రూ.98 కోట్లు
నిరుద్యోగం, ఆరోగ్యం, విద్య కంటే ‘గోవిజ్ఞాన్’కే పెద్దపీట
శాస్త్రీయ ప్రాధాన్యతలపై మోడీ సర్కారుకు ప్రశ్నలు
సంఘ్ భావజాల వ్యాప్తి కోసం ప్రజాధనమా?
కేంద్రం తీరుపై మేధావులు, సామాజికవేత్తల విమర్శలు
భారత్‌లో యువత తీవ్ర నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నది. ప్రభుత్వ పాఠశాలలు నిధుల కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులు సిబ్బంది కొరతతో సతమతమవుతున్నాయి. రైతులు వాతావరణ మార్పులు, మార్కెట్ అస్థిరత లతో సమస్యలను ఎదుర్కొం టున్నారు. దేశం ఇన్ని సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మాత్రం ఆవు పేడ, ఆవు మూత్రం, పంచగ వ్యంపై పరిశోధనలకు దాదాపు రూ.98 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించింది. ఇప్పుడిది తీవ్ర చర్చకు దారి తీసింది. ఇదంతా మోడీ సర్కారు ఆరెస్సెస్ భావజాల వ్యాప్తి కోసం చేస్తున్న ప్రయత్నమనీ, ఇందుకోసం ప్రజాధనాన్ని వినియోగించడమేంటని మేధావులు, సామాజికవేత్తలు విమర్శి స్తున్నారు. 2020లో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ ప్రారంభించిన ఓ పథకం కింద దేశీయ ఆవుల ఉత్పత్తులపై పరిశోధనలు చేపట్టారు. ఇప్పుడు ఆ పరిశోధనల ఫలితాలు వెలుగు లోకి వస్తుండటంతో ఈ అంశం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. దీనిపై శాస్త్రీయ సమాజంతో పాటు రాజకీయ, సామాజిక వర్గాల్లో కూడా తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగం, విద్య, ఆరోగ్యం, వ్యవసాయ సంక్షోభం వంటి సమస్యలు నెలకొని ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 2020లో దేశీయ ఆవుల ఉత్పత్తులపై పరిశోధనల కోసం రూ.98 కోట్ల నిధులను కేటాయించడం మరోసారి చర్చనీయాం శంగా మారింది. ఐఐటీలు సహా పలు ప్రముఖ సంస్థలు ఆవు మూత్రం, పేడ, పంచగవ్యంపై నిర్వహించిన పరిశోధనల ఫలితాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ (డీఎస్‌టీ) 2020లో ‘సూత్రా-పిక్’ (సైంటిఫిక్ యుటిలైజేషన్ త్రూ రీసెర్చ్ ఆగ్మెంటేషన్- ప్రైమ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఇండీజెనస్ కౌవ్స్) పేరుతో ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. దేశీయ ఆవుల నుంచి లభించే ఉత్పత్తుల ఆరోగ్య, వ్యవసాయ, పోషక విలువలను శాస్త్రీయంగా అధ్యయనం చేయడమే దీని లక్ష్యం. ఈ పథకానికి మొత్తం రూ.98 కోట్ల వ్యయాన్ని ఆమోదించగా.. పది ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు. వాటిలో నాలుగు ప్రాజెక్టులను ఐఐటీ-బీహెచ్‌యూ, ఐఐటీ (ఐఎస్ఎం)-ధన్‌బాద్, ఐఐటీ-కాన్పూర్ వంటి సంస్థలు నిర్వహించాయి.
వివిధ సంస్థల పరిశోధనల ఫలితాలు
ఐఐటీ-బీహెచ్‌యూ పరిశోధకులు వివిధ జాతుల ఆవుల మూత్రంపై అధ్యయనం చేసి ఫినాల్, క్రెసాల్, ఎస్టర్లు వంటి పారిశ్రామికంగా ఉపయో గపడే రసాయన సమ్మేళనాలను గుర్తించినట్టు వెల్లడించారు. అయితే జైలీన్, ఫార్మమైడ్ వంటి విషపూరిత పదార్థాలు కూడా ఉన్నట్టు పరిశోధనలో తేలింది. ఐఐటీ ధన్‌బాద్.. ఆవు పేడ నుంచి తయారుచేసిన కార్బన్ పదార్థాన్ని కలుషిత నీటిలోని క్రోమియం వంటి ప్రమాదకర లోహాలను తొలగిం చేందుకు ఉపయోగించవచ్చని గుర్తించింది. ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు పశువుల ఎరువు నుంచి పొందిన పదార్థాలు ఉక్కుపై తుప్పు పట్టకుండా రక్షించే తక్కువ ఖర్చుతో కూడిన పర్యా వరణహిత ప్రత్యామ్నాయాలుగా ఉపయో గపడవచ్చని నిర్ధారిం చారు. ఇక పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, పేడ మిశ్రమమైన పంచగవ్యానికి అంటువ్యాధులను నిరోధించే లక్షణాలున్నాయా అనే అంశంపై మరో పరిశోధన కొనసాగుతోంది. దీనికి సంబంధించిన పత్రాలు, పేటెంట్లు ఇంకా సిద్ధం కాలేదు.
ముందుగానే నిర్ణయించుకున్న నమ్మకాలకు శాస్త్రీయ బలం చేకూర్చే ప్రయత్నాలు
సూత్రా-పిక్ ప్రారంభమైనప్పుడే పలువురు శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ముందుగానే నిర్ణయించుకున్న నమ్మ కాలను శాస్త్రీయంగా నిరూపించాలనే ప్రయత్నం జరిగుతోందనీ, అది నిష్పాక్షిక పరిశోధనలకు విరుద్ధమవుతుందని హెచ్చరించారు. ప్రజలకు అత్యవసరంగా అవసరమైన ఆరోగ్య సాంకేతికతలు, వాతావరణ మార్పులు, వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం వంటి రంగాల్లో పెట్టుబడులు పెంచాల్సి న సమయంలో… ఆవు ఉత్పత్తులపై ప్రత్యేకంగా కోట్ల రూపాయల నిధులు కేటాయిం చడం ఏంటని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఇది కేంద్రంలోని మోడీ ప్రభుత్వ ప్రాధాన్యతలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. శాస్త్రీయ పరిశోధనను భావజాలంతో ముడిపెట్టడం వల్ల పరిశోధనా సంస్థల స్వతంత్రత దెబ్బతినే ప్రమాదం ఉందని కూడా వారు అంటున్నారు.
శాస్త్రీయ ఆధారాల కంటే విశ్వాసాలకు ప్రాధాన్యమా?
ఆవు మూత్రం వల్ల క్యాన్సర్ నుంచి రక్తపోటు వరకు అనేక వ్యాధులు నయమవుతాయని గతంలో పలువురు బీజేపీ, హిందూత్వ నాయకులు చేసిన ప్రకటనలు తీవ్ర వివాదాలకు దారి తీశాయి. ఇప్పటికీ అలాంటి వాదనలకు బలమైన వైద్య ఆధారాలు లేవని వైద్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆవు ఉత్పత్తులపై ప్రభుత్వ ప్రోత్సాహం ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం కంటే మూఢనమ్మ కాలను బలపరిచే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
భావజాల వ్యాప్తికి కోట్లాది నిధులు
కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ‘గో రక్షణ’, ‘గో సంస్కృతి’, ‘దేశీయ ఆవుల గొప్పతనం’ వంటి అంశాలు రాజకీయ చర్చల్లో కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలోనే సూత్రా-పిక్‌ను చాలా మంది శాస్త్రీయ కార్యక్రమంగా కాకుండా భావజాల ప్రేరిత ప్రాజెక్టుగా చూస్తున్నారు. ఒకవేళ ఆవు ఉత్పత్తులపై పరిశోధన అవసరమైతే అది సాధారణ పరిశోధనల్లా జరగాలి కానీ కేవలం ఆవుల కోసం ప్రత్యేకంగా దాదాపు వంద కోట్ల రూపాయల పథకాన్ని ఏర్పాటు చేయడం వెనుక మోడీ సర్కారుకున్న రాజకీయ ప్రాధాన్యతలు కనిపిస్తున్నాయని వారు అంటున్నారు.



