Wednesday, February 11, 2026
E-PAPER
Homeఆటలుబంగ్లా గౌరవం కోసమే!

బంగ్లా గౌరవం కోసమే!

- Advertisement -

– బాయ్‌కాట్‌ వివాదంపై పీసీబీ
– భారత్‌, పాక్‌ మ్యాచ్‌కు లైన్‌ క్లియర్‌
కరాచీ (పాకిస్తాన్‌)

పది రోజుల ప్రతిష్టంభనకు తెరపడింది. భారత్‌, పాక్‌ మ్యాచ్‌ రద్దుగా ముగిస్తే జరిగే ఆర్థిక నష్టంపై ఇటు ఐసీసీ, అటు ప్రసారదారు తీవ్ర ఆందోళనకు గురవగా.. ఎట్టకేలకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) దిగొచ్చింది. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) డైరెక్టర్‌ ఇమ్రాన్‌ ఖవాజ, బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) చీఫ్‌ అమీనుల్‌ ఇస్లామ్‌లు ఆదివారం నుంచి పీసీబీతో జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో భారత్‌తో మ్యాచ్‌ బారుకాట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ మోషిన్‌ నక్వీ సోమవారం అర్థరాత్రి అనంతరం ప్రకటించారు. బారుకాట్‌ వివాదం, దారితీసిన పరిస్థితులపై మోషిన్‌ నక్వీ, ఇతర పీసీబీ ప్రతినిధులు మంగళవారం మీడియాకు వెల్లడించారు.

ఎటువంటి షరతులు లేవు
‘మా చర్చల్లో బంగ్లాదేశ్‌ ప్రయోజనాలు మినహా ఎటువంటి షరతులు విధించలేదు’ అని మంగళవారం పెషావర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నక్వీ తెలిపారు. మా ఏకైక లక్ష్యం బంగ్లాదేశ్‌ గౌరవం నిలుపటం. జరిగిన అన్యాయాన్ని సరిదిద్దటమే. ఐసీసీతో చర్చల్లో బంగ్లాదేశ్‌కు అన్యాయం జరిగిన వాస్తవాన్ని అంగీకరించారు. బంగ్లాదేశ్‌పై ఎటువంటి ఆర్థిక ఆంక్షలు విధించకుండా ఉండటంతో పాటు 2028-2031 ఐసీసీ సైకిల్‌లో ఓ టోర్నమెంట్‌ను బంగ్లాదేశ్‌కు కేటాయించేందుకు అంగీకరించారు. ఇందులో పాకిస్తాన్‌ స్వీయ ప్రయోజనాలకు తావులేదు. విమర్శకులు ఏమైనా అనొచ్చు, పాకిస్తాన్‌ ఆశించిన లక్ష్యం నెరవేరింది. బంగ్లాదేశ్‌ డిమాండ్లను ఐసీసీ అంగీకరించింది. దీంతో భారత్‌తో మ్యాచ్‌ ఆడేందుకు అంగీకారం తెలిపామని నక్వీ పేర్కొన్నారు. పాకిస్తాన్‌ ప్రయత్నం ఓ తప్పును సరిదిద్దటమే, అందుకు భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేస్తామని హెచ్చరించామని అన్నారు.

ఉత్కంఠకు తెర
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ నుంచి తొలగించబడిన బంగ్లాదేశ్‌కు బాసటగా.. భారత్‌తో గ్రూప్‌ దశ మ్యాచ్‌ను బారుకాట్‌ చేస్తున్నామని ఈ నెల 1న పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. పాక్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఐసీసీలో ప్రకంపనలు సృష్టించగా.. శ్రీలంక, యుఏఈ, బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డులతో పాటు ఆ దేశ ప్రభుత్వాధినేతలు సైతం రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. దౌత్యపరంగా నష్ట నివారణ చర్యలు చేపట్టిన ఐసీసీ ఆ దిశగా విజయవంతమైంది. భారత్‌, పాకిస్తాన్‌ గ్రూప్‌-ఏలో ఉండగా.. ఈ ఆదివారం కొలంబోలో దాయాదుల సమరం జరుగనుంది. భారత్‌, పాక్‌ ప్రజలతో పాటు ప్రపంచ క్రికెట్‌ అభిమానులు ఈ మ్యాచ్‌ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దీంతో సహజంగానే టెలివిజన్‌ మార్కెట్‌ సైతం ఆ స్థాయిలోనే జరుగుతుంది. భారత్‌, పాకిస్తాన్‌ గ్రూప్‌ దశ మ్యాచ్‌తో ఐసీసీ (భాగస్వాములు) రూ.2200 కోట్ల ఆదాయం ఆర్జించనుంది.

బారుకాట్‌ వివాదంపై ఐసీసీ డైరెక్టర్లతో చర్చల్లో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు పలు డిమాండ్లు లేవనెత్తినట్టు వార్తలొచ్చినా.. ఇరు వర్గాలను ఆ వార్తలను ఖండించాయి. ఐసీసీ ఆదాయ పంపిణీ పద్దతిలో పాకిస్తాన్‌ ప్రస్తుతం రూ.310 కోట్లు ఆర్జిస్తుండగా.. ఆ మొత్తాన్ని భారీగా పెంచాలని పీసీబీ డిమాండ్‌ చేసినట్టు కథనాలు వెలువడ్డాయి. భారత్‌, పాకిస్తాన్‌ ద్వైపాక్షిక క్రికెట్‌ సంబంధాల పునరుద్ధరణ, ఇరు దేశాల మ్యాచ్‌లో క్రికెటర్ల కరచాలనం వంటి అంశాలు సైతం ఐసీసీతో చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్టు వార్తలు వచ్చాయి. కానీ, పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ఆ వార్తలను తీవ్రంగా ఖండించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -