Saturday, June 13, 2026
E-PAPER
Homeఖమ్మంప్రభుత్వ బడుల్లో సకల సౌకర్యాలు

ప్రభుత్వ బడుల్లో సకల సౌకర్యాలు

- Advertisement -

– ఎంఈఓ ప్రసాదరావు 
నవతెలంగాణ – అశ్వారావుపేట

మండలంలో ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర యాజమాన్యాలకు చెందిన 100 కు పైగా విద్యాసంస్థలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ వంటి సౌకర్యాలు ఉచితంగా అందుతున్నాయి. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు బోధన నిర్వహిస్తున్నప్పటికీ, ఆధునిక వాతావరణం, ఇంగ్లిష్ మాధ్యమం, స్కూల్ బస్సులు, ప్రత్యేక యూనిఫాంల ఆకర్షణతో తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు.

దీంతో రెక్కాడితే డొక్కాడని పేద, మధ్యతరగతి కుటుంబాలు సైతం అప్పులు చేసి అయినా పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అశ్వారావుపేట మండలంలో ప్రస్తుతం ఏడు ప్రైవేట్ పాఠశాలలు పనిచేస్తున్నాయి. వీటిలో ఐదు అశ్వారావుపేట కేంద్రంలో ఉండగా, వినాయకపురం, గుమ్మడివల్లిలో ఒక్కో పాఠశాల ఉంది.

పాఠశాలలు కల్పించే సౌకర్యాలను బట్టి ఫీజులు నిర్ణయించబడుతున్నాయి.నర్సరీ నుంచి రూ.10 వేలతో ప్రారంభమయ్యే ఫీజులు పదో తరగతి వరకు రూ.28 వేల వరకు చేరుతున్నాయి. విద్యతో పాటు రవాణా, యూనిఫాం, పుస్తకాలు, ఇతర ఖర్చులు కలిపితే తల్లిదండ్రులపై మరింత ఆర్థిక భారం పడుతోంది.

అయితే ఈ అంశంపై ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అశ్వారావుపేట వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో ఎక్కువ మంది విద్యార్థులు పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారేనని, తల్లిదండ్రులు అంగీకరించిన ఫీజులను కూడా పూర్తిగా చెల్లించలేకపోతున్నారని చెబుతున్నారు. ఉపాధ్యాయుల జీతాలు, భవన అద్దెలు, విద్యుత్, రవాణా తదితర నిర్వహణ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో బడ్జెట్ స్కూళ్లను కొనసాగించడం కష్టసాధ్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయమై మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) ప్రసాదరావు మాట్లాడుతూ, ప్రభుత్వం పాఠశాలలకు అనుమతులు జారీ చేస్తుందని,ఫీజులు వివరాలను పాఠశాల ల ముందు ప్రదర్శన( డిస్ప్లే )చేయాలని ,వాటి వివరాలు ని మండల విద్యా వనరుల కేంద్రానికి అందించాలని విద్యాధికారి ఆదేశించారు.

ఆర్థిక ఇబ్బందులు, ఫీజుల బకాయిల భారం కారణంగా మండలంలో ఇప్పటికే రెయిన్‌బో, ఇండియన్ డిజిటల్ స్కూల్, శాంతినికేతన్ పాఠశాలలు మూతపడినట్లు సమాచారం. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు పెరుగుతున్నప్పటికీ ప్రైవేట్ విద్యపై తల్లిదండ్రుల ఆకర్షణ కొనసాగుతుండగా, మరోవైపు పెరుగుతున్న నిర్వహణ వ్యయాలు ప్రైవేట్ విద్యాసంస్థలకు సవాలుగా మారుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -