Sunday, June 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅబార్షన్ కేంద్రం గుట్టురట్టు

అబార్షన్ కేంద్రం గుట్టురట్టు

- Advertisement -

ఎలాంటి విద్యార్హతలూ లేకుండా డాక్టర్‌‌గా మారిన మహిళ…అనుమతులు లేకుండా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వహణ
పోలీసుల డెకాయ్ ఆపరేషన్‌లో ఇద్దరి అరెస్ట్

నవతెలంగాణ – నాగోల్
ఎలాంటి అనుమతులూ లేకుండా ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌ నిర్వహించడమే కాకుండా.. అక్రమంగా అబార్షన్లు చేస్తున్న వ్యవహారం పోలీసుల డెకాయ్ ఆపరేషన్‌లో బట్టబయలైంది. నాగోల్ పోలీస్ స్టేషన్ సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌ ‌మల్కాజిగిరి జిల్లా జైపురి కాలనీ రోడ్ నెంబర్-2లో శంకర్ ఇంటికి చెందిన రెండు షట్టర్లను అద్దెకు తీసుకుని బండారు వెంకట లక్ష్మి “కేసరి ఫస్ట్ ఎయిడ్ సెంటర్” పేరుతో కొంతకాలంగా నిర్వహిస్తోంది. విశ్వసనీ య సమాచారం మేరకు అక్కడ అక్రమం గా అబార్షన్లు నిర్వహిస్తున్నట్టు తెలుసుకున్న ఎల్బీనగర్ ఎస్‌వోటీ బృందం, నాగోల్ పోలీసులు సంయుక్తంగా డెకాయ్ ఆపరేషన్ చేపట్టారు. గర్భిణీగా ఓ మహిళా కానిస్టేబుల్‌ను కేంద్రానికి పంపించారు. అక్కడ ఉన్న వీర రేవతి అనే మహిళ ఎలాంటి వైద్య విద్యార్హతలు లేకపోయినా, ప్రభుత్వ అనుమతులు లేకపోయినా అబార్షన్ చేయడానికి ముందుకు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. గర్భిణులను తనకు పరిచయమున్న స్కానింగ్ సెంటర్లకు పంపించి, స్కానింగ్ నివేదికల ఆధారంగా అబార్షన్‌లు చేస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. డెకాయ్ ఆపరేషన్‌లో భాగంగా మహిళా కానిస్టేబుల్ వద్ద నుంచి రూ.10 వేలు తీసుకుని, కొన్ని ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అబార్షన్ చేసేందుకు సిద్ధమయ్యారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం అక్కడే ఉన్న పోలీసు బృందం చర్యలు చేపట్టడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వెంకట లక్ష్మి, రేవతిని అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినట్టు సీఐ తెలిపారు. సెంటర్‌‌లో ఉన్న పలు రికార్డులు, వైద్య సామాగ్రి, మందులు, ఇతర ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా వైద్య సేవలు అందించడం, గర్భస్రావాల నిర్వహణ, చట్టాల ఉల్లంఘన తదితర అంశాలపై కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు పొందిన ఆస్పత్రులు, అర్హత కలిగిన వైద్యుల వద్ద మాత్రమే వైద్య సేవలు పొందాలని, అనధికారిక కేంద్రాలను ఆశ్రయించి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -