Saturday, June 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలేరులో ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ ప్రత్యేక గ్రామసభలు

ఆలేరులో ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ ప్రత్యేక గ్రామసభలు

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా ఆలేరు మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు.గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్యం,వ్యవసాయం,ఆరోగ్యం,విద్య, తాగునీరు,ఉపాధి,శాంతిభద్రతలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అధికారులు గ్రామస్థులతో ప్రత్యక్షంగా మమేకమయ్యారు.

జిల్లా కలెక్టర్,పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు జూన్ 4, 6, 8, 10 తేదీల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నేడు గుండ్లగూడెం, రాఘవాపురం, బైరాంనగర్, కొలనూపాక గ్రామాల్లో మండల స్థాయి అధికారుల బృందం పర్యటించి సమావేశాలు నిర్వహించింది. గ్రామ ప్రజల సమస్యలు,అవసరాలు,అభివృద్ధి సూచనలను అధికారులు స్వయంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

గ్రామసభల్లో వివిధ శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన అంశాలను ప్రజలకు వివరించారు. ఘనద్రవ్య వ్యర్థాల నిర్వహణ-2026 నిబంధనలను ఎంపీడీవో వివరించి గ్రామాల్లో చెత్త నిర్వహణను శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టాలని సూచించారు.మండల పంచాయతీ అధికారి గ్రామ పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, మురుగు కాలువల శుభ్రత, ఆయిల్ బాల్స్ తయారీ,శిథిలావస్థలో ఉన్న భవనాల గుర్తింపు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

తహశీల్దార్ రాబోయే జనగణన–2027, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ప్రాధాన్యతను వివరించారు. వ్యవసాయ శాఖ అధికారులు పంటల మార్పిడి, పంటల వికేంద్రీకరణ, ఆధునిక సాగు పద్ధతులు, సేంద్రియ వ్యవసాయం ప్రయోజనాలపై రైతులకు సూచనలు చేశారు. గ్రామాల్లో నీటి వృథాను అరికట్టి పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలను గ్రామీణ నీటి సరఫరా శాఖ ఇంజనీర్ వివరించారు.

ఉపాధి హామీ పథకం కింద ‘జల సంరక్షణ – మన సంరక్షణ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, వర్షపు నీటి నిల్వ కట్టడాలు, ఇంకుడు గుంతల నిర్మాణం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించాలని ఏపీఓ సూచించారు.వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులు, డెంగీ, మలేరియా వంటి వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యాధికారి ప్రజలకు వివరించారు.

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన, రోడ్డు భద్రత, గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, ‘బడిబాట’ కార్యక్రమం ద్వారా విద్యార్థుల నమోదు పెంపు, అల్పాహార పథకం అమలు వంటి అంశాలను వివరించారు.

అదేవిధంగా గృహాలపై సోలార్ విద్యుత్ ఏర్పాటు, విద్యుత్ పొదుపు,ఇందిరమ్మ ఇళ్ల మొదటి విడత గృహప్రవేశాలు, రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై సంబంధిత అధికారులు ప్రజలకు సమగ్ర సమాచారం అందించారు.

గ్రామసభల్లో ప్రజలు తమ గ్రామాలకు సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమాల్లో సర్పంచులు,ఉపసర్పంచులు,పంచాయతీ కార్యదర్శులు,మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు,మహిళా సంఘాల సభ్యులు, రైతులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -