– లక్నవరం సరస్సు నుంచి పంట కాలువలకు నీటిని విడుదల చేయిస్తానని హామీ
నవతెలంగాణ – గోవిందరావుపేట : మండల రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యపై జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ వేగంగా స్పందించారు. మంగళవారం మండలంలోని చల్వాయి గ్రామంలోని తన నివాసం వద్ద మండలంలోని రైతుల సాగునీటి సమస్యలను ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ వస్తున్నారన్న సందేశం తో గుమ్మిగూడారు. అశేషంగా గుమి కూడిన రైతులను ఉద్దేశించి అశోక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని రైతులు అశోక్ దృష్టికి తీసుకువచ్చారు.
లక్నవరం సరస్సులో నీరు అందుబాటులో ఉన్నందున, అక్కడి నుంచి పంట కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేసి పంటలను కాపాడేలా తగిన చర్యలు తీసుకోవాలని రైతులు జిల్లా అధ్యక్షులు అశోక్ కోరడం జరిగింది. రైతుల ఆవేదనను అర్థం చేసుకున్న అశోక్ వెంటనే స్పందించారు. మండలంలోని రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని, వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నందున లక్నవరం సరస్సు నుంచి పంట కాలువల ద్వారా సాగునీటిని సంబంధిత అధికారులతో మాట్లాడి విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాగునీటి పరిస్థితిని పర్యవేక్షిస్తూ, పంటలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకునేలా అధికారులను కోరుతామని అన్నారు. రైతుల సమస్యలను తెలుసుకొని, వారి ఇబ్బందులకు వెంటనే స్పందించడం అభినందనీయమని పలువురు రైతులు పేర్కొన్నారు. పంటలు చేతికొచ్చే వరకు రైతులకు అండగా ఉంటామని, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని అశోక్ మండల రైతులకు భరోసా కల్పించారు.


