విరుచుకు పడిన టెహ్రాన్
కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉండగా దుశ్చర్య
ట్రంప్ సూచనలు నెతన్యాహూ బేఖాతరు
టెహ్రాన్ : ఏప్రిల్‌లో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఇజ్రాయిల్, ఇరాన్ సేనలు తొలిసారిగా పరస్పరం దాడులకు దిగాయి. ఇజ్రాయిల్ ఉత్తర ప్రాంతంపై ఇరాన్ క్షిపణులు ప్రయోగించగా అందుకు ప్రతిగా ఇరాన్‌లోని పశ్చిమ, మధ్య ప్రాంతాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు జరిపింది. ఇరాన్ రక్షణ వ్యవస్థలపై తమ ఫైటర్ జెట్లు దాడులను పూర్తి చేశాయని ఇజ్రాయిల్ తెలిపింది. మరోవైపు నిరంతర దాడులకు ఇది ప్రారంభం మాత్రమేనని ఇరాన్ చెప్పింది. లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఆదివారం ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేయడంతో దానికి ప్రతిగా దాడులు మొదలు పెట్టానని తెలియజేసింది. ఉత్తర ఇజ్రాయిల్‌లోని హఫియాలో ఉన్న ఓ పెట్రో కెమికల్ ప్లాంటుపై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) క్షిపణి దాడి జరిపింది. కాగా ఇజ్రాయిల్‌తో దీర్ఘకాల పోరుకు ఇరాన్ సన్నద్ధమవుతోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
యెమన్‌లోని హౌతీలు కూడా ఇజ్రాయిల్ వైపు ఓ క్షిపణిని ప్రయోగించారు. తమ దేశంపై హిజ్బుల్లా రాకెట్లు ప్రయోగించినందునే బీరుట్ నగరానికి దక్షిణంగా ఉన్న శివారు ప్రాంతాలలోని దాని స్థావరాలపై దాడి చేశానని ఇజ్రాయిల్ చెబుతోంది. ఇరాన్‌పై దాడులు జరపవద్దంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సూచనలను ఇజ్రాయిల్ బేఖాతరు చేసి టెహ్రాన్‌పై తాజాగా పోరుకు సిద్ధమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం రాత్రి ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు ఫోన్ చేసి ఇరాన్‌పై దాడులు జరపవద్దని సూచించారు. అయితే ఆయన సూచనలను ఏ మాత్రం పట్టించుకోని ఇజ్రాయిల్ దాడులకు తెగబడింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో అనేక పేలుడు శబ్దాలు వినిపించాయి. వీటికి ఇజ్రాయిల్ తాజా దాడులే కారణమా అనేది తెలియలేదు.
ఇజ్రాయిల్ సైనిక వాహనాలపై రాకెట్ దాడులు : హిజ్బుల్లా
లెబనాన్‌లో ఇజ్రాయిల్ సైనిక వాహనాలపై సోమవారం ఉదయం రాకెట్ దాడులు జరిపానని హిజ్బుల్లా తెలిపింది. బెయిట్ యాహాన్ శివారులో మకాం వేసిన ఇజ్రాయిల్ సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపామని చెప్పింది. కాల్పుల విరమణను ఇజ్రాయిల్ ఉల్లంఘించినందుకు, దక్షిణ లెబనాన్ గ్రామాలపై దాడులు చేస్తున్నందుకు ప్రతిగా ఈ చర్యకు పూనుకున్నామని వివరించింది. హిజ్బుల్లా దాడిలో జరిగిన నష్టం, సిబ్బందికి అయిన గాయాలకు సంబంధించి ఇజ్రాయిల్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
కాల్పుల విరమణ పాటించండి : ట్రంప్, బ్లెయిర్
ఇజ్రాయిల్, ఇరాన్‌లు వెంటనే కాల్పుల విరమణ పాటించాలని ట్రంప్ కోరారు. తుది దశకు చేరిన శాంతి చర్చలకు అజ్ఞానం, మూర్ఖత్వం అడ్డుపడే అవకాశం ఉన్నదని అన్నారు. తుది ఒప్పందం కుదిరే వరకూ ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాగా ఇరాన్, ఇజ్రాయిల్ దేశాలు కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలని బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్ సూచించారు. మధ్యప్రాచ్యంలో తిరిగి హింస చెలరేగడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ శాశ్వత శాంతి దిశగా అర్థవంతమైన చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఘర్షణల ప్రభావం బ్రిటన్ సహా ప్రపంచ దేశాలన్నింటి పైన ఉన్నదని చెప్పారు.
ఇరాన్ పై ఇజ్రాయిల్ దాడులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



