చేపల కొనుగోలుకు బారులు తీరిన జనం
మార్కెట్లు, చెరువుల వద్ద సందడి
నవతెలంగాణ – ఆత్మకూరు/చిన్నగూడూరు(కురవి)
మృగశిర కార్తె ప్రారంభం కావడంతో చేపల కొనుగోళ్లకు జనం బారులు తీరారు. చేపల మార్కెట్లు, చెరువుల వద్ద కిటకిటలాడాయి. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం, మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో సందడి నెలకొంది. మృగశిర కార్తెను పురస్కరించుకుని శివారులోని చెరువులో జనం రాకతో కిక్కిరిసిపోయింది. చెరువులోకి వందలాది మంది స్థానికులు, పరిసర గ్రామాల ప్రజలు దిగి చేపల వేట సాగించారు. మృగశిర కార్తె రోజున చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదనే నమ్మకం ఉండటంతో చేపలు పట్టేందుకు ప్రజలు పోటీ పడ్డారు. ఉదయం నుంచే కురవి పెద్దచెరువు వద్దకు భారీగా జనం చేరుకున్నారు. వలలు, గంపలు, చేతులతో చేపలను పట్టుకుంటూ సందడి చేశారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని కటాక్షపూర్ చెరువు వద్దకు చుట్టుపక్కల గ్రామస్తులతోపాటు వరంగల్ నుంచి పెద్దఎత్తున జనం చేపల కొనుగోలుకు వచ్చారు. చేపలు కిలో రూ.200, బొమ్మె చేపలు కిలో రూ.400గా విక్రయాలు జరిగాయి. పలు మార్కెట్లు, చెరువుల వద్ద వినియోగదారుల రద్దీ పెరిగింది. రోహిణి కార్తె ముగిసి, మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించడంతో తెలుగు నేలపై మృగశిర కార్తె సందడి మొదలైంది. వాతావరణంలో మార్పులు సంభవించి, తొలకరి జల్లులు కురుస్తున్నాయి.. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని రైతాంగం వ్యవసాయ పనులకు సిద్ధమవుతోంది. రైతులు తమ పొలాలను దున్నుకోవడం, ఎరువులు చల్లడం వంటి పనుల్లో నిమగమయ్యారు. అన్ని జిల్లాల్లోనూ చేపల మార్కెట్లు, చెరువుల వద్ద ఉదయం నుంచే జనం రద్దీ నెలకొంది.ఆదిలాబాద్‌లోనూ మార్కెట్లు కిటకిటలాడాయి. వివిధ రకాల చేపలను బట్టి ధర ఉంది. కిలో రూ.250 నుంచి రూ.400 వరకు పలికాయి. మృగశిర కార్తె సందర్భంగా ఎక్కువగా బేరాలు జరిగాయని గంగపుత్ర సంఘం నాయకులు తెలిపారు.
మృగశిర ఎఫెక్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



