Tuesday, August 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కుడి..ఎడమైతే..రేపు ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే

కుడి..ఎడమైతే..రేపు ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్: ఎవరైనా డబ్బులు ఇచ్చినప్పుడు పొరపాటున ఎడమ చేయి చాపితే కుడి చేత్తో తీసుకో అంటుంటారు. పిల్లలు ఎడమ చేతితో రాస్తే కుడి చేత్తో రాయాలని గద్దిస్తుంటారు. అంతెందుకులెండి… ఇంటికి మొదటిసారి వచ్చే కోడలిని కూడా కుడికాలు పెట్టి లోపలికి రమ్మంటారు. ఎడమ అంటే ఎందుకంత చిన్నచూపు? అందుకే ఓ కవి “కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్” అన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెఫ్ట్ హ్యాండర్స్ అందరూ ఇదే మాట అంటున్నారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 13న ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డేను నిర్వహిస్తారు. 1976లో లెఫ్ట్ హ్యాండర్స్ క్లబ్ వ్యవస్థాపకుడు డీన్ ఆర్. క్యాంప్‌బెల్ ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. ప్రధానంగా కుడిచేతి వాటం ఉన్న ప్రపంచంలో ఎడమచేతి వాటం కలిగిన వ్యక్తులు ఎదుర్కొనే సవాళ్లు, వారి అనుభవాలపై అవగాహన పెంచేందుకు ఈ రోజును ఏర్పాటు చేశారు.
ఎడమ చేతివాటంపై వివక్ష
మనలో చాలామంది కుడిచేతి వాటం కలిగినవారు కాగా, కొద్దిమంది మాత్రమే ఎడమచేతి వాటం కలిగినవారు ఉంటారు. లెఫ్ట్ హ్యాండర్స్ సంఖ్య తక్కువగా ఉండటం వల్లే వారిపై వివక్ష కొనసాగుతుందనే అభిప్రాయం ఉంది. ప్రపంచ జనాభాలో దాదాపు 10 నుంచి 12 శాతం మంది ఎడమచేతి వాటం కలిగినవారే. రోజువారీ పనులైన జుట్టు దువ్వుకోవడం, బరువులు ఎత్తడం వంటి పనుల్లో ఏ చేతిని ఎక్కువగా ఉపయోగిస్తారో అదే వారి చేతివాటాన్ని సూచిస్తుంది. గర్భంలో ఉన్నప్పుడు ఎక్కువ శాతం శిశువులు కుడి బొటనవేలును నోట్లో పెట్టుకుంటారని, వారు ఎక్కువగా కుడిచేతి వాటం కలిగినవారవుతారని చెబుతారు. ఎడమ బొటనవేలు పెట్టుకునే వారిలో కొంతమంది ఎడమచేతి వాటం కలిగినవారవుతారు. ఇది వంశపారపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉందని పేర్కొంటారు.
ఎంతోమంది ప్రముఖులు
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా, శాస్త్రవేత్త నికోలా టెస్లా, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వంటి ప్రముఖులు ఎడమచేతి వాటం కలిగినవారిగా గుర్తింపు పొందారు.
చిన్ననాటి నుంచే ప్రత్యేకత
అంకాపూర్‌కు చెందిన త్రివేణి అగ్రిటెక్ సల్ల నర్సారెడ్డి మాట్లాడుతూ, చిన్ననాటి నుంచే ఎడమచేత్తో పనులు చేయడం, చదువుకునే సమయంలో కూడా ఎడమ చేత్తో రాయడం అలవాటైందన్నారు. ఎర్రజొన్నల విత్తనాలను అందిస్తూ రైతన్నలకు సేవ చేస్తున్నానని, ఎడమచేత్తో రాయడం తనకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చిందన్నారు. పెర్కిట్‌కు చెందిన పి. రమణారెడ్డి మాట్లాడుతూ, ఒకప్పుడు ఎడమచేతి వాటం కలిగినవారిపట్ల వివక్ష ఉండేదని, వారి అలవాట్లను బలవంతంగా మార్చేందుకు ప్రయత్నించేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తూ, పదిమందిలో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -