జూనియర్ అసిస్టెంట్, సూపర్‌వైజర్ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి :
టీజీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్-సీఐటీయూ) రాష్ట్ర సదస్సు డిమాండ్
నవతెలంగాణ-ముషీరాబాద్
ఆర్టీసీ విలీన ప్రక్రియకు ముందే క్లర్కులు, సూపర్‌వైజర్ల సమస్యలను పరిష్కరించాలని టీజీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్-సీఐటీయూ) రాష్ట్ర సదస్సు డిమాండ్ చేసింది. ఆదివారం హైదరాబాద్‌లోని కార్యాలయంలో ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీలో పనిచేస్తున్న క్లర్కులు, సూపర్‌వైజర్ల రాష్ట్ర సదస్సును కె.ఎస్. రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు మాట్లాడుతూ.. ఆర్టీసీలో గత కొన్నేండ్లుగా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల స్థానంలో కొత్త నియామకాలు చేపట్టకపోవడంతో క్లర్కులు, సూపర్‌వైజర్లపై విపరీతమైన పనిభారం పెరిగిందన్నారు. ఖాళీ పోస్టులను వెంటనే ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసి ఉద్యోగులపై ఒత్తిడిని తగ్గించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 97 డిపోలు, యూనిట్లలో కేవలం 20 మంది జూనియర్ అసిస్టెంట్లు (పర్సనల్), 42 మంది ఫైనాన్స్ క్లర్కులు మాత్రమే పనిచేస్తుండటంతో క్లర్కులపై తీవ్ర పనిభారం పడుతోందని తెలిపారు. క్లర్కులు, సూపర్‌వైజర్లు యాజమాన్యానికి, కార్మికులకు మధ్య కీలక అనుసంధాన కర్తలుగా వ్యవహరిస్తున్నప్పటికీ తగిన సిబ్బంది లేకపోవడంతో రాత్రి వేళల వరకు విధులు నిర్వహించాల్సి వస్తోందని చెప్పారు. హెడ్ ఆఫీస్‌తో పాటు డిపోల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నదన్నారు. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్, సూపరింటెండెంట్, అసిస్టెంట్ మేనేజర్ తదితర ప్రమోషన్ పోస్టులను ఖాళీగా ఉంచడం వల్ల పరిపాలనా వ్యవస్థ బలహీనపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
అర్హులైన ఉద్యోగులకు వెంటనే ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అకౌంట్స్ విభాగంలో అమలు చేస్తున్న సెంట్రలైజేషన్ విధానం కారణంగా డిపోల్లో క్లరికల్ సిబ్బంది సంఖ్య మరింత తగ్గిపోయిందని, ఈ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని కోరారు. ట్రాఫిక్ సూపర్‌వైజర్ల పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని, ఖాళీ పోస్టుల కారణంగా వారు తీవ్ర ఒత్తిడిలో పనిచేస్తున్నారని, ట్రాఫిక్ విభాగంలోని అన్ని ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. సదస్సులో నివేదికను ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పి. రవీందర్ రెడ్డి ప్రవేశపెట్టారు. అనంతరం సమస్యలపై పలు తీర్మానాలు చేసి ఆమోదించారు. వాటిలో.. డిపో యూనిట్లలోని జూనియర్ అసిస్టెంట్ ఖాళీలను టెస్ట్ పాస్ అయిన వారితో భర్తీ చేయడం, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌లు, ఓడీల స్థానంలో రెగ్యులర్ క్లర్కులను నియమించాలని తీర్మానించారు. ఖాళీగా ఉన్న ఆయా పోస్టులను ప్రమోషన్లతో భర్తీ చేయాలని, గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టుల సంఖ్య పెంచడం, సీనియర్ అసిస్టెంట్లకు తక్షణ ప్రమోషన్లు కల్పించాలని కోరారు. ప్రతి డిపోలో ఉన్న డీసీలకు అసిస్టెంట్లను నియమించడం, ఏడీసీ, కంట్రోలర్లకు డీసీ/టీటీఐ ప్రమోషన్లు ఇవ్వడం, సూపర్‌వైజర్ల గ్రేడ్ పేను 2021 నూతన వేతన సవరణలో కొనసాగించడం, ప్రమోషన్ల సమయంలో గతంలో మాదిరిగా 50 ఏండ్లు దాటిన వారికి సడలింపులు కల్పించడం, అన్ని జోన్లలో ఒకే తేదీన ప్రమోషన్లు ఇచ్చేలా ప్రమోషన్ క్యాలెండర్ రూపొందించి అమలు చేయాలని అన్నారు. , అకౌంట్స్ సెంట్రలైజేషన్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఈ సదస్సులో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి నాయకులు పాల్గొన్నారు.
విలీనానికి ముందే సమస్యలు పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



