Tuesday, June 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమార్కెట్‌ హామీ లేకుండా పంటల మార్పిడి అసాధ్యం

మార్కెట్‌ హామీ లేకుండా పంటల మార్పిడి అసాధ్యం

- Advertisement -

ఎరువుల ధరల పెంపు 
రైతులకు భారం
నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోవాలి : ఆలిండియా కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) సీనియర్‌ నాయకులు 
సారంపల్లి మల్లారెడ్డి


నవతెలంగాణ- జనగామ

ప్రభుత్వం రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్సహిస్తున్నప్పటికీ, మార్కెట్‌ హామీ లేకుండా పంటల మార్పిడి సాధ్యం కాదని ఆలిండియా కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. ప్రత్యామ్నాయ పంటలకు మార్కెటింగ్‌ సదుపాయాలు, కనీస మద్దతు ధర లేకపోతే రైతులు సాగుకు ముందుకు రావడం కష్టమని చెప్పారు. జనగామ జిల్లా కేంద్రంలోని జేకేఎస్‌ అగ్రిమాల్స్‌ను సోమవారం తెలంగాణ రైతు సంఘం జనగామ జిల్లా నాయకులు సందర్శించారు. ఎరువులు, విత్తనాల లభ్యతపై యాజమాన్యంతో చర్చించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ ప్రణాళిక లోపించడం వల్ల రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. ఖరీఫ్‌ సాగు పనులు ప్రారంభమైనా రైతులకు అవసరమైన పంట రుణాలు పూర్తిస్థాయిలో అందడం లేదన్నారు. రైతు భరోసా నిధులను వెంటనే ఖాతాల్లో జమ చేయాలని కోరారు. మరోవైపు నకిలీ, కల్తీ విత్తనాల విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం, వ్యవసాయ శాఖలు సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో సుమారు 10 వేల క్వింటాళ్ల నాణ్యతలేని పత్తి విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నప్పటికీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. సంబం ధిత వ్యాపారులపై పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేయడంతోపాటు నాణ్యతలేని విత్తన విక్రయం చేస్తున్న వారి లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పదేండ్లుగా నకిలీ విత్తనాల వ్యవహారంలో విజిలెన్స్‌ అధికారుల పాత్రపై కూడా ఉన్నతస్థాయి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రానికి సుమారు 27 లక్షల టన్నుల ఎరువుల అవసరం ఉండగా ప్రస్తుతం యూరియా, డీఏపీ, పొటాష్‌ తదితర ఎరువుల కొరత నెలకొందని తెలిపారు. ఈ పరిస్థితి కొనసాగితే దిగుబడులు తగ్గి రైతులు భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. నకిలీ విత్తనాలు, ఎరువుల కొరత, ధరల పెరుగుదల, రైతుల నష్టాలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుల సాగు వివరాలను పూర్తిస్థాయిలో క్రాప్‌ బుకింగ్‌ చేసి, పంటల విక్రయాలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి మూడ్‌ శోభన్‌, జిల్లా కార్యదర్శి భూక్యా చందు నాయక్‌, జేకేఎస్‌ అగ్రిమాల్స్‌ యజమానులు పజ్జూరి గోపయ్య, ఐలయ్య, కిషోర్‌, పట్టణ కార్యదర్శి మంగ బీరయ్య, బాల్దే అంజయ్య, వెంకన్న, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -