– గంజాయి రహిత సమాజమే లక్ష్యం
నవతెలంగాణ – రామకృష్ణాపూర్: రామగుండం సీపీ, డీసీపీ ల ఆదేశాల మేరకు రామకృష్ణాపూర్ పరిధిలో పోలీసులు గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గంజాయి సేవించి, విక్రయించేవారిపై వచ్చిన ముందస్తు సమాచారం ఆధారంగా ఇండ్లల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రత్యేకంగా నార్కోటిక్ డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో గంజాయి ఎక్కడైనా దాచి ఉంచినట్లయితే సులభంగా గుర్తించవచ్చని పట్టణ ఎస్.ఐ శ్రీధర్ తెలిపారు. రామకృష్ణాపూర్ పరిధిలో ఎవరికైనా గంజాయి సేవించే అలవాటు ఉన్నా లేదా విక్రయించే కార్యకలాపాల్లో పాల్గొన్నా వెంటనే మానుకోవాలని సూచించారు. లేనిపక్షంలో చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం గంజాయి మహమ్మారిని పూర్తిగా అరికట్టేందుకు (ఈగల్) అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిందని, ఈ బృందం నిరంతరం నిఘా ఉంచుతూ గంజాయి రహిత సమాజం కోసం కృషి చేస్తోందని ఎస్.ఐ పేర్కొన్నారు.




