Saturday, June 13, 2026
E-PAPER
Homeఖమ్మంమద్యం మత్తులో ట్యాంకర్ డ్రైవర్ బీభత్సం

మద్యం మత్తులో ట్యాంకర్ డ్రైవర్ బీభత్సం

- Advertisement -

– ముగ్గురికి తీవ్ర గాయాలు
– కేసు నమోదు చేసిన పోలీసులు
నవతెలంగాణ – అశ్వారావుపేట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. మద్యం మత్తులో ట్యాంకర్ నడిపిన డ్రైవర్ నిర్లక్ష్యానికి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రుల బంధువు స్వర్ణ వెంకటేశ్వరరావు ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు అశ్వారావుపేట ఎస్‌హెచ్‌వో యయాతి రాజు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపు అతివేగంగా వస్తున్న కెమికల్ ట్యాంకర్ అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం నుంచి దర్బగూడెం వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని తెలంగాణ – ఆంధ్రా సరిహద్దు లో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోగా తీవ్ర గాయాలపాలయ్యారు.

క్షతగాత్రులను స్థానికులు అశ్వారావుపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ఆస్పత్రికి రిఫర్ చేశారు. అనంతరం కుటుంబ సభ్యులు వారిని జంగారెడ్డిగూడెం తరలించినట్లు సమాచారం. ప్రమాదం అనంతరం ట్యాంకర్ డ్రైవర్ వాహనంతో పరారయ్యేందుకు ప్రయత్నించాడు. స్థానికులు వెంబడించడంతో అశ్వారావుపేట ప్రధాన కూడలి వద్ద నుంచి మున్సిపల్ కార్యాలయం రోడ్డులోకి అతివేగంగా దూసుకెళ్లాడు. ఈ క్రమంలో ట్యాంకర్ విద్యుత్ తీగలను ఢీకొని తెంపివేయడంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

ముందుకు వెళ్లిన ట్యాంకర్ వ్యవసాయ పొలాల వద్ద రహదారి ముగియడంతో అక్కడే నిలిచిపోయింది. స్థానికులు అక్కడికి చేరుకుని చూడగా డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ట్యాంకర్ డ్రైవర్, మధ్యప్రదేశ్‌ కు చెందిన రాంచరణ్ సింగ్ వాహనం నడిపే సమయంలో మద్యం సేవించి ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయిందని ఎస్‌హెచ్‌వో యయాతి రాజు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -