– సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య
నవతెలంగాణ-రాజేంద్రనగర్
రాష్ట్రంలో లేబర్ కోడ్స్‌ను అమలుచేయమని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం కాటేదాన్‌లోని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ప్రజలపై, రైతు, కార్మికవర్గంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందన్నారు. కార్మికులు వందల ఏండ్లు పోరాటాలు చేసి సాధించుకున్న 29 చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్‌ల అమలుకు నోటిఫికేషన్‌తోపాటు రూల్స్‌ను కూడా విడుదల చేసిందని తెలిపారు. ప్రజలందరిపై భారం పడే విధంగా విద్యుత్ సవరణ బిల్లు-2025ను తెచ్చిందని, గ్రామీణ ప్రాంతంలో ఉపాధికి గ్యారంటీ కల్పిస్తున్న మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం-2005 స్థానంలో వీబీజీఆర్‌ఏఎమ్‌జీ పథకాన్ని ప్రవేశపెట్టిందని విమర్శించారు. రైతుల నడ్డివిరిచేందుకు నూతన విత్తన బిల్లును సైతం తీసుకొచ్చిందన్నారు. మొత్తం ప్రభుత్వరంగాన్ని ప్రయివేటుపరం చేయడం, పబ్లిక్, ప్రయివేటు పార్టనర్‌షిప్ పేరుతో అన్ని రంగాల్లో కార్పొరేట్లకు ద్వారాలు తెరిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని వ్యతిరేకిస్తూ.. గురువారం దేశవ్యాప్త సమ్మె చేపట్టినట్టు తెలిపారు. బీజేపీ తన నిర్ణయాలను వెనక్కి తీసుకోకపోతే మరిన్ని పోరాటాలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. లేబర్ కోడ్స్ అమలు చేయమని, కేరళలో సీపీఐ(ఎం) ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని గుర్తు చేశారు. అదే పద్ధతిలో రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్‌ను అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీఐటీయూ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జాజాల రుద్రకుమార్, జిల్లా కమిటీ సభ్యులు కాలే రాజు, చుక్క మోహన్ తదితరులు పాల్గొన్నారు.
లేబర్‌కోడ్స్ అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



