నవతెలంగాణ-మల్హర్ రావు
వాతావరణ మార్పులతో ఏజెన్సీలోని మహముత్తారం,మల్హర్ రావు మండలాల్లోని పలు గ్రామాల్లో వారం రోజులుగా వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఒకరి నుంచి మరొక రికి సోకుతున్నాయి. జ్వరం, జలుబు, దగ్గు, విరేచనాలు, ఒంటి నొప్పులతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై వైరస్, బ్యాక్టీరియా ప్రభావం చూపుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. వారం రోజుల నుంచి తాడిచెర్ల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజుకు 150 నుంచి 200 మంది ఓపి ఉండడం, ఇందులో 60 నుంచి 80 మంది కి రక్త పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జ్వరం బారినపడుతున్నట్లుగా వైద్య సిబ్బంది తెలిపారు.
పలువురికి ప్లేట్లెట్లు తగ్గుతున్నాయి. కొందరు టైఫాయిడ్, మలేరియా జ్వరాల బారిన పడుతున్నారు. మరికొందరికి డెంగ్యూ లక్షణాలు కనిపించడంతో జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రికి తరలిస్తున్నారు. తాడిచెర్ల ఆరోగ్య కేంద్రం నిత్యం రోగులతో కిటకిటలాడుతొంది.మధ్యాహ్నం వస్తున్న రోగులకు సలైన్స్ పెట్టుకోవడానికి బెడ్స్ దొరకడం లేదని రోగులు వాపోతున్నారు. సిఏస్ ఆర్ నిధుల కింద నిర్మాణం చెసిన షెడ్డులో రోగులకు సలైన్స్ పెడుతున్నారు.అంతకముందు ఆరోగ్య కేంద్రంలో సలైన్స్ పెట్టె గది 108 సిబ్బందికి కేటాయించారు.
గ్రామాల్లో శిబిరాలు నిర్వహించాం..వినయ్ భాస్కర్…తాడిచెర్ల పిహెచ్సి వైద్యాధికారి
వానాకాలం ప్రారంభంలో ఆరోగ్య ఉప కేంద్రాలు, జీపీ కార్యాలయాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాం. ప్రస్తుతం వైరల్ జ్వరాలు సోకుతున్న నేపథ్యంలో ఆరోగ్య కేంద్రానికి రోజుకు 150 నుంచి 200 వరకు ఓపి ఉంటుంది. రోగులు ఆందోళన చెందవద్దు. మనం నివసించే పరిసరాల్లో పరిశుభ్రత పాటిస్తూ.. పోషకాహారం తీసుకోవాలి.



