలు కల్పించాలి
ఫ్యూచర్ సిటీలో మొదట యువతకు అవకాశం ఇవ్వాలి
ఫ్యూచర్ సిటీపై రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు

నవతెలంగాణ-అంబర్‌పేట
రైతులకి సరైన నష్టపరిహారం అందించాలని, వారికి ఫ్యూచర్ సిటీలో వసతి నివాసాలు కల్పించాలని, ఫ్యూచర్ సిటీలో మొదట యువతకు అవకాశం ఇవ్వాలని, ఫ్యూచర్ సిటీపై రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు మేధావులు, వక్తలు అభిప్రాయాలు తెలియజేశారు. శనివారం హైదరాబాద్‌ లకిడికాపూల్‌లోని సెంట్రల్ కోర్ట్ హోటల్‌లో రాష్ట్రీయ లోక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో ఫ్యూచర్ సిటీ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రీయ లోక్ దళ్ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి త్రిలోక్ త్యాగి మాట్లాడుతూ, తమ పార్టీ విధానాలు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ సిద్ధాంతాలపై ఆధారపడి ఉన్నాయని, ఆయన చెప్పిన “గ్రామీణ వికాస్ – దేశ్ కా వికాస్” సిద్ధాంతాన్ని గుర్తు చేశారు. ఫ్యూచర్ సిటీ పేరుతో రైతులను, గ్రామాలను నాశనం చేయరాదని, భూములు కోల్పోయే రైతులకు తగిన నష్టపరిహారం, ఉపాధి అవకాశాలు, సరసమైన ప్రత్యామ్నాయ నివాసాలు కల్పించాలని కోరారు.ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ మనోహర్ మాట్లాడుతూ, హైదరాబాద్‌‌కు ఫ్యూచర్ సిటీ భావన స్వాగతించదగ్గదేనని, అయితే సమాజంలోని అన్ని వర్గాలకు, ముఖ్యంగా సేవారంగానికి ప్రాధాన్యం కల్పించాలని సూచించారు. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల కోల్‌‌కతా, చెన్నై వంటి మహానగరాలు నేడు క్షీణత దిశగా పయనిస్తున్నాయని పేర్కొన్నారు.

సీపీఐ (ఎంఎల్) కార్యదర్శి హన్మేష్ మాట్లాడుతూ, దేశంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కేవలం 15-20 శాతం ప్రజలకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తున్నాయని, మిగిలిన 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని అన్నారు. ఆధునిక కాలంలో ఈ వర్గాల ఆకాంక్షలు పెరిగాయని, ఫ్యూచర్ సిటీ రూపకల్పనలో వారి అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. మాజీ బీసీ కమిషన్ సభ్యుడు, బీజేపీ నాయకుడు తల్లోజు ఆచారి మాట్లాడుతూ, మహబూబ్‌‌నగర్ జిల్లాలోనే ఫార్మా సిటీ, ఏరో సిటీ, ఫ్యాబ్ సిటీ, స్పోర్ట్స్ హబ్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సిటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏఐ జోన్ వంటి పథకాల కోసం సుమారు 50 వేల ఎకరాల భూమిని సేకరించారని తెలిపారు. అయితే వాటిలో 10 శాతం కూడా అభివృద్ధి కాలేదని, అనేక మంది రైతులకు ఇంకా సరైన నష్టపరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీ కూడా కేవలం భూసేకరణకే పరిమితమయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సమగ్ర పరిష్కారం తీసుకురావాలని కోరారు. వ్యవసాయ ప్రొఫెసర్ డాక్టర్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, ఫ్యూచర్ సిటీ భావనను స్వాగతిస్తున్నామని, అయితే అది సమాజంలోని అన్ని వర్గాలకు స్వయం సమృద్ధిని కల్పించే విధంగా ఉండాలని సూచించారు. ఈ అంశంపై చర్చను ప్రారంభించిన రాష్ట్రీయ లోక్ దళ్‌‌ను అభినందించారు.

మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీ స్వయం సమృద్ధి, సమ్మిళిత అభివృద్ధికి ప్రతీకగా ఉండాలన్నారు. సేవారంగానికి తగిన అవకాశాలు, అందుబాటు గృహవసతి కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. శాన్ ఫ్రాన్సిస్కో, రోమ్ వంటి అంతర్జాతీయ నగరాలతో పాటు, భారతదేశంలోని ప్రణాళికాబద్ద నగరమైన చండీగఢ్‌‌ను ఆదర్శంగా తీసుకోవాలని ప్రతీ ఒక్కరి అభిప్రాయ భేదాలు తీసుకోవాలని, ప్రతీ ఒక్కరితోనే చర్చించాలని ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం దృష్టి సారించాలని, స్థానిక యువతకు పెద్దపీట వేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ మాట్లాడుతూ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మేధావులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రముఖ పౌరుల అభిప్రాయాలను సేకరించడం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. సమావేశంలో వచ్చిన సూచనలు, అభిప్రాయాలను సమగ్రంగా రూపొందించి ప్రభుత్వం సంబంధిత అధికారులకు త్వరలో అందజేస్తామని హామీ ఇచ్చారు.వీవీఎస్ బంధా కవి మాట్లాడుతూ, ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ రాష్ట్రంలో అత్యంత చర్చనీయాంశంగా మారిందని, ఈ నేపథ్యంలో ప్రముఖుల అభిప్రాయాలను సేకరించి, వాటి ఆధారంగా సమగ్ర కాన్సెప్ట్ పేపర్ రూపొందించి సంబంధిత అధికారులకు సమర్పించనున్నట్టు తెలిపారు.

లైబ్రరరీ కార్పొరేషన్ చైర్మెన్‌ డాక్టర్ మొహమ్మద్ రియాజ్ మాట్లాడుతూ, అనుకూల, ప్రతికూల అభిప్రాయాలను సమానంగా స్వాగతిస్తున్నామని చెప్పారు. ఫ్యూచర్ సిటీ ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని, హైదరాబాద్ నగరానికే విస్తరణ, అభివృద్ధికి అత్యధిక అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. స్వయం సమృద్ధి, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలతో ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ సమావేశంలో వచ్చిన విలువైన సూచనలనుముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ యువజన అధ్యక్షుడు రాజ్ కుమార్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి గౌర బీరప్ప సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు విశాల్ వంజారి, రిషబ్ జైన్, నరసింహారావు, కోశాధికారి గిరి కుందే, కార్యదర్శి ఓంకార్ గౌడ్, చారి,జాని,సతీష్ కట్టా, సోమగాని నరేందర్ గౌడ్ జూపల్లి రాములు బియ్యాల కృష్ణ, కోటేశ్వర్,విక్రమ్ శర్మ తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్కు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -