అంతర్జాతీయ విద్యా అవగాహన గ్రాంట్
ఉస్మానియా విశ్వవిద్యాలయం
మరో కీలక ముందడుగు
పరిశోధనలో నాణ్యత, ఆవిష్కరణలు, అంతర్జాతీయ విద్యకు ప్రోత్సాహం
విదేశాలకు వెళ్లే పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులకు రూ.3 లక్షల ప్రోత్సాహం
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యాభివృద్ధిలో భాగంగా మరో కీలక అడుగు వేసింది. పరిశోధనలో నాణ్యత, ఆవిష్కరణలు తీసుకురావడం.. అంతర్జాతీయ విద్యా సహకారాన్ని ప్రోత్సహించే దిశగా సాగుతోంది. పీజీ, పీహెచ్‌డీ విద్యార్థుల్లో అంతర్జాతీయ స్థాయి పరిశోధనా అవగాహన, నైపుణ్యాలను పెంపొందించేందుకు “అంతర్జాతీయ విద్యా అవగాహన గ్రాంట్” పథకాన్ని ప్రారంభించింది. ఇటీవల ఓయూ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కుమార్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గడ్డం నరేశ్‌రెడ్డి, యూజీసీ డీన్ ప్రొఫెసర్ బి. లావణ్య ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఈ పథకం ద్వారా విదేశీ విశ్వవిద్యాలయాల్లో నిర్వహించే స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలు, సెమినార్లు, సదస్సులు, వర్క్‌షాప్‌లు, ఇతర విద్యా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పీజీ విద్యార్థులు, పీహెచ్‌డీ పరిశోధకులకు అవకాశం కల్పించనున్నారు. ఎంపికైన ఒక్కో విద్యార్థికి ప్రయాణం, వసతి, రిజిస్ట్రేషన్ తదితర విద్యా సంబంధిత ఖర్చుల కోసం రూ.3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు.
రూ.5 కోట్ల కార్పస్ నిధి
రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో తొలిసారిగా విద్యార్థులు, అధ్యాపకుల కోసం పరిశోధనా గ్రాంట్లు అందిస్తున్నామని ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ తెలిపారు. ఈ పథకానికి ప్రత్యేక ఆకర్షణగా రూ.5 కోట్ల కార్పస్ నిధి నిలుస్తోంది. పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి, హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఎం.దానకిషోర్ ఈ నిధిని మంజూరు చేయగా.. ఆయనకు ఓయూ కృతజ్ఞతలు తెలిపి ఈ కార్పస్‌పై వచ్చే వడ్డీని అర్హులైన విద్యార్థులు, పరిశోధకులకు అంతర్జాతీయ విద్యా, పరిశోధనా అవకాశాల కోసం ఆర్థిక సహాయం అందించనున్నారు.
టాప్-500 విశ్వవిద్యాలయాలకే అవకాశం
ఈ పథకం ద్వారా అంతర్జాతీయ స్థాయి పరిశోధనా అవగాహన, నైపుణ్యాభివృద్ధి, విద్యా సహకారం పెంపొందుతాయని వర్సిటీ అధికారులు ధీమా వ్యక్తం చేశారు. క్యూఎస్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-500లో ఉన్న విశ్వవిద్యాలయాలకే పీహెచ్‌డీ, పీజీ విద్యార్థులు వెళ్లే అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. ఈ పథకం పూర్తి వివరాలు అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానం, విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని చెప్పారు.
పీహెచ్‌డీ విద్యార్థులకు అర్హతలు
పీహెచ్‌డీ రిజిస్టర్ అయి ఉండాలి. ఒక సంవత్సరం విద్యను పూర్తి చేసి ఉండాలి. సూపర్‌వైజర్ డిపార్ట్‌మెంట్ హెడ్ ల రికమండేషన్ చేయాల్సి ఉంది. విద్యార్థి వెళుతున్న విదేశీ యూనివర్సిటీ నుంచి ఇన్విటేషన్ లెటర్ కలిగి ఉండాలి.. వారు వెళ్లే యూనివర్సిటీ క్యూఎస్ వరల్డ్ టాప్ 500 లోపు ర్యాంకింగ్ లో ఉండాలి.
పీజీ విద్యార్థులకు అర్హతలు
మొదటి సెమిస్టర్ పాస్ అయి ఉండాలి.. విద్యార్థి తప్పనిసరిగా సీజీపీఏలో 6.5 కలిగి ఉండాలి. డిపార్ట్‌మెంట్ హెడ్ , ప్రిన్సిపాల్ రికమండేషన్ చేయాలి, విదేశీ యూనివర్సిటీ ఇన్విటేషన్ కార్డు కలిగి ఉండాలి. ఓయూలో12 ఫ్యాకల్టీస్, 57 విభాగాల్లో విద్యను అభ్యసిస్తున్న పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు ఈ అవకాశం కలిగి ఉన్నారని అధికారులు చెప్పారు. సదరు విద్యార్థులు విదేశాల్లో సెమినార్ , వర్క్ షాప్ లు, స్వల్ప కాలిక శిక్షణ కార్యక్రమాలకు వెళ్లే ముందు ఓయూకు దరఖాస్తు చేసుకుంటే వర్సిటీ పరిశీలించి నిబంధనల మేరకు అన్ని అర్హతలు కలిగి ఉన్న వారికి ఈ ఆర్థిక చేయూతను ఇస్తారు. దీనిపై పలువురు ఓయూ పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విదేశీ విద్యా కలలకు ఓయూ చేయూత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



