కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
సింగరేణి కార్మిక కుటుంబాలకు
నియామక పత్రాలు అందజేత
నవతెలంగాణ-నస్పూర్
సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి అని, కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. వైద్యపరంగా పని చేయలేని సింగరేణి ఉద్యోగులకు సంబంధించి వారి కుటుంబ సభ్యులకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో శనివారం నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల సంక్షేమంలో రాజీపడేది లేదని, సంస్థ తెలంగాణ ప్రజల ఆస్తి అని, ప్రజాస్వామ్య రక్షణలో జాగరూకతతో ఉంటామని తెలిపారు. వైద్యపరంగా పనిచేయలేని సింగరేణి ఉద్యోగులకు సంబంధించి వారి కుటుంబ సభ్యుల్లో 335 మంది అర్హత గల అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తున్నామన్నారు. భవిష్యత్‌లో మరింత మంది అర్హులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సింగరేణి సంస్థను కాపాడుకుందామని, తెలంగాణ ఆస్తిగా తీర్చిదిద్దుదా మని అన్నారు. సింగరేణి కార్మికులకు రూ.కోటి 25లక్షల బీమా అందిస్తున్నామని, 30వేల మంది ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందికి బోనస్ అందించామని తెలిపారు. కోల్ బ్లాక్స్‌లలో పూర్తి నిఘా వ్యవస్థ మధ్యలో పని జరుగుతుందని, తెలంగాణ వనరులను కాపాడతామని తెలిపారు. కోల్‌బెల్ట్ ప్రాంతంలోని శాసనసభ్యులతో మాట్లాడి కార్మిక సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం, సింగరేణి సంస్థ సమన్వయంతో సింగరేణి బొగ్గు గనులను మరింత అభివృద్ధి చేసి కార్మికుల సంక్షేమం దిశగా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూని కేషన్స్, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, షెడ్యూల్ తెగలు, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, రవాణా, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం వినోద్, సత్యనారాయణ, మలోత్ రాందాస్ నాయక్, సింగరేణి కార్మిక సంఘాల ప్రతినిధులు వాసిరెడ్డి సీతారామయ్య, జనక్ ప్రసాద్ పాల్గొన్నారు.
సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



