పారిశ్రామిక సంఘాల నిర్ణయం .. ఒత్తిడి తెస్తున్న ప్రభుత్వం
విధివిధానాలు మార్చాలంటున్న పారిశ్రామికవేత్తలు
ఏపీలో ఇదే తరహా విధానంపై స్టే విధించిన హైకోర్టు
ఎస్ఎస్ఆర్ శాస్ర్తి
రాష్ర్ట ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరా బాద్ ఇండస్ట్రీయల్ ల్యాండ్స్ ట్రాన్స్ ఫార్మేషన్ పాలసీ (హిల్ట్)పై న్యాయ స్థానాన్ని ఆశ్రయించాలని పారిశ్రామిక సంఘాలు భావిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఉన్నప్పుడు అక్కడ కూడా ఇలాంటి పాలసీనే తీసుకొచ్చారు. అయితే దానికీ, తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం తెచ్చిన పాలసీకి కొన్ని మార్పులు ఉన్నాయి. ఏపీలో అక్కడి ప్రభుత్వం తెచ్చిన పాలసీపై పారిశ్రామికవేత్తలు హైకోర్టును ఆశ్రయించడం తో ‘స్టే’ విధించింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ‘హిల్ట్’ పాలసీలో కూడా అనేక అభ్యంతరకర విధివిధానాలు ఉన్నాయని పారిశ్రామిక సంఘాలు చెప్తు న్నాయి. ముఖ్యంగా ఈ విధానం అమలు చేస్తే పారిశ్రామికవర్గాల్లో చీలికలు వచ్చే ప్రమాదం ఉన్నదని భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే పరిశ్రమలశాఖ ఉన్నతాధికారులు, పారి శ్రామికవాడల్లోని యజమానులతో చర్చలు జరిపారు. ప్రధాన రహదారులపై ఉన్న పరిశ్రమల యజమానులు ఈ పాలసీకి అనుకూలంగా ఉన్నట్టు తెలిసింది. కానీ ఆదే పారిశ్రామికవాడలో రోడ్డుకు దూరంగా భూములు ఉన్న యజమానులకు ఈ విధానం గుదిబండగా మారింది. దీనితో ‘హిల్ట్’ అమలును సమర్థిస్తూ కొందరు, వ్యతిరేకిస్తూ మరికొందరు వాగ్వివాదాలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ పాలసీ నిలుపుదల కోరుతూ హైకోర్టును ఆశ్రయించాలని పారిశ్రామిక సంఘాలు భావిస్తున్నాయి. దీనిపై నిర్ణయం తీసుకోవడం కోసం ఈ వారంలో పారిశ్రామిక సంఘాలన్నీ సమావేశం కావాలని నిర్ణయించాయి.
ఇదీ నేపథ్యం
దాదాపు 40-60 ఏండ్ల క్రితం అప్పటి ఉమ్మడి రాష్ర్టంలో పారిశ్రామిక ప్రగతి కోసం హైదరాబాద్ శివార్లలో 21 పారిశ్రామికవాడల్ని నెలకొల్పారు. ఆయా పారిశ్రామిక వేత్తలకు అప్పటి మార్కెట్ రేట్ల ప్రకారం ప్రభుత్వం ‘సేల్ డీడ్’లు చేసి ఇచ్చింది. క్రమేణా పారిశ్రామికవాడల చుట్టూ నివాసాలు ఏర్పడి, పరిశ్రమలు ఊరి మధ్యలోకి వచ్చాయి. దీనితో కాలుష్యం పేరుతో ఆ పరిశ్రమల్ని తరలించాలనే ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ‘రెడ్, ఆరెంజ్’ జోన్లలోని పరిశ్రమల్ని వేరే ప్రాంతాలకు తరలించారు. కొన్ని పరిశ్రమలు మూత పడ్డాయి. అయితే అవన్నీ ఇండస్ర్టియల్ కారిడార్ జోన్‌లో ఉన్నాయి. వాటిని మల్టీపర్పస్ జోన్‌లోకి మార్చేందుకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ‘హిల్ట్’ పాలసీని తెచ్చింది. దానిలో భాగంగా 2025 నవంబర్ 22న జీవో నెంబర్ 27 జారీ చేశారు. దానికి కొనసాగింపుగా 2026 మే 22న జీవో నెంబర్ 18 జారీ చేశారు. దీనికే ‘హిల్ట్’ అని పేరుపెట్టారు.
ఇవీ ఆ పారిశ్రామికవాడలు
ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్)కు లోపల ఉన్న 21 పారిశ్రామికవాడల్ని ఓఆర్‌ఆర్ వెలుపలికి తరలించాలనేది ప్రభుత్వ ప్రతిపాదన. అయితే వీటిలో అనేక పరిశ్రమలు మూతపడిఉన్నాయి. మరికొన్ని గోడౌన్లుగా మారాయి. కాలుష్య తీవ్రత తక్కువగా ఉన్న పరిశ్రమలే ఇక్కడ నడుస్తున్నాయి. జోన్ మార్పిడి చేయాలని ప్రభుత్వం భావిస్తున్న పారిశ్రామికవాడలు, వాటి అంచనా విస్తీర్ణం వివరాలు ఇలా…1. నాచారం (700 ఎకరాలు) 2. మల్లాపూర్ (650 ఎకరాలు) 3. చెర్లపల్లి (1000 ఎకరాలు) 4. మౌలాలి (300 ఎకరాలు) 5. ఉప్పల్ (350 ఎకరాలు) 6. సనత్‌నగర్ (500 ఎకరాలు) 7. మేడ్చల్ (1,500 ఎకరాలు) 8. కుషాయిగూడ (400 ఎకరాలు) 9. పటాన్‌చెరు (2,500 ఎకరాలు) 10. హయత్‌నగర్ (500 ఎకరాలు)11.కూకట్‌పల్లి (450 ఎకరాలు) 12. జీడిమెట్ల (1,050 ఎకరాలు) 13. బాలానగర్ (1,200 ఎకరాలు) 14. గాంధీనగర్ (200 ఎకరాలు) 15. పాశమైలారం (1,200 ఎకరాలు) 16. రామచంద్రాపురం-బీహెచ్‌ఈఎల్ బెల్ట్ (600 ఎకరాలు)17. చాందూలాల్ బారాదరి (150 ఎకరాలు) 18. కాటేదాన్ (1,100 ఎకరాలు) 19. బొల్లారం (800 ఎకరాలు) 20. అన్రిచ్/ఐడీఏ ప్రాంతాలు (300 ఎకరాలు) 21. ఇతర స్వతంత్ర పారిశ్రామికవాడలు (2000 ఎకరాలు).మొత్తం ‘హిల్ట్’ పరిధిలోకి 9,292 ఎకరాల భూమి వస్తుండగా, దానిలో అభివృద్ధి చెందిన ప్లాటెడ్ భూమి 4,740 ఎకరాలు మాత్రమేనని ప్రభుత్వం చెప్తుంది.
పనిచేస్తున్న పరిశ్రమలు
ప్రస్తుతం పై పారిశ్రామికవాడల్లో అనేక పరిశ్రమలు పనిచేస్తున్నాయి. ఫార్మా యూనిట్లు, ఇంజినీరింగ్ పరిశ్రమ లు, ప్లాస్టిక్, కెమికల్ యూనిట్లు, ఫ్యాబ్రికేషన్ యూనిట్లు, గిడ్డంగులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం ఓఆర్‌ఆర్ లోపల ప్రస్తుతం దాదాపు 2,800 పరిశ్రమలు ఉన్నాయి. వాటిలో దాదాపు 1,700 కాలుష్యకారక (రెడ్ యూనిట్ కేటగిరి) యూనిట్లు ఉన్నాయని అంచనా వేసింది. వీటిని దశల వారీగా ఓఆర్‌ఆర్ బయటకు తరలించాలనేది ప్రణాళిక.
స్వచ్ఛందంగానే…
రాష్ర్ట ప్రభుత్వం తెచ్చిన హిల్ట్ పాలసీలో పై 21 పారిశ్రామిక ప్రాంతాల్లో ‘విల్లింగ్ యూనిట్లు’ మాత్రమే స్వచ్ఛందంగా భూమి వినియోగ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇదే ఇప్పుడు పారిశ్రామిక వేత్తలకు చిక్కుగా మారింది. ‘విల్లింగ్ యూనిట్’ హిల్ట్ ద్వారా భూ వినియోగ మార్పిడిని మల్టీ పర్పస్ జోన్‌లోకి మారితే, ఆ పక్కనే ‘విల్లింగ్ లేని’ యూనిట్ల పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతుంది. ఓసారి మల్టీ పర్పస్ జోన్‌లోకి భూమి మారాక, అక్కడ నివాసయోగ్యం కోసం అపార్డుమెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు వస్తాయి. వాటి పక్కనే 24 గంటలు పరిశ్రమలు నడుస్తుంటే, కచ్చితంగా ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తాయనీ, తద్వారా తమపై ప్రభుత్వ శాఖల వేధింపులు పెరిగి, కంపెనీలను మూసేసుకోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. దానితో పాటు అవే పరిశ్రమ లపై ఆధారపడిన కార్మికులు, వారి కుటుంబాల సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఏడాదిలో ఎలా సాధ్యం?
‘హిల్ట్’ పాలసీ విధివిధానాల్లో భూ వినియోగ మార్పిడి పూర్తయిన ఏడాదిలోపు పరిశ్రమల్ని అక్కడి నుంచి తరలిం చాలి. లేనిపక్షంలో ప్రభుత్వం పెనాల్టీలు విధిస్తుంది. దీన్ని పారిశ్రామికవేత్తలు ఆక్షేపిస్తున్నారు. పరిశ్రమల తరలింపున కు కనీసం ఐదేండ్లు టైం ఇవ్వాలని కోరుతున్నారు.
ప్రత్యామ్నాయాలు ఏవి…
21 పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల్ని తరలించాలని ప్రభుత్వం చెప్తుంది. కానీ ఎక్కడా వారికి ప్రత్యామ్నాయ భూముల్ని చూపట్లేదు. అలాంటప్పుడు ‘తరలింపు’ ఎలా సాధ్యమని పారిశ్రామికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం వికారాబాద్‌లోని రాకంచెర్ల ఇండస్ట్రియల్ పార్క్, జహీరాబాద్ సమీపంలోని బుచినెల్లీ ఇండస్ట్రియల్ పార్క్, సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం, పరిమిత సంఖ్యలో ఫ్యూచర్ సిటీ ప్రాంతాలను ప్రత్యా మ్నాయంగా చూపింది. ఇక్కడ ఇప్పటికే ఉన్న పరిశ్రమ లకు అనుబంధంగా కొత్తగా యూనిట్లు పెట్టుకోవచ్చని సూచిస్తుంది. అయితే పారిశ్రామికవేత్తలు ఈ ప్రతిపాదన లను వ్యతిరేకిస్తున్నారు. రీజినల్ రింగ్‌రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) నుంచి ఓఆర్‌ఆర్ లోపల సెక్టార్ల వారీగా పారిశ్రామిక వాడలకు భూముల్ని కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడే కార్మికులకు అవసరమైన గృహ వసతి, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించాలని సూచిస్తున్నారు.
ఫీజు ఎక్కువే…
భూ వినియోగ మార్పిడి కోసం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు చాలా ఎక్కువగా ఉన్నదని పారిశ్రామికవేత్తలు చెప్తు న్నారు. భూములు తమ పేర్లపై ‘సేల్ డీడ్’తో ఉన్నప్పుడు, భూ వినియోగ మార్పిడి పేరుతో మళ్లీ డబ్బులు వసూలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జీవో నెంబర్ 27లో డెవలప్‌మెంట్ ఇంపాక్ట్ ఫీ (డీఐఎఫ్) లెక్కింపు ఫార్ములా ప్రకటించారు. జీవో నెంబర్ 18లో దానికి అనుబంధంగా గైడ్‌లైన్స్ ఇచ్చారు. ప్రభుత్వం రిజిస్ర్టేషన్ వాల్యూలో కేవలం 25 శాతం చెల్లిస్తే సరిపోతుందని చెప్తుంది. కానీ ఇక్కడే అసలు తిరకాసు ఉంది. జీవో నెంబర్ 27 ప్రకారం…మల్టీయూజ్ జోన్‌లో స్థానిక సబ్ రిజిస్ర్టార్ (ఎస్‌ఆర్‌ఓ) పరిధిలో ఉన్న మార్కెట్ రేటు నుంచి ఇండస్ర్టి యల్ జోన్ ఎస్‌ఆర్‌ఓ మార్కెట్ విలువను తీసేయగా, మిగి లిన మొత్తంలో 25 శాతం పారిశ్రామికవేత్తలు కట్టాలనేది ప్రభుత్వ నిబంధన. ఉదాహరణకు ఇండస్ర్టియల్ జోన్‌లో ఎకరం భూమికి ఎస్‌ఆర్‌ఓ మార్కెట్ విలువ రూ. 2 కోట్లు ఉంటే, మల్టీ యూజ్ జోన్‌లో ఎస్‌ఆర్‌ఓ మార్కెట్ విలువ రూ.10 కోట్లు ఉంటుంది. అంటే వ్యత్యాసం రూ.8 కోట్లు. దానిలో 25 శాతం…అంటే రూ.2 కోట్లు జోన్ మార్పిడి కోసం చెల్లించాల్సి ఉంటుంది. ఈ తిరకాసుపై పారిశ్రామిక వేత్తలు ఆభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కొనసాగిం పుగా జీవో18లో దరఖాస్తు సమయంలో పదిశాతం (రూ.20 లక్షలు) చెల్లించాలనీ, తొలివిడతలో 45 శాతం (రూ.90 లక్షలు), రెండో విడతలో రూ.45 శాతం (రూ. 90లక్షలు) చెల్లించాలని పేర్కొన్నారు. దీనిలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీజీఐఐసీ) వాటా 25 శాతం ఉంటుంది. మిగిలిన సొమ్ము రాష్ర్ట ప్రభుత్వం, పరిశ్రమల శాఖల ఖాతాల్లోకి వెళ్తుంది.
మొత్తం కడితేనే…
భూ వినియోగ మార్పిడి మొత్తం సొమ్ము (డీఐఎఫ్) చెల్లించిన తర్వాత ప్రభుత్వం జారీ చేసే ప్రత్యేక జీవో ద్వారానే అమల్లోకి వస్తుంది. దీనికోసం మళ్లీ ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడటమో లేక కోర్టుల్ని ఆశ్రయించడమో చేయాల్సివస్తుందని పారిశ్రామికవేత్తలు చెప్తున్నారు.
వచ్చే ఆదాయం రూ.10వేల కోట్లే!
‘హిల్ట్’ పాలసీ అమల్లోకి వస్తే కేవలం రూ.10,776 కోట్ల ఆదాయం మాత్రమే వస్తుందని ప్రభుత్వం చెప్తుంది. కానీ ఆదాయాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ‘హిల్ట్’ పరిధిలోకి 9,292 ఎకరాల భూమి వస్తుండగా, దానిలో 4,740 ఎకరాలు మాత్రమే లెక్కిస్తున్నదని చెప్తున్నారు. ఓసారి జోన్ మార్పిడి జరిగితే, సహజంగానే అన్ని పరిశ్రమలు మూతపడి అదే డెవలప్‌మెంట్ యాక్టివిటీలోకి వెళ్లిపోతాయని విశ్లేషిస్తున్నారు.
విధివిధానాలు మార్చాల్సిందే
ఓసారి భూమి కొనుగోలు చేసి సేల్ డీడ్ చేసుకున్న తర్వాత భూ వినియోగ మార్పిడి పేరుతో మళ్లీ కోట్ల రూపాయలు రాబట్టాలని ప్రభుత్వం భావించడం సరికాదు. ఏడాదిలో పరిశ్రమల తరలింపు సాధ్యం కాదు. కనీసం ఆ గడువును ఐదేండ్లకు పెంచాలి. తరలింపు పరిశ్రమలకు ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేసి, భూ కేటాయింపులు చేయాలి. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. వాటిని అమల్లోకి తేవాలి. మార్కెట్ రేటులో 25 శాతం చాలా ఎక్కువ. దాన్ని ఐదు శాతానికి తగ్గించాలి. తరలింపు పరిశ్రమలకు సున్నా వడ్డీతో రుణాలు ఇవ్వాలి.
-ఏపీకే రెడ్డి, జాతీయ అధ్యక్షులు, ఫెడరేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ)



