నిజమైన ప్రేమ ఆస్తి, అంతస్తులను చూడదు. వాస్తవానికి ప్రేమకు వీటితో సంబంధమే ఉండదు. నిజానికి ఒక వ్యక్తిని ఎందుకు ప్రేమిస్తున్నారో కూడా చెప్పలేరు. ప్రేమలో ఎలాంటి షరతులూ ఉండవు. ప్రేమ అంత స్వచ్ఛమైనది. నిజంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నట్లయితే వారి సంతోషాన్నే కోరుకుంటారు. ఆ ప్రేమలో నమ్మకం ఉంటుంది. కానీ కొందరు నిజమైన ప్రేమ ఏదో తెలుసుకోలేక మదనపడుతుంటారు. వారు బాధపడుతూ జీవిత భాగస్వామిని కూడా బాధపెడుతుంటారు. అలాంటి ఓ కథనమే ఈ వారం ఐద్వా అదాలత్(ఐలమ్మ ట్రస్ట్)లో చదువుదాం…
సుజాతకు 28 ఏండ్లు ఉంటాయి. ఆమె ఒక ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేస్తుంది. భర్శీవంశీ కూడా ప్రయివేటు ఉద్యోగి. పిల్లలు లేరు. ఇద్దరూ బంధువులే కాబట్టి మొదటి నుండి ఒకరికి ఒకరు పరిచయమే. అయితే సమస్య మొత్తం రాజుతో. ఆమె పెండ్లికి ముందు ప్రేమించి పెండ్లి చేసుకోవాలి అనుకున్నది. వారిద్దరూ స్కూల్లో ఉన్నప్పటి నుండే ఒకరంటే ఒకరి ఇష్టం. ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారింది. డిగ్రీకి వచ్చే సరిక ఒకరిని వదిలి ఒకరు ఉండలేని స్థితికి వచ్చారు. ఇంట్లో వాళ్లకు ఆ విషయం చెప్పారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో ఇంట్లో ముందు ఒప్పుకోలేదు. కానీ ఇద్దరూ ఎంతో ఇష్టపడుతున్నారని తెలుసుకున్న ఇరు కుటుంబాల పెద్దలు కూర్చొని మాట్లాడుకున్నారు. అయితే రాజు కుటుంబ సభ్యులు సుజాత వాళ్ల కుటుంబం నుండి కట్నం ఆశించారు. అది కూడా చిన్న మొత్తం కాకుండా చాలానే అడిగారు. దాంతో సుజాత కుటుంబం ఆలోచనలో పడింది. అంత కట్నం ఇవ్వలేక వాళ్ల పేరుతో ఉన్న రెండు ఇళ్లలో ఒక ఇంటిని సుజాతకు రాసి ఇస్తామని చెప్పారు. కానీ రాజు దానికి ఒప్పుకోలేదు. సుజాత చాలా ప్రయత్నం చేసింది. సుజాతకు నెలకు లక్షా ఇరవై వేలు వస్తున్నాయి.
రాజుకి నెలకు లక్ష రూపాయలు వస్తుంది. అతని కంటే కూడా ఆమెకే ఎక్కువ జీతం. అది మొత్తం రాజుకు ఇవ్వడానికి ఒప్పుకుంది. కానీ ఎందుకో రాజు కుటుంబం ఒప్పుకోలేదు. ఈ విషయంపై ఇద్దరి మధ్య దాదాపు ఆరు నెలలు చర్చలు జరిగాయి. కానీ అవి సఫలం కాలేదు. కేవలం రాజు డబ్బు కోసమే సుజాతను పెండ్లి చేసుకోవాలను కున్నాడు. దాంతో సుజాత తట్టుకోలేకపోయింది. ‘నాకంటే రాజుకు డబ్బంటేనే ఇష్టం. నాపైనే ఎలాంటి ప్రేమా లేదు’ అని అర్థం చేసుకున్న ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు. ఇంట్లోనే ఒంటరిగా కూర్చునేది. ఆమె పరిస్థితి చూసి కుటుంబ సభ్యులు చాలా బాధ పడ్డారు. ఆమె బాధ చూడలేక ఎలాగైనా రాజుతో తన పెండ్లి చేయాలనుకున్నారు. కానీ పెండ్లి కాక ముందే కట్నం కోసం ఆశపడ్డ అతనితో ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆలోచించి ఆగిపోయారు. దానికి తోడు సుజాత కూడా అతనిని ఇక పెండ్లి చేసుకోనని చెప్పేసింది. ‘నేను నా జీతం మొత్తం ఇస్తాను అని చెప్పాను, నా పేరుతో ఇల్లు రాసిస్తామన్నారు. 20 తులాల బంగారం ఉంది. అయినా అతను ఇంకా డబ్బు కావాలంటున్నాడు.
అలాంటి వాడిని నేను పెండ్లి చేసుకోను’ అని కచ్చితంగా చెప్పేసింది. కొద్ది రోజుల్లో రాజుకు వేరే అమ్మాయితో పెండ్లి జరిగింది. అతని పెండ్లి అయిన రెండేండ్లకు సుజాత, వంశీని పెండ్లి చేసుకుంది. వంశీ, సుజాతకు మేనత్త కొడుకు. అతనికి ఆమె గురించి, రాజు గురించి మొత్తం తెలుసు. తెలిసే పెండ్లి చేసుకున్నాడు. ఆమెను ఎలాగైనా రాజు ఆలోచనల నుండి బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు. వంశీకి సుజాత అంటే చాలా ఇష్టం. కానీ ఈ విషయం అతను ఇంట్లో ఎప్పుడూ చెప్పలేదు. సుజాతకు ఒకసారి చెబితే ఆమె రాజు గురించి చెప్పేసరికి అతను తప్పు కున్నాడు. ప్రస్తుతం వీరిద్దరి పెండ్లి జరిగి రెండేండ్లు అవుతుంది. సుజాతను వాళ్ల అమ్మ నాన్నల కంటే ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. కానీ ఆమెను ఇప్పటి వరకు తాకను కూడా తాకలేదు. ఆమె అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చి… ‘మేడమ్ వంశీ నా అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ నేను రాజు ఆలోచనల నుండి బయటపడలేకపోతున్నాను.
మనసులో రాజును పెట్టుకొని వంశీని మోసం చేస్తున్నాననే బాధ నాలో రోజురోజుకు పెరిగిపోతుంది. అందుకే మీ దగ్గరకు వచ్చాను. ఈ మధ్యనే రాజు నన్ను మళ్లీ కలిశాడు. 4,5 సార్లు ఫోన్ చేసి మాట్లాడాడు. అతని భార్య అతన్ని వదిలేసి వెళ్లిపోయిందంటా. ‘మన ప్రేమ గురించి తెలిసే ఆమె వెళ్లిపోయింది’ అని చెప్పాడు. పైగా ఇప్పుడు మనిద్దరం పెండ్లి చేసుకుందాం అంటున్నాడు. నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. రాజును ఎలా నమ్మాలి? వంశీకి ఎలా దూరం కావాలి? మీరే నాకు ఓ దారి చూపించండి’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె చెప్పింది విన్న తర్వాత రాజు గురించి వివరాలు తెలుసుకున్నాం. ఆమె చెప్పినట్టు అతని భార్య వెళ్లిపోయింది. కానీ వీళ్ల ప్రేమ గురించి తెలిసి కాదు, రాజు డబ్బు పిచ్చి భరించలేకనే ఆమె వెళ్లిపోయింది. అదనపు కట్నం కోసం వేధించడం, ఇతరులతో సంబంధాలు అంటకట్టడం వల్ల ఆమె అతన్ని వదిలి వెళ్లిపోయిందని తెలిసింది. వంశీని పిలిచి మాట్లాడితే ‘సుజాత అంటే నాకు చిన్నతనం నుండి ఎంతో ఇష్టం. ఆమె బాధపడుతూ, ఏడుస్తుంటే నేను చూడలేను. పెండ్లి చేసుకుంది సుజాతపై ప్రేమతోనే కానీ జాలితో కాదు. నేను సుజాత నుండి ఏమీ ఆశించడం లేదు. మామయ్య ఇల్లు రాసి ఇస్తాను అన్నాడు. కానీ నేను తీసుకోలేదు. ఆ ఇల్లు ఆమె పేరుతోనే రాయించమని చెప్పాను.
అలాగే ఈరోజు వరకు నేను సుజాత జీతం నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. పైగా నా జీతం కూడా ఆమెకే ఇస్తాను. ఖర్చులన్నీ ఆమెకే వదిలేశాను. కానీ ఆమె ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాను. అయితే ఈ మధ్య సుజాత చాలా మారిపోయింది. మీ దగ్గరకు ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. నేను ఆమెను అస్సలు ఇబ్బంది పెట్టలేదు’ అన్నాడు.దానికి మేము ‘ఆమె మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తుంది. కానీ మీరు కూడా ఆమెకు దూరమైపోతారేమో అని భయపడుతుంది. అంతే కానీ మరే సమస్యా లేదు’ అని చెప్పాము. సుజాతతో ‘రాజు మోసగాడు, డబ్బు పిచ్చితో అతను పెట్టే బాధలు భరించలేక భార్య అతన్ని వదిలి పెట్టి వెళ్లిపోయింది. వంశీకి నువ్వంటే చాలా ఇష్టం. నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. అనవసరంగా అతన్ని బాధపెట్టకు. ఇప్పటి నుండి ఇద్దరూ సంతోషంగా ఉండండి. రాజును నీ మనసు నుండి పూర్తిగా తీసెయ్. అప్పుడే నువ్వు వంశీతో ఆనందంగా ఉండగలవు. అనవసరంగా నీ భర్తను దూరం చేసుకోకు’ అని చెప్పి పంపించాము.



