Friday, June 12, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిపనికిరాని రికార్డు సరే… మోడీకి నెహ్రూతో పోలికా?

పనికిరాని రికార్డు సరే… మోడీకి నెహ్రూతో పోలికా?

- Advertisement -

నెహ్రూ కంటే ఎక్కువ రోజులు భారతదేశానికి మోడీ ప్రధానిగా కొనసాగాడని మోడీ మీడియా తెగ సంబర పడుతోంది. నెహ్రూ 4398 రోజులు ప్రధానిగా ఉంటే, ఆ రికార్డును దాటి మోడీ 4399 రోజులు ప్రధానిగా ఉన్నాడు. అంతేకాదు, గుజరాత్ ముఖ్యమంత్రిగా, ప్రధానిగా కలిపి మొత్తం 8930 రోజులు అధికారంలో ఉన్నాడు. ఊరికే పదవిలో ఉండడం కాదు, ఉండి ప్రజలకు ఏం చేశాడన్నది లెక్కలోకి తీసుకుంటారు. ఆ ఒక్క విషయమే కాదు, నిజానికి ఈయన నెహ్రూను మించిపోయిన కొన్ని విషయాలు చూద్దాం! ఇలాంటి విషయాల్లో నెహ్రూ మోడీతో ఎలా పోటీ పడగలరూ? అన్నది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. మోడీ రెండు మూడుసార్లు పుట్టినట్టు ప్రకటించుకున్నాడు. ఆ పని నెహ్రూ చేయలేకపోయాడు. మోడీ డిగ్రీ సర్టిఫికేట్ ప్రకారం 29 ఆగష్టు 1949 అయితే, ఎన్నికల కమిషన్ రికార్డుల ప్రకారం 17 సెప్టెంబర్, 1950. తేదీ ఏదో తప్పు పడిందిలే అని అనుకోవడానికి లేదు. తేదీ, నెల, సంవత్సరం మొత్తానికి మొత్తం తప్పులు ఎలా దొర్లుతాయి? దీన్ని బట్టి నరేంద్రమోడీ ఈ దేశంలో రెండుసార్లు జన్మించాడు. ఇక మూడోసారి ఎప్పుడు అవతరిం చాడూ అని బెంబేలు పడకండి.

ఆయన చెప్పుకున్న విషయమే నేనిక్కడ గుర్తు చేస్తున్నాను. ‘‘నాకు నా తల్లితో బయలాజికల్ సంబంధం ఉందని అనుకునేవాడిని కానీ, కాదు-ఈ దేశానికి సేవ చేయమని అ భగవంతుడే నేరుగా నన్ను ఈ భూమి మీదికి పంపించాడు’’ – అని ప్రకటించుకున్న విషయం ఈ దేశ ప్రజల చెవుల్లో గింగురుమంటూనే ఉంది. అయితే పంపించిన తేదీ, సమయం, వివరాలు ఆయన చెప్పుకోలేదు. ఇలా మూడు సార్లు జన్మించడమనేది నెహ్రూకు కాదుకదా ఆయన తాతకు కూడా సాధ్యం కాలేదు. ‘చాయ్ వాలా’ అనగానే అందరికీ మోడీనే గుర్తుకొస్తాడు. ఎందుకంటే ఆ విషయం ఆయనే స్వయంగా ఈ దేశ ప్రజలకు పలుమార్లు చెప్పుకున్నాడు. ఆయన తన ఆరేళ్ల వయసులో 1956లో గుజరాత్-వాద్‌‌నగర్ రైల్వే స్టేషన్లో ‘టీ’ అమ్మానని చెప్పుకున్నాడు. అక్కడ తన తండ్రి టీకొట్టు ఉండేదని, తను తన తండ్రికి సహాయపడుతూ ఉండేవాడినని చెప్పుకున్నాడు. అయితే, వాస్తవం ఏమిటంటే- వాద్ నగర్ రెల్వేస్టేషన్ 1973లో ఏర్పాటయింది. 1956లో అక్కడ స్టేషన్ లేదు – సరే, ప్రారంభమైనప్పటి నుంచి ఆ స్టేషన్ లో గూడ్సు రైళ్లే ఆగుతున్నాయి. ఎక్స్‌ప్రెస్‌ ‌రైళ్లు కాదు గదా, ప్యాసింజర్‌ ‌రైళ్లు కూడా ఆగవు.

అంటే- రైల్వేస్టేషన్ లేకపోయినా, ప్రయాణికులు లేక పోయినా మోడీ మహాశయుడు చాయ్ అమ్మాడు- అని ఈ దేశ ప్రజల్ని నమ్మించగలిగాడు. ఇంత తెలివి నెహ్రూకు లేకపోయింది కదా?
మోడీ గ్రాడ్యుయేషన్ ఢిల్లీ యూనివర్సిటీ నుండి 1978లో పూర్తి చేసినట్టు ప్రకటించుకున్నాడు. కానీ, ఆరోజుల్లో సర్టిఫికేట్లు రాయడానికి ‘కాలియోగ్రాఫర్స్’ ఉండేవారు. అంటే అక్షరాల్ని అందంగా రాసే ప్రత్యేక నిపుణులు వారితో సర్టిఫికేట్లు రాయించేవారు. కాని, ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయమేమంటే మోడీ బ్యాచిలర్ డిగ్రీ కంప్యూటర్‌‌లో టైప్ చేయబడి, ప్రింటర్‌‌లోంచి బయటికి వచ్చింది. అది ఎలా అంటే, అదేకదా అయన ప్రత్యేకత? అంటే 1978 నాటికి దేశంలో లేని (దేశానికి రాని) కంప్యూటర్ ఆయనకు సర్టిఫికేట్ ఇచ్చేసింది. (దేశంలోకి ఇ-మెయిల్ వాడుకలోకి రాకముందే తను ఇ-మెయిల్స్ పంపానని ఇంటర్వ్యూలలో చెప్పుకున్నాడు కదా? ఇది అలాగేనన్న మాట!) మైక్రోసాఫ్ట్ 1992 ఫాంట్‌‌లో రాసిన, కంప్యూటర్ ప్రింటర్లో ప్రింట్ చేసిన సర్టిఫికేట్ 1978లోనే ఆయన అందు కున్నాడు. ఇకపోతే, ఆ సర్టిఫికేట్ ఏరోజు ప్రింటయిందన్నది పరిశీలకులు క్షుణ్ణంగా గమనిస్తే వారు నోరు వెళ్లబెట్టాల్సి వచ్చింది.

ఎందుకంటే ఈ దేశంలో ఆదివారం అన్నింటికీ సెలవు. ఏ యూనివర్సిటీ పనిచేయదు. కానీ, మోడీ సర్టిఫికేట్ ఆదివారమే ప్రింటయింది. ఇలాంటి అద్భుతాలు గతంలో ఏ ప్రధాని అయినా చేయగలిగాడా? ఈ ‘ఓట్ చోరీ’ మైండ్ సెట్ ఆయనకు ఇప్పుడు అబ్బిందికాదు, ఎప్పటి నుంచో ఉందన్నమాట! ‘పువ్వు పుట్టగానే పరిమళించును’కదా? ఇకపోతే మోడీ యం.ఎ సర్టిఫికేట్ గురించి జనం ఏదేదో మాట్లాడుతారు. కానీ, వాస్తవం ఏదో తెలుసుకోరు. ఆయన ‘కష్టపడి’ సాధించిన ఎం.ఎ. సర్టిఫికేట్ తీసి పారెయడానికి లేదు. ఆయన 1983లో గుజరాత్ యూని వర్సిటీ నుంచి ‘ఎంటైర్ పొలిటికల్ సైన్స్’లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నాడు. ఆయనతోపాటు చదువుకున్న సహ విదార్థులు గానీ, ఆయనకు పాఠాలు బోధించిన అధ్యాపకులు గానీ ఎవరూ లేరు. ‘ఎంటైర్ పొలిటికల్ సైన్స్’ అనే కోర్సు గతంలో గానీ, ఇప్పుడు గానీ దేశంలో ఏ యూనివర్సిటీలో లేదు. ఆ కోర్సు ఆయన ఒక్కడికే డిజైన్‌ చేయబడింది. ఒక్కడికే పరీక్ష పెడితే, ఒక్కడే ఉత్తీర్ణుడై ఎం.ఎ. డిగ్రీ సాధించగలిగాడు. ఇలాంటి మహాన్నతమైన విషయంలో నెహ్రూయె కాదు గదా, ప్రపంచంలోనే మరొకరు ఆయనతో పోటీ పడలేరు. మోడీ డిగ్రీకి సంబంధించిన వివరాలు ఆర్టీఐ కూడా ఇవ్వలేక పోయింది. ‘గోప్యంగా ఉంచాల్సిన విషయం’ అని అడిగిన వారికి జవాబిచ్చింది. అయితే మాత్రం? నిజాలు బయటికి రాకుండా ఆగాయా ? లేదుకదా ? యం.ఎ. చదివినవాడు మరెందుకు ఆరోతరగతి ఫెయిల్ అయినవాడి లాగా ప్రశ్న అనగానే భయపడి పారిపోతుంటాడు? భారత ప్రధానులెవరూ ప్రశ్న అనగానే పారిపోలేదే? నెహ్రూ 75 ఫ్రెస్ కాన్ఫరెన్స్లు నిర్వహిస్తే, ఇందిర 42, రాజీవ్ 62, మన్మోహన్ సింగ్ 114 ప్రెస్ కాన్ఫరెన్స్ లు నిర్వహించారు.

వారి పార్టీ నాయకుడే వాజ్ పాయి 55సార్లు ప్రెస్‌తో మాట్లాడాడు. మరి మోడీ రికార్డేమిటి 4399 రోజుల్లో జీరో ప్రెస్ కాన్ఫరెన్స్! నిజానికి దీనికి కూడా సంబరాలు చేసుకుంటాడేమో!
నెహ్రూ అలీన విధానాన్ని అనుసరించి, దేశాన్ని సర్వ స్వతంత్రంగా నిలబెట్టాడు. మోడీ బండారమంతా ట్రంప్ చేతికి చిక్కింది గనుకే- అయన మోడీని అటాడుకుంటున్నాడని అనుభవజ్ఞులైన పత్రికా విలేకరులు చెపుతున్నారు. నల్లడబ్బు, వెనక్కి తెప్పించి ప్రతి ఎకౌంట్లో రూ.15లక్షలు వేస్తానన్నది పక్కన పెట్టండి. కనీసం కరోనా లాక్‌‌డౌన్ సమయంలో నిరు పేదలకు రైలు వసతి కల్పించాడా? వందల మైళ్లు నడిచి పేద ప్రజలు ఎంతమంది చనిపోయారు? పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు బ్యాంకు క్యూలలో నిలబడి ఎందరు ప్రాణాలు వదిలారు? ఇప్పుడు పెట్రోలు, గ్యాస్‌ ‌సమస్య. అధిక ధరలు. సామాన్యుడికి ఊపిరి అడడం లేదుకదా? ప్రధాని అ సీట్లో ఎన్నిరోజులు ఉంటే ఏమిటీ ? లేకుంటే ఏమిటీ? అదొక రికార్డా? ఎందుకు పనికి వస్తుందాన్నది అలోచించుకునే పని లేదా?
నెహ్రూ వేసిన పునాదుల మీదేకదా – ఇంకా ఇప్పటికీ ఈ దేశం మన గలుగుతోందీ? ప్రాజెక్టులయినా, పరిశోధనాశాల లయినా, పరిశ్రమలైనా.. దేశంలో ఎటునుంచి ఎటుచూసినా, నెహ్రూ విశ్వరూపమే కనిపిస్తోంది.

ఆకాశాన్నంటిన ఆయన దార్శనికత ముందు మోడీ ఏడీ ఎక్కడా కనపడడే? టెలిప్రాంప్టర్ చదవడం తప్ప, ఎప్పుడైనా, ఎక్కడైన ఒక అర్థవంతమైన మాట మాట్లాడాడా? దొంగ సర్టిఫికెట్లు, అనైతిక ప్రవర్తన, మానభంగాలు, హత్యలు, మారణకాండలు తప్పించి, సగర్వంగా దేశాన్ని నిలబెట్టే పని ఒక్కటైనా ఉందా? నిన్నగాక మొన్న కుర్రవాళ్లు కాక్రోచ్ జనతా పార్టీ పక్షాన పిలుపునిస్తే మోడీ ప్రభుత్వం గజగజా వణికిపోయింది ఎందుకూ? భయపడకపోతే మరి, వారి సోషల్ మీడియా అంకౌంట్లన్నీ బ్లాక్ చేయించా రెందుకూ? సర్కస్‌లో ఉండాల్సిన వాడు పొరపాటునా ప్రధాని అయ్యాడు.
నెహ్రూ స్వాతంత్య్రం కోసం జైల్లో గడిపాడు. స్వాతంత్ర్యం వచ్చాక, 1950 లలోనే కొన్ని కోట్లలో ఉన్న తన స్వంత ఆస్తిని నెహ్రూ జాతికి అంకితం చేశాడు. ‘‘మోడీ కేబినెట్ ఒక అసమర్థ కేబినెట్ గా గుర్తుండి పోతుంది’’ అని ప్రకటించిన వాడు జవహర్ సికార్. ఈయన మాజీ బ్యూరోక్రాట్, మాజీ యం.పి కూడా! ‘‘ధరేంద్ర ప్రధాన్, నిర్మలా సీతారామన్, జైశంకర్, ఆశ్విన్ వైష్ణవ్, హర్ దీప్ పురి, గిరిరాజ్ సింగ్ వంటి ప్రమాదకరమైన జోకర్లంతా ఒక ప్రధాన జోకర్‌‌కు తోడయ్యారు. స్వాతంత్య్రానంతరం ఇంతటి చెత్తప్రధాని, ఇంతటి చెత్త కేబినెట్ మనం ఎప్పుడూ చూడలేదు’’ అని అన్నాడు జవహర్ సికార్. 34 కోట్ల జనాభా ఉన్న అమెరికాని తొమ్మిది కోట్ల జనాభా ఉన్న ఇరాన్ తనమీద దాడి చేసినందుకు మూడు చెరువుల నీళ్లు తాగించి, ముప్పుతిప్పలు పెట్టింది.

మరి 145 కోట్ల జనాభా ఉన్న మన భారత దేశాన్ని మోడీ అమెరికా ముందు పడేసి, గులాంగిరి చేయడానికి సిద్ధపడ్డాడు. వివేకవంతులైన ఈ దేశ ప్రజలు మోడీ చర్యకు మండి పడుతున్నారు.
పార్లమెంట్ పరిసరాల్లోకి ఒకసారి ఒక మహిళ వేగంగా పరిగెత్తుకొచ్చి నెహ్రూ కాలర్ పట్టుకుని ఉక్రోషంతో ప్రశ్నించింది. ‘‘దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ, నాకేమొచ్చిందీ?’’- అని! నెహ్రూ చిరునవ్వు నవ్వి నిదానంగా జవాబిచ్చాడు. ‘ఇదిగో ఇలా ప్రధానమంత్రి కాలర్ పట్టుకునే స్వేచ్ఛ నీకు లభించింది!’ అని అన్నాడు. ఆ మాటల్లో ఎంతో ఆర్థం ఉంది. ఆ మహిళ తన ఆవేశం తగ్గించుకుని, నెహ్రూ కాలర్ వదిలేసి అయన వైపు దీనంగా చూసింది. ‘మీ సమస్య ఏమిటో ఇతనికి చెప్పండి. గాబరా పడకండి. పరిష్కారం చేస్తాం!’ అని తన సెక్రటరీని చూపించి ఆయన ముందుకు కదిలాడు. ఇదే మోడీ పాలనలో అయితే ఎలా ఉండేది? జెఎన్‌యు విద్యార్థి నాయకుల్లాగా, ప్రొ.సాయిబాబా – వరవరరావుల్లాగా ఆ మహిళ జీవితకాలం జైల్లో మగ్గిపోయేది. నెహ్రూ బతికి ఉన్నా, మరణించినా నెహ్రూ స్థాయి నెహ్రూదే! ఆయనతో మరొకరికి పోటీ లేదు. ఆయన మరణించిన రోజు సంఘటనలు (27 మే 1964 ) చూద్దాం. నెహ్రూ కన్నుమూసిన సమయానికి ఆయన మంత్రివర్గంలో రక్షణ మంత్రి వై.బి.చవాన్ అమెరికా పర్యటనలో ఉన్నాడు.

అంత్యక్రియలు జరగక మునుపే, వెంటనే ఢిల్లీ చేరడం ఎలాగా? అని బెంబేలు పడుతున్నాడు. భారత్ నుండి వీళ్లు తీసుకుపోయిన విమానం చిన్నది. వేగం తక్కువ. పైగా అనేక చోట్ల ఆగుతూ వెళ్లాలి. విషయం అమెరికా అధ్యక్షుడికి తెలిసి, వెంటనే తన అధికారిక విమానాన్ని భారత ప్రతినిధి బృందానికిచ్చాడు. అప్పుడు మరొక అవాంతరం ఎదురైంది. పాకిస్థాన్ తన ఆకాశ మార్గం మూసేసు కుంది. మరో మార్గంలో అంటే చాలాదూరం, చాలా సమయం పడుతుంది. అప్పుడు పాకిస్థాన్ ను సంప్రదించి విషయం చెప్పగానే నెహ్రూ మీదున్న గౌరవంతో ఎయిర్ స్పేస్ తెరిచి విమానానికి దారి ఇచ్చారు. ప్రపంచ నాయకుడిగా నెహ్రూకు ఎంత గుర్తింపు గౌరవం ఉండేవో- ఈ సంఘటనలు చెపుతాయి. ఆయన మరణించి నప్పుడు బంధుమిత్రులు, కాంగ్రెస్ సభ్యులే కాదు. విపక్షాలన్నీ భోరుమన్నాయి. ఈ దేశం సరేసరి. మొత్తం ప్రపంచమే శోక సంద్రంలో మునిగింది. నెహ్రూ కంటే ఎక్కువ రోజులు పదవిలో కొనసాగానని మోడీ ఏ మాత్రం రొమ్ము విరుచుకునే పనిలేదు. కొన్ని లక్ష‍ల అపజయాలు మూటగట్టుకుని, మోసపూరితంగా కుట్రలు చేస్తూ కొనసాగడం కొనసాగడమా? అదొక రికార్డా? పేపర్‌ ‌లీకులు, వంతెనలు, విమానాలు కూలడాలు, దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల మూసివేత, అడ్డదిడ్డంగా సిలబస్‌లు మార్చడం, వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం.. ఎన్నని? లైట్‌, కెమెరా, యాక్ష‍న్‌, సెల్ఫీ తప్ప – చిత్తశుద్ధితో పనిచేసిందెక్కడ? కార్పొరేట్లకు తప్ప, సామాన్యులకు మేలు జరిగిందెక్కడ? ​
వ్యాసకర్త: కవిరాజు త్రిపురనేని రామస్వామి జాతీయ పురస్కార తొలి గ్రహీత, జీవశాస్త్రవేత్త.

ప్రొ. దేవరాజు మహారాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -