నవతెలంగాణ-హైదరాబాద్: భారత ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రయోగ కేంద్రం ‘సతీష్ ధవన్ స్పేస్ సెంటర్’ (SDSC-SHAR) శ్రీహరికోట రేంజ్ టెక్నికల్ ఏరియాల్లో రాత్రింబగళ్లు శ్రమిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వేతన వేదనలు తప్పడం లేదు. ఇక్కడి సఫాయి, క్లీనింగ్, డస్టింగ్ పనుల కాంట్రాక్టును GeM ద్వారా దక్కించుకున్న ‘M/s ఎక్కో గార్బ్’ సంస్థ మొదటి నెల నుంచే జీతాల చెల్లింపులో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. మార్చి నెల వేతనాన్ని మే 1న, ఏప్రిల్ నెల వేతనాన్ని మే 22న చెల్లించిన కాంట్రాక్టర్, జూన్ 10 లోపు ఇవ్వాల్సిన మే నెల వేతనాన్ని ఇప్పటివరకు చెల్లించకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై ఇప్పటికే కంట్రోలర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది.
మరోవైపు, పాత హెడ్ పీజీఏ, సీనియర్ హెడ్ పీజీఏలు బదిలీపై వెళ్లడం, కొత్త అధికారులు ఇంకా బాధ్యతలు స్వీకరించకపోవడంతో కాంట్రాక్ట్ మేనేజర్లు, ఇన్చార్జిలు సకాలంలో వేతనాలు ఇప్పించేలా చర్యలు తీసుకోకుండా నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. తమకు వేతన స్లిప్పులు, పీఎఫ్, ఈఎస్ఐ వివరాలతో పాటు ప్రతి నెల నిర్ణీత తేదీల్లో జీతాలు అందేలా చూడాలని బాధిత కార్మికులను ఆదుకోవాలని ఎస్కేఎస్, సీఐటీయూ యూనియన్ నాయకులు ఉన్నతాధికారులను కోరుతున్నారు.



