Saturday, June 13, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిస్థిరమైన ఆర్థిక శక్తి 'ఎల్ఐసి`

స్థిరమైన ఆర్థిక శక్తి ‘ఎల్ఐసి`

- Advertisement -

భారతదేశంలో ‘బీమా’ అనే పదం వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఎల్‌ఐసీ. అది కేవలం ఒక బీమా సంస్థ కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు అండగా నిలిచిన మహాసంస్థ, కోట్లాది కుటుంబాల భవిష్యత్తుకు భరోసా, భారత అభివృద్ధి ప్రయాణంలో కీలక భాగస్వామి. ఏడు దశాబ్దాలుగా కోట్లాది పాలసీదారులు తమ కష్టార్జిత సొమ్మును ఎల్‌ఐసీపై నమ్మకంతో అప్పగిస్తున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ఆ సొమ్మును కేవలం లాభాల కోసమే కాకుండా దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమం, మౌలిక వసతుల కల్పన, ఆర్థిక స్థిరత్వం కోసం వినియోగించడం ఎల్‌ఐసీ ప్రత్యేకత.
ఇటీవల రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ వివాదం నేపథ్యంలో ఎల్‌ఐసీ పెట్టుబడులపై కొన్ని కథనాలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే వాస్తవ గణాంకాలు, ఎల్‌ఐసీ ఆర్థిక బలం, పెట్టుబడి విధానం, చరిత్రను పరిశీలిస్తే పాలసీదారులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థగా, సుమారు రూ.60 లక్షల కోట్లకు పైగా ఆస్తుల నిర్వహణ కలిగిన ఎల్‌ఐసీ, ఒకటి రెండు కంపెనీల్లో వచ్చే సమస్యల వల్ల కదిలిపోయే సంస్థ కాదు. ఇది భారత ఆర్థిక వ్యవస్థలోనే ఒక స్థిరమైన ఆర్థిక శక్తి. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌లో ఎల్‌ఐసీకి సుమారు 10.8 శాతం వాటా ఉంది. దీని ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు రూ.330 నుంచి 335 కోట్లు. సాధార ణంగా ఈ మొత్తం పెద్దదిగా అనిపించినా, ఎల్‌ఐసీ మొత్తం ఆస్తుల విలు వతో పోలిస్తే ఇది చాలా స్వల్పం.

ఇక్కడ ప్రతి పాలసీదారు తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విష యం ఏమిటంటే, ఎల్‌ఐసీ పాలసీదారుల నుంచి సేకరించే ప్రీమియంలను కేవలం నిల్వ ఉంచదు. వాటిని దేశ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి, మౌలిక వసతుల నిర్మాణానికి, ఆర్థిక పురోగతికి ఉపయోగపడే రంగాల్లో పెట్టుబడి పెడుతుంది. ఒక పాలసీదారు చెల్లించిన ప్రీమియం కేవలం ఎల్‌ఐసీ ఖాతాలో ఉండిపోదు. అది దేశ ఆర్థిక చక్రంలో భాగమై ప్రజలకు ఉపాధి కల్పిస్తుంది, మౌలిక వసతులను సృష్టిస్తుంది, పరిశ్రమలకు ఊతమి స్తుంది. ఆ పెట్టుబడుల ద్వారా వచ్చే వడ్డీ, లాభాలు, డివిడెండ్లు తిరిగి పాలసీదారుల ప్రయోజనాలకు ఉపయోగపడతాయి. అంటే ఎల్‌ఐసీ పెట్టుబడి తత్వం ‘ప్రజల డబ్బును ప్రజల అభివృద్ధికే వినియోగించడం’ అనే జాతీయ దృక్పథంతో సాగుతుంది. భారతదేశంలో నిర్మితమవుతున్న అనేక జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌ వేలు, రైల్వే ప్రాజెక్టులు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, గృహ నిర్మాణ పథకాలు, నీటి పారుదల ప్రాజెక్టులు, పట్టణాభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎల్‌ఐసీ నిధులు చేరుతున్నాయి. దేశ నిర్మాణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న దీర్ఘకాలిక అభివృద్ధి కార్యక్రమాలకు ఎల్‌ఐసీ ఒక ఆర్థిక వెన్నెముకలా పనిచేస్తోంది.

ఈ కారణం గానే ఎల్‌ఐసీని కేవలం బీమా సంస్థగా కాకుండా, దేశాభివృద్ధిలో భాగస్వామిగా ఆర్థిక నిపుణులు అభివర్ణిస్తుంటారు. ఎల్‌ఐసీ పెట్టుబడులలో అత్యధిక భాగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బాండ్లు , సెక్యూరిటీలలోనే ఉంటుంది. మొత్తం పోర్ట్‌ఫోలియోలో దాదాపు అరవై నుంచి అరవై ఐదు శాతం వరకు ప్రభుత్వ సెక్యూరిటీల్లోనే పెట్టుబడులు ఉన్నాయి. ఇవి దేశంలోనే అత్యంత భద్రమైన పెట్టుబడులుగా పరిగణించ బడతాయి. దీనితో పాటు విద్యుత్, రవాణా, మౌలిక వసతులు, గృహ నిర్మాణం, బ్యాంకింగ్, తయారీ రంగాలు, అత్యుత్తమ రేటింగ్ కలిగిన కార్పొరేట్ బాండ్లలో కూడా పెట్టుబడులు ఉంటాయి. ఈ వైవిధ్యభరిత పెట్టుబడి విధానం వల్ల ఒక రంగంలో వచ్చే నష్టం మొత్తం సంస్థపై ప్రభావం చూపే అవకాశం ఉండదు. ఎల్‌ఐసీ భారతీయ షేర్ మార్కెట్‌లో అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారు లలో ఒకటి. మార్కెట్ ఒడిదొడుకులను అవకాశాలుగా మలచడం సంస్థ ప్రత్యేకత. గత కొన్ని ఆర్థిక సంవత్సరాలలో ఎల్‌ఐసీ ఈక్విటీ మార్కెట్ ద్వారా సాధించిన లాభాలు దీనికి నిదర్శనం. రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ వంటి బ్లూచిప్ కంపెనీలలో ఎల్‌ఐసీకి ఉన్న పెట్టుబడులు ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయల డివిడెండ్లు, మూలధన వృద్ధిని అందిస్తున్నాయి. మార్కెట్‌లో తాత్కాలిక ఒడిదొడుకులు వచ్చినా, దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహం వల్ల ఎల్‌ఐసీ స్థిరమైన లాభాలను నమోదు చేస్తోంది.సోషల్ మీడియా ప్రచారాలు, తాత్కాలిక మార్కెట్ వార్తలు, ఒకటి రెండు కంపెనీల వివాదాలు వచ్చి పోతుంటాయి. కానీ ఎల్‌ఐసీ వంటి మహాసంస్థల బలం వాటి వెనుక ఉన్న ఆస్తుల్లో మాత్రమే కాదు, కోట్లాది భారతీయులు దశాబ్దాలుగా ఉంచిన విశ్వాసంలో ఉంది.

-కాలగిరి శ్రీనివాస్ రెడ్డి, 9010128884

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -